Advertisement

Advertisement


Home > Movies - Reviews

Mishan Impossible Review: మూవీ రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్

Mishan Impossible Review: మూవీ రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్

టైటిల్: మిషన్ ఇంపాజిబుల్
రేటింగ్: 2/5
తారాగణం: తాప్సీ, హర్ష్ రోషన్, భాను ప్రకాష్, రిషబ్ శెట్టి, హరీష్, సత్యం రాజేష్, రవీంద్ర విజయ్ తదితరులు 
కెమెరా: వై. దీపక్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాత: ఎన్.ఎం పాషా, అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి 
దర్శకత్వం: స్వరూప్ ఆర్ ఎస్ జె 
విడుదల తేదీ: 1 ఏప్రిల్ 2022

చాలానాళ్ల తర్వాత తాప్సీని తెలుగు తెర మీద చూడడం, చిరంజీవి ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ప్రచారం చేయడం, వీటికి మించి "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" ని తీసిన దర్శకుడినుంచి వస్తున్న సినిమా కావడం.. మొదలైన కారణాల వల్ల "మిషన్ ఇంపాజిబుల్" పై ఒక తరహా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 

"దావూద్ ఇబ్రహీం ని పట్టుకోవడానికి ఊరునుంచి పారిపోయిన ముగ్గురు స్కూలు పిల్లలు.." ఇలా న్యూస్ పేపర్ ఉపశీర్షికలాంటి సింగిల్ లైన్ చెప్పగానే ఎవరికైనా కాస్త ఆసక్తి కలగడం సహజం. 

అయితే ఆ పాయింటుకి పూర్వాపరాలేవిటి, కథ-కథనం ఏవిటి అనేవి ప్రధానాంశాలు. 

కథకుడు తనకు నచ్చినట్టు రాసుకుంటాడు, దర్శకుడు తోచినట్టు తీసుకుంటాడు, ప్రేక్షకుడు చచ్చినట్టు చూసుకుంటాడు అనే ఆలోచనలో ఉంటే కంటెంట్ రిచ్ సినిమాలు తయారు కావు. 

చాలా తెలివిగా కనిపించే ముగ్గురు అమాయకులైన పిల్లల కథ ఇది. "ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్" అనే నానుడిని బేస్ చేసుకుని వీళ్ల కథ నడుస్తుంది. ఆ పిల్లల అమాయకత్వాన్ని నేర పరిశోధనలో ఆరితేరిన ఒక లేడీ ఎలా వాడుకుందనేది కథనం.

చైల్డ్ ట్రాఫికింగ్ లో ఆడ, మగ తేడా లేకుండా అందర్నీ కిడ్నాప్ చేస్తుంటారు క్రిమినల్స్. ఆడపిల్లల్ని వేశ్యావృత్తిలోకి దింపుతున్నట్టు అర్థమయింది కానీ, మగపిల్లల్ని ఏం చేయడానికి కిడ్నాప్ చేసారో తెర మీద క్లారిటీ ఇవ్వలేదు. 

1990ల్లో అప్పటి బాలనటుడు తరుణ్ హీరోగా "తేజ" అనే సినిమా వచ్చింది. తన తెలివితేటలతో ఒక సైకో కిల్లర్ లాంటి వాడిని ముప్పుతిప్పలుపెట్టి మట్టికరిపిస్తాడు. ఆ తరహాలో ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే ఏదైనా రాసుకునుంటే మరింత ఆసక్తిగా ఉండేది ఈ "మిషన్ ఇంపాజిబుల్". 

దర్శకుడికి పాత సినిమాల మీద అభిమానం, మోజు చాలానే ఉందని కొన్ని డయలాగ్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే కమల్ హాసన్ "మహానది" లోని ఒక సీన్ నుంచి కూడా స్ఫూర్తి పొంది ఇందులో ఒక సన్నివేశం పెట్టారు. 

సినిమా బిగినింగులో ఇది జరిగిన కథనుంచి స్ఫూర్తి పొందినట్టుగా చెప్పినా..ప్రేక్షకుడికి తెర మీద సినిమా చూస్తున్నప్పుడు కలగాల్సింది బిలీవబిలిటీ. అది లోపించినప్పుడు ఎంత చెప్పినా డిస్కనెక్ట్ అయిపోవడం సహజం. 

ఈ సినిమాలో తాప్సీ ఉన్నా మరెవరున్నా తేడా పడేది కాదు. చాలా ఫ్లాట్ గా ఉండి, నటనకి పెద్దగా స్కోప్ లేని పాత్ర తనది. అసలు తన బ్యాక్ స్టోరీ ఏవిటో ఎవ్వరికీ తెలీదు. 

పిల్లలు ముగ్గురూ మాత్రం చాలా బాగా చేసారు. మంచి ఈజ్ తో ఎక్స్ప్రెషన్స్ ని పండించారు. 

నేపథ్య సంగీతం బాగుంది. చాలా చోట్ల డ్రాప్ అవుతున్న సమయంలో నిలబెట్టింది. అయినా సెకండాఫుని, క్లైమాక్స్ ని మాత్రం ఏ క్రాఫ్టూ కూడా కాపాడలేకపోయింది. 

మొదటి సగంలో ఉన్నంత బిగువు సెకండాఫులో లేదు. క్లైమాక్స్ లో ఎటువంటి టెన్షన్ లేకుండా అంతా ప్రెడిక్టిబుల్ గా, సౌకర్యవంతంగా రాసుకున్నట్టుంది. 

పాయింట్ బాగానే ఉన్నా, దర్శకుడిలో ఎంగేజ్ చేయగలిగే టాలెంట్ ఉన్నా..ఏ మాత్రం మేథోమథనం జరగని కారణంగా ఈ స్క్రిప్ట్ చాలా చప్పగా తయారైంది. చప్పగా ఉన్న పదార్థాన్ని ఎంత అందంగా సర్వ్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కదు. 

ఎన్నో క్రైం థ్రిల్లర్స్ ఆకట్టుకునే విధంగా తయారవుతున్న ఈ రోజుల్లో, దర్శకుడు తనకు అనువుగా ఉండే విధంగా స్క్రీన్ ప్లే రాసేