టాలీవుడ్ దేని మీద నడుస్తోంది ఇప్పుడు అన్న ప్రశ్న వేసుకుంటే వచ్చే సింగిల్ ఆన్సర్.. నాన్ థియేటర్ రైట్స్. కోవిడ్ తరువాత ఈ నాన్ థియేటర్ రైట్స్ అనేవి బాగా పెరిగాయి. అవే రైట్స్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి.
నిర్మాతకు ఒకప్పుడు కేవలం థియేటర్ రెవెన్యూ మాత్రమే ఆదాయం. ఆ తరువాత శాటిలైట్ ఆదాయం వచ్చి చేరింది. ఆ తరువాత హిందీ డబ్బింగ్ కమ్ డిజిటల్ రైట్స్. ఆ తరువాత ఒటిటి రైట్స్. ఒక్కో టైమ్ లో ఒక్కో ఆదాయం బలంగా వుంటూ వస్తోంది. శాటిలైట్ రైట్స్ బలంగా వున్న టైమ్ లో కూడా థియేటర్ రైట్స్ తగ్గలేదు. ఇటు థియేటర్ రైట్స్, అటు శాటిలైట్ ఆదాయం బలంగా వస్తున్న టైమ్ లో హిందీ డబ్బింగ్ డబ్బులు యాడ్ అయ్యాయి. అప్పటికీ థియేటర్ ఆదాయం పెద్దగా తగ్గలేదు. కానీ వన్స్ ఓటిటి ఆదాయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి థియేటర్ ఆదాయం తగ్గుముఖం పడుతూ వస్తోంది. అంతే కాదు అదే ఓటిటి కారణంగా శాటిలైట్ ఇన్ కమ్ దాదాపుగా పడిపోయింది.
కానీ అన్ని రకాల ఆదాయాలు చూసి,నిర్మాణ వ్యయం పెరుగుతూ వస్తోంది. ఇలా పెరుగుతున్న ఆదాయం ముందుకే వెళ్తోంది కానీ వెనక్కు రావడం లేదు. కానీ అదే సమయంలో ఇప్పుడు హిందీ డిజిటల్, డబ్బింగ్, అలాగే ఓటిటి అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు అయిన కొనుగోలుదారులు బడ్జెట్ అయిపోయింది అనే కారణంతో వెనుకంజ వేస్తున్నారు.
ఇప్పటికే అగ్రిమెంట్ అయిపోయిన సినిమాలు సంగతి పక్కన పెడితే కొత్త సినిమాలు ప్లాన్ చేయాలంటే ముందు వెనుక ఆడుతున్నారు. నాన్ థియేటర్ ఆదాయం లెక్కలు వేసుకుని రంగంలోకి దిగేవారు కొందరు వుంటారు. వారు తమ తమ ప్రాజెక్ట్ లకు పాజ్ బటన్ నొక్కేసారు. ఏదో విధంగా మార్కెట్ చేయగలం అనే నమ్మకం వున్న వారు మాత్రం కాస్త ధైర్యం చేసి సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
కానీ పరిస్థితి ఇలా వున్నా కూడా, సినిమాల నిర్మాణ వ్యయం ఎప్పటికప్పుడు కొత్త మైలు రాళ్లను అందుకుంటోంది. మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల మీదుగా టాప్ రేంజ్ హీరోల వరకు సినిమాల వ్యయం 70 నుంచి 130 కోట్లు అన్నది మినిమమ్ అయిపోయింది. టాప్ హీరోలు అయితే 200 కోట్లకు చేరిపోతోంది. కానీ అదే సమయంలో మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు థియేటర్ నుంచి ముఫై కోట్ల మేరకు లాగాలి అంటే చాలా కష్టంగా వుంది. సీనియర్ హీరోలకు అతి కష్టం మీద 60 కోట్ల మేరకు తీసుకోగలుగుతున్నారు. టాప్ హీరోల సినిమాలకు 120 కోట్ల వరకు థియేటర్ బిజినెస్ వుంటోంది.
అంటే సినిమా నిర్మాణ వ్యయంలో ఒక వంతు వాటా మాత్రమే థియేటర్ల నుంచి వస్తోంది. మిగిలిన రెండు వంతులు నాన్ థియేటర్ మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ నాన్ థియేటర్ ఆదాయం రకరకాలుగా ఒడి దుడుకులకు గురవుతుండడంతో నిర్మాతలకు ఆందోళన మొదలైంది. నాన్ థియేటర్ పూర్తి కాకుండా సినిమాను విడుదల చేయడం కష్టం అవుతోంది. అందువల్ల కొన్ని సినిమాలు డేట్ లు వేసి కూడా మళ్లీ మార్చి, మార్చి వేయాల్సి వస్తోంది.
