పొమ్మనలేక పొగ.. ప్లాన్-బి అమలు చేస్తున్న జగన్

నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలి దఫా మంత్రి పదవి రాకపోవడంతో ఆయనలో కాస్త అసంతృప్తి ఉంది, రెండో దఫా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి రూపంలో…

నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలి దఫా మంత్రి పదవి రాకపోవడంతో ఆయనలో కాస్త అసంతృప్తి ఉంది, రెండో దఫా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి రూపంలో ఆయనకు చెక్ పెట్టబోతున్నారు. దీంతో ఆయన 2024నాటికి తనదారి తాను చూసుకుంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వెంకటగిరి వేదికగా ప్లాన్ బి ఆలోచించారు సీఎం జగన్.

మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తన వర్గాన్ని తాను ఏర్పాటు చేసుకుంటున్నారు. నెల్లూరులో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఏదైనా సమస్యలుంటే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు తనను సంప్రదించొచ్చని సూచించారు. నేదురుమల్లి హయాంలో వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఆయన జనంలోకి వెళ్తున్నారు.

వెంకటగిరిలో వైసీపీ తరపున ఎమ్మెల్యే ఉండగా.. మరో నాయకుడు తన వర్గం వారిని ఏకం చేస్తున్నారంటేనే ఏదో జరుగుతోందని అర్థం. అందులోనూ ఆనంకి వ్యతిరేకంగా ఉండే బ్యాచ్ మొత్తాన్ని రామ్ కుమార్ రెడ్డి చేరదీస్తున్నారు. ఇటీవలే ఆనం వర్సెస్ నేదురుమల్లి మధ్య జిల్లాల పునర్విభజన సమయంలో మాటల తూటాలు పేలాయి. 

ఒకరకంగా జగన్ సపోర్ట్ తోటే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరిలో ఓ అడుగు ముందుకేస్తున్నారని తెలుస్తోంది. 2024నాటికి ఆనంకు జగన్ చెక్ పెట్టబోతున్నారని, అందుకే రామ్ కుమార్ రెడ్డిని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు.

మరి ఆనం సంగతేంటి..?

2019 ఎన్నికల్లో వెంకటగిరిలో పోటీ ఇష్టం లేకపోయినా వైసీపీ టికెట్ అనివార్యం కావడంతో అక్కడికి వెళ్లి పోటీ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ లేదా రూరల్ సీటు ఆశించారాయన. కానీ జగన్ ఆదేశంతో వెంకటగిరి వెళ్లాల్సి వచ్చింది. అప్పటినుంచీ ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. మంత్రి పదవి ఆశించినా రాలేదు. ఓ దశలో సొంత పార్టీ నేతలపైనే ఆనం విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇటీవల జిల్లాల విభజన సమయంలో నిరాహార దీక్షల్లో కూర్చుని మరీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇటీవల ఆయన మాట మన్నించి మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచుతున్నట్టు వార్తలొచ్చాయి. అంతవరకు ఆనం విజయం సాధించినా.. 2024 ఎన్నికల్లో ఆనంకు వైసీపీ సీటు దక్కక పోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అంతకు ముందే ఆనం పార్టీ మారే ఆలోచన చేస్తారనే వాదన కూడా ఉంది. ఆనం ఓ అడుగు ముందుకేసినా, జగన్ మరో అడుగు ముందుకేసి రామ్ కుమార్ తో చెక్ పెట్టించినా.. వచ్చే ఎన్నికలనాటికి వెంకటగిరి రాజకీయం రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.