పేరేమో జనసేన. చేసేదేమో కుల రాజకీయాలు. ఈ మాత్రం సంబరానికి సమాజాన్ని ఉద్దరిస్తాననే మాటలెందుకనే ప్రశ్న వినిపిస్తోంది. మనిషి ఆలోచనే వారి నడవడిక అంటారు. రాజకీయాల్లో కుల ప్రభావాన్ని ఎవరూ కాదనలేనిది. అంత మాత్రాన కులమే అన్నింటికి మూలం అనే అభిప్రాయం తప్పు. అదే నిజమైతే అత్యల్ప జనాభా కలిగిన రెడ్డి, కమ్మ కులస్తులు పాలకులు అయ్యే అవకాశమే వుండదు.
కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం ఆ రెండు కులాలే పాలించాయి. ఇప్పుడు కూడా ఏపీలో కమ్మ, రెడ్డి కులాలకు సంబంధించిన నాయకుల మధ్య అధికార మార్పిడి జరుగుతోంది. కులం కంటే నాయకత్వ లక్షణాలే అధికారానికి చేరువ చేస్తాయి. ఏపీలో బీసీల తర్వాత అత్యధిక జనాభా కలిగిన కాపు, బలిజ వాటి అనుబంధ కులాలున్నప్పటికీ, వారికి సమర్థవంతు లైన నాయకులు లేకపోవడమే శాపంగా మారింది.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ రూపంలో తమకంటూ ఒక నాయకుడు వచ్చాడని ఆయన సామాజిక వర్గంలో మెజార్టీ ప్రజానీకం అనుకుంటోంది. అయితే పవన్‌కల్యాణ్ మాత్రం చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధం కావడంతో వారంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. పవన్‌కల్యాణ్ వ్యవహార శైలితో కాపులు మిగిలిన సామాజిక వర్గాలకు దూరమవుతున్న పరిస్థితి. వారాహియాత్రలో పవన్ ప్రసంగంలో కులం తప్ప, మరో ప్రస్తావనే లేదు.
నోరు తెరిస్తే కులమనే మాట తప్ప, మరొకటి మాట్లాడ్డానికి రాలేదన్నట్టుగా వుంది ఆయన తీరు. జగన్ ప్రభుత్వం పదవులన్నీ రెడ్లకే కట్టబెడుతోందని ఆయన విమర్శించారు. మిగిలిన కులాల వారికి టాలెంట్ లేదా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను మిగిలిన కులాలకు దూరం చేసే క్రమంలో పవన్ కులం కేంద్రంగా విమర్శలు చేస్తున్నారని అందరికీ తెలుసు. తాను కులం గురించే మాట్లాడ్తానని, భరించాల్సిందే అని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఏదైనా మితంగా వుంటే మంచిది. శ్రుతిమించితే అనర్థం. బహుశా ఈ విషయం పవన్‌కు తెలిసినట్టు లేదు.
సీఎం వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్‌లో దిట్ట. పవనే రెండు రోజుల క్రితం ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో మీరంతా ఆయన వెంట నడుస్తున్నారని వాపోయారు. పవన్‌కు తెలియని సంగతి ఏంటంటే… జగన్‌ను ఆయన సామాజిక వర్గం కంటే, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బీసీలు ఎక్కువగా అభిమానిస్తారు. జగన్ తమ వాడే అని సొంతం చేసుకుంటారు. ఆ కులాలకు ఇటు ప్రభుత్వం, అటూ స్థాని సంస్థల్లో 70 శాతానికి పైగా పదవులు జగన్ ఇచ్చారు. ఆ అధికారాన్ని ఆస్వాదిస్తున్న కారణంగానే జగన్‌ను తమ వాడిగా వారంతా భావిస్తున్నారు.
ఇదే పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… పార్టీ స్థాపించిన పదేళ్లకు ప్రధాన కార్యదర్శి పదవిని భర్తీ చేశారు. అది కూడా తన సొంత అన్న నాగబాబుకు జనరల్ సెక్రటరీ పదవి కట్టబెట్టారు. అలాగే పీఏసీ పదవిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చారు. కనీసంలో పార్టీకి సంబంధించిన ఒకట్రెండు పదవులు కూడా దళితులు, గిరిజనులు, బీసీలు, క్రిస్టియన్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలనే ఆలోచన పవన్‌కు ఎందుకు రాలేదు?
తన వరకూ వస్తే మాత్రం… కులం, రక్త సంబంధం తప్ప మరొకటి కనిపించదు. జగన్‌పై విమర్శలు చేయడానికి మాత్రం ఉన్నవి, లేనివి పోగేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఈ కుల నాయకుడికి వ్యసనంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే రాజకీయ పంథా అయితే జనసేనకు బదులు కులసేనగా పేరు మార్చుకుంటే మంచిదనే హితవు చెప్పేవాళ్లు పెరిగిపోతున్నారు. పాముకు కోరల్లో మాత్రమే విషం వుంటుంది. కానీ పవన్‌కు నిలువెల్లా కులమే. తన కులాన్ని అభిమానించడం వరకూ పరిమితమైతే ఇబ్బంది లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇతర కులాలపై విషం చిమ్మడానికి సిద్ధమయ్యారు. ఇదే ప్రమాదకరంగా మారింది. కనీసం నాగరిక సమాజం ఛీఛీ అని అసహ్యించుకుంటుందనే బెరుకు కూడా పవన్‌కు లేకపోవడం గమనార్హం.