జనసేన అధిపతి రాజకీయంగా అమాయకుడు అని ఎవరైనా అనుకుంటే వాళ్లు వెర్రివాళ్లు. ఆయనకు చాలా తెలివైన ఎత్తుగడలు వున్నాయి. అవి ఆయన స్వంతమా? వెనుక నుంచి ప్లానింగ్ వేరే జనాలదో, వేరే పార్టీలదో వుందా? అంటే అది వేరే సంగతి. కానీ ఒకటే సమస్య, తాను చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పడంలో పవన్ తడబడతారు. ఎక్కువ సార్లు రాంగ్ మీనింగ్ కన్వే అవుతుంటుంది. ఇంతకీ పవన్ పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటి? చూద్దాం.
ముందుగా పార్టీలను కలపడం ప్రారంభించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నది ఆయన అసలు ప్లాన్. ఎడమొహం, పెడమొహంగా వున్న తేదేపా-భాజపాలను కలిపే ప్రయత్నం చేసారు. చేస్తున్నారు. మొత్తానికి అమిత్ షా వరకు చంద్రబాబు వెళ్లగలిగారు. ఆ విధంగా వ్యూహం మొదటి అంకం పూర్తయింది.
కాపులను బిసి లను కలపడం అన్నది ఈ మిషన్ లో రెండో భాగం. ఆ మేరకు ఓ ప్రసంగం చేసారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఇలా.. అలా అంటూ సుద్దులు చెప్పారు. మొత్తం మీద దానా దీనా చెప్పింది ఏమిటంటే కాపులు బిసి ల కోసం సీట్లు త్యాగాలు చేయాలి. పాత వైరాలు మరచిపోయి కమ్మ సామాజిక వర్గంతో కలవాలి.
తరువాత మూడో స్టేజ్ కు వచ్చారు. ముస్లింలు, హిందువుల ఓట్లు కలిపే ప్రయత్నం. హిందు లీడర్లను నమ్మడం లేదు. క్రిస్టియన్ లీడర్ ను నమ్ముతున్నారు అంటూ మాట్లాడడం ప్రారంభించారు. జగన్ క్రిస్టియన్ అని చెప్పి, ముస్లింలను అటు దూరం చేసి, ఇటు హిందూ ఓటు బ్యాంక్ కు జతచేసే ప్రయత్నం ప్రారంభించారు. ఆ విధంగా మరో స్టెప్ ప్లానింగ్ అమలు జరిగింది.
ఇప్పుడు నాలుగో స్టేజ్ కు దారి తీస్తున్నారు పవన్. కాపుల్లో వంద మంది యువత వున్నారు అనుకుంటే వాళ్లలో ప్రభాస్, చరణ్, బన్నీ, మహేష్, ఇలా రకరకాల హీరోల ఫ్యాన్స్ వుంటారు. వున్నారు. కాపు యువత హీరోల వారీగా చీరిపోయి వున్నారు. సోషల్ మీడియాలో హీరోల వారీగా కొట్టుకుంటూనే వుంటారు. అందుకే వారి అందరి ఓట్లు కాపులైనా కూడా జనసేనకు రావేమో అన్న భయం. అలాగే వేరే కులాల యువత ఓట్లు హీరోల ఫ్యానిజం వల్ల తనకు రావేమో అన్న అనుమానం.
అందుకే ఇప్పుడు అందరు హీరోలను పొగడడం మొదలు పెట్టారు. వాళ్లు తన కన్నా గొప్పోళ్లు అని చెప్పి ఫ్యాన్స్ ఇగో ను సంతృప్తి పరచడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఫ్యాన్స్ ఓట్ల ఓ దగ్గరకు సమీకరించాలన్నది ప్లాన్.
పార్టీలు.. కులాలు.. మతాలు.. ఫ్యాన్స్ ఇలా అందరినీ ఓ దరికి చేర్చుకుంటూ రావాలన్నది పవన్ ప్లాన్. ఎందుకయ్యా అంటే జగన్ ను ఓడించడానికి.
బాగానే వుంది. కానీ జగన్ ను ఓడించి ఎవరిని గద్దె ఎక్కించాలి? ఇంత వ్యూహం పన్ని, ఇంత తెలివిగా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న పవన్‌ను కాదు. ఎందుకంటే ఆయన 175లో పోటీ చేయడం లేదు. మహా అయితే ఇరవై లేదా ముఫై స్థానాల్లోనే.
అంటే పవన్ చేసే ఈ రాజకీయ యాగ ఫలితం ఎవరికయ్యా అంటే… చంద్రబాబు కోసం.
అదే కనుక జనం ఆలోచిస్తే ఈ వ్యూహం ఫలితం ఇవ్వడం, ఈ యాగం ఫలించడం కష్టమేమో?