ప్రజల కోసం తాము ఏం చేశామో చెప్పుకోవడం ఒక్కటే ఎల్లప్పుడూ విజయ సూత్రం కాదు. తాము చేసిన పనులతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థులు చేయలేక పోయిన వైనం కూడా వివరించాలి.
ఒక్కొక్క పథకం విషయంలో.. ప్రజా శ్రేయస్సు కోణంలోంచి ఒక్కొక్క కార్యక్రమం గురించి తెలుగుదేశం పార్టీ చేసినదెంత? తమ ప్రభుత్వం చేస్తున్నది ఎంత? పోల్చి చెప్పడం అనేది ఎప్పటికీ మంచి ప్రయోగం అవుతుంది.
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. తన నాలుగేళ్ల సంక్షేమ పాలన ను తెలుగుదేశంతో పోల్చి సమీక్షిస్తూ ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్టును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘వై ఎపి నీడ్స్ జగన్’ అనే పేరుతో సర్కారు సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నది.
ఈ కార్యక్రమం అక్టోబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. సుమారుగా అక్టోబర్ వరకు ఇప్పుడు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం జరుగుతుంది.
ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో ఈ కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే జగనన్న సురక్ష పేరిట మరో కార్యక్రమాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నారు. దాని తరువాత ‘వై ఎపి నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని మొదలుపెడతారని తెలుస్తోంది.
రాష్ట్రంలో నిర్మాణాత్మక అభివృద్ధి ఏమీ జరగడంలేదని ప్రత్యర్ధులు తన మీద నిందలు వేస్తున్న నేపథ్యంలో ఏం జరిగిందో ప్రజలకు విపులంగా చెప్పడానికి జగన్ ఈ మార్గం ఎన్నుకున్నారు. కేవలం తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే కాదు గత ఐదేళ్లలో తెలుగుదేశం చేసినది ఏమిటో కూడా పోల్చి ప్రజలకు వాస్తవాలను చెప్పబోతున్నారు.
జగన్ వ్యూహం అంతటికే పరిమితం కావడం లేదు. అభివృద్ధి విషయంలో గత రెండు దశాబ్దాల చరిత్రను రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కరించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులతో ప్రారంభించి.. చంద్రబాబు నాయుడు చేసిన పనులతో పోలుస్తూ ఎవరి కృషి ఎంత ఉన్నదో నిగ్గుతేల్చే పనిలో జగన్ పడ్డారు.
మొత్తానికి ప్రభుత్వం సంకల్పిస్తున్న సరికొత్త కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్ అనేది పార్టీకి ప్రజాదరణ పెరిగే దృష్ట్యా గడపగడపకు కార్యక్రమం కంటే మంచి ఫలితాలు ఇస్తుందని పార్టీ వర్గాల ఆశతో ఉన్నాయి!
వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తావించి పోల్చి చెప్పేట్లయితే.. తెలుగుదేశం తమ గురించి డప్పు కొట్టుకునే పట్టిసీమ, పోలవరం, నీటి ప్రాజెక్టులు అనేకం కేవలం బూటకం అని.. వైఎస్ గరిష్టంగా పూర్తిచేసిన ప్రాజెక్టులను వీరు కేవలం చివరిదశ పనులు చేసి ముగించారని.. తెలుగుదేశం చెప్పేదంతా మాయ అని ప్రజల ఎదట నిరూపించినట్లు అవుతుందని పార్టీ అభిమానులు సంతోషిస్తున్నారు.