మంత్రి పదవి పోతున్నదనే బాధో లేక ఎలాగైనా కొనసాగించుకోవాలనే కాంక్షో… మొత్తానికి మంత్రి నారాయణస్వామి అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి నారా చంద్రబాబునాయుడిపై నోరు పారేసుకుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెచ్చి దయచూపుతారని నారాయణస్వామి ఆలోచిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల చంద్రబాబునాయుడిపై నారాయణస్వామి రెచ్చిపోతున్నారు.
అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తనయుడు లోకేశ్‌పై ఇష్టానుసారం మాట్లాడి అభాసుపాలైన సంగతి తెలిసిందే. రాజకీయ చరమాంకంలో ఉన్న నారాయణస్వామి పెద్దరికంగా వ్యవహరిస్తూ, హుందాగా రిటైర్ కావాల్సిన సమయంలో ఎందుకింత చిల్లరగా వ్యవహరిస్తున్నారనే అసహనం సొంత పార్టీలో కూడా వ్యక్తమవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల శ్రీవారిని ఇవాళ మంత్రి నారాయణ స్వామి సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై ఆకాశమే హద్దుగా ప్రశంసలు, ప్రత్యర్థి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం వైఎస్ జగన్ సీఎంగా ఉంటారన్నారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ ప్రధాని అవుతారని సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్‌కు మరింత మనోధైర్యాన్ని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నట్టు నారాయణస్వామి తెలిపారు.
వేషాలు వేసుకునే వాళ్లు రాజకీయాలకు పనికి రారని, ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని నాడు చంద్రబాబు ప్రగల్భాలు పలికారని ఆయన గుర్తు చేశారు. నేడు అదే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి వారసుడిగా చెలామణి అవుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం వుంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని నారాయణ స్వామి సవాల్ విసిరారు. కొత్త పార్టీ పెట్టుకుని చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని నారాయణస్వామి సవాల్ విసరడం విశేషం.
టీడీపీ తరపున పోటీ చేస్తే, అధికారంలోకి వస్తారని భయపడుతున్నట్టుగా నారాయణస్వామి మాటలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కొత్త పార్టీ పెట్టాలా? టీడీపీ నుంచే పోటీ చేయాలా అనేది చంద్రబాబు వ్యక్తిగత విషయం. టీడీపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో ఆలోచించడం వదిలేసి, సంబంధం లేని అంశాలపై మాట్లాడ్డం నారాయణస్వామికే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో నారాయణస్వామి నోరు జారడం పరిపాటైందని అనేవాళ్లు లేకపోలేదు.