ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెలరేగిపోయారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి తానేటి వనిత నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలను ఆయన అరాచక శక్తులుగా అభివర్ణించారు. అంతేకాదు, ఆ శక్తులన్నీ అడవుల్లో, అజ్ఞాతంలోనో లేవని ఆయన కామెంట్స్ చేయడం విశేషం. ప్రభుత్వం, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలని అనుకునే శక్తులన్నీ అడవుల్లో, అజ్ఞాతంలో లేవని పరోక్షంగా ప్రతిపక్షాల గురించి సీఎం వ్యాఖ్యానించారు. ఆ శక్తులన్నీ ప్రజాజీవితంలో వుంటూ వారి జీవితాలపై దాడి చేయడం ఇటీవల చూస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లాంటి పదాల అర్థం ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని, పోలీసులు, న్యాయస్థానం నుంచి లాక్కోవడం కాదన్నారు. అవినీతి, నేరాలకు పాల్పడి వాటికి సంబంధించి ఆధారాలు అన్నీ చూపిన తర్వాత న్యాయస్థానాలు వారికి అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే, న్యాయమూర్తులపై ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు చేసేవిగా ఆయన అభివర్ణించారు.
ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించే దుష్టశక్తులపై చర్యలు తీసుకోవడంలో ఎలాంటి మొహమాటానికి పోవద్దని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు.