తనకు విజయం తప్ప, వ్యక్తులు ముఖ్యం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ చాలా స్పష్టంగా తన మనసులో మాటను తేల్చి చెప్పారు. గెలిచే వారికే టికెట్లు, ఓడిపోయే వారిని పెట్టుకుంటే వారితో పాటు పార్టీకి నష్టమని ముఖంమీదే చెప్పేశారు.
జుట్టు వుంటే ఎన్ని రకాలుగా అయినా కొప్పు కట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సర్వేలు ప్రారంభమవుతాయన్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతే తానేమీ చేయలేనన్నారు. ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోడానికి కొంత సమయం ఇచ్చారు. అప్పటికీ పనితీరును మెరుగుపరుచుకోక పోతే తానేమీ చేయలేనని ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇలా చెప్పడానికి నాయకుడికి చాలా ధైర్యం కావాలి.
జగన్ను విజేతగా నిలబెట్టింది కూడా ఈ గుండె ధైర్యం, నిర్మొహమాటతత్వమే. మొహమాటానికి పోయి ప్రజాదరణ లేని నాయకులకు టికెట్ ఇచ్చి, అంతిమంగా నష్టపోయేది తానే అని జగన్కు బాగా తెలుసు. అందుకే 175కు 175 సీట్లలో గెలుపొందాలంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలని మరోసారి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎవరైనా విజేత వెంట నడవడానికి ఇష్టపడతారని జగన్కు బాగా తెలుసు.
అందుకే ఎమ్మెల్యేలపై వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి, సర్వే నివేదికల ఆధారంగా టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆయన కసరత్తు చేస్తున్నారు. పలు సంస్థలతో సర్వేలు చేయిస్తూ, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రాలేదు. అలాంటి నాయకులకు మళ్లీ టికెట్లు ఇస్తే, మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని జగన్ అప్రమత్తం అయ్యారు.
ప్రజాదరణే ప్రామాణికంగా టికెట్లు ఇస్తానని జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇలా చెప్పడానికి చంద్రబాబు సాహసిస్తారా? ప్రశ్నే లేదు. ఇటీవల కాలంలో చంద్రబాబు మాటల వరకూ చెబుతున్నారు. చేతలకు ఇంకా ఆయన పనిపెట్టలేదు. నాన్చివేత ధోరణితో చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటారు. అదే ఆయనకు నష్టం తెస్తోంది.
కానీ జగన్ రాజకీయ పంథా తన ప్రధాన ప్రత్యర్థి కంటే భిన్నమైంది. జగన్ సెంటిమెంట్లకు లొంగే రకం కాదు. జగన్ వెంట నడిచే వాళ్లకు ఆ విషయంలో క్లారిటీ వుంది. అందుకే జగన్ నిర్మొహమాటంగా మాట్లాడినా ఎవరూ నోరు తెరవని పరిస్థితి.