పరిస్థితి ఇలా వున్నా హీరోల రెమ్యూనిరేషన్లు ముందుకే వెళ్తున్నాయి తప్ప వెనక్కు రావడం లేదు. ఎవరి రేంజ్ కు తగినట్లు వారు తమ తమ రెమ్యూనిరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు లక్షల్లో వున్న చిన్న హీరోల రెమ్యూనిరేషన్లు ఇప్పుడు మూడు కోట్లకు చేరుకున్నాయి. మూడు కోట్లలో వుండే హీరోల రెమ్యూనిరేషన్లు పది కోట్లకు చేరాయి. పది కోట్లలో వుండే మిడ్ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లు 25 కోట్లకు చేరాయి. ఇక టాప్ హీరోల రెమ్యూనిరేషన్ల సరేసరి. గమ్మత్తేమిటంటే వరుసగా అరడజను ఫ్లాపులు ఇస్తున్నా కూడా రెమ్యూనిరేషన్లు తగ్గడం లేదు.
మరోపక్క రాను రాను బయ్యర్లు తగ్గిపోతున్నారు. జిల్లాకు ఇద్దరు తప్పితే ముగ్గురు మాత్రమే స్టాండర్డ్ బయ్యర్లు మిగిలారు. చాలా మంది బయ్యర్లు ముందుగా సినిమాను ఓకె చేసినా, విడుదల ముందు రోజుకు వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. దీనికి రెండు కారణాలు ఎగ్జిబిటర్ల నుంచి అడ్వాన్స్ లు అనుకున్న మేరకు రాకపోవడం, రెండవది ముందుగానే సినిమా టాక్ ఇండస్ట్రీలోంచి బిజినెస్ సర్కిళ్లలోకి వెళ్లిపోవడం. దాంతో తగ్గించి కట్టడం అన్నది లేదా చేతులు ఎత్తడం అన్నది కామన్ అయిపోయింది. సినిమా థియేటర్ మార్కెట్ అయిపోయింది అని సంబరపడడానికి లేదు. విడుదల ముందు రోజున ఏదైతే ఆదాయం పక్కాగా వస్తుందో అదే థియేటర్ ఆదాయం అనుకోవాల్సి వస్తోంది.
మరొపక్కన విడుదల డేట్ ల ప్లానింగ్ కూడా చిత్తాను సారం నడుస్తోంది. వస్తే అన్ని సినిమాలు ఒకే వారం వచ్చి పడడం,లేదూ అంటే రెండు మూడు వారాలు ఖాళీగా వుండిపోవడం. దీంతో రాను రాను థియేటర్లు మూత పడుతున్నాయి. నెలకు ఒక్క థియేటర్ అయినా మూత పడింది అన్న వార్తలు తరచు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితి చూస్తుంటే పెద్ద సినిమాలు, పెద్ద హీరోలకు పెద్దగా సమస్య కాదు కానీ, చిన్న హీరోలు, ఓపెనింగ్ తేలేని మిడ్ రేంజ్ హీరొలకు గడ్డుకాలం కనిపిస్తోంది. రాను రాను కనీసం ఇద్దరు ముగ్గురు చిన్న హీరోలు, ఇద్దరు ముగ్గురు మిడ్ రేంజ్ హీరోలు సినిమాల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేలా వుంది. అయితే ఇది ఇమ్మీడియట్ గా కాకపోవచ్చు. కనీసం ఓ ఏడాది పట్టొచ్చు. ఎందుకంటే వీళ్ల చేతిలో వున్న సినిమాలు పూర్తి అయిన తరువాత వాటి ఫలితం బట్టి వుంటుంది.
చాలా మంది హీరోలు సరైన ఓపెనింగ్ నే పుల్ చేయలేకపోతున్నారు. హిట్ అన్నది తెలిసి నాలుగైదు సినిమాల గ్యాప్ వచ్చినా రెమ్యూనిరేషన్లు తగ్గించడం లేదు. దీంతో కొత్త నిర్మాతలు తగ్గుతున్నారు. ఏడాదికి ఒక్కో హీరో సగటున చేసే సినిమాల సంఖ్య తగ్గుతోంది.
కొత్త సంవత్సరం బడ్జెట్ రావాలంటే కనీసం ఇంకో నాలుగైదు నెలలు పడుతుంది.మార్చి టు మార్చి అన్నది కార్పొరేట్ లెక్క. కొత్త బడ్జెట్ ను పెద్ద సినిమాలు తన్నుకుపోతే, చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తడుముకోవాల్సి వస్తుంది. నాన్ థియేటర్ ఆదాయం రావాలంటే కాంబినేషన్లే కీలకంగా మారాయి. ఇలా కాంబినేషన్లు సెట్ చేసుకున్నవారు అంతా నాన్ థియేటర్ బడ్జెట్ ను ముందే తీసుకుపోతే, మిగిలిన సినిమాలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.
ఈ పరిస్థితి మారాలంటే క్వాలిటీ సినిమాలు రావాలి. థియేటర్ ఆదాయం పెరగాలి. క్వాలిటీ సినిమాలు వస్తే థియేటర్ ఆదాయానికి లోటు వుండదని ప్రతి ఏటా కొన్ని సినిమాలు ఇప్పటకీ నిరూపిస్తూనే వున్నాయి. అందువల్ల అదే స్టాండర్డ్ ఇన్ కమ్. దాని మీదే మేకర్లు దృష్టి పెట్టాల్సి వుంటుంది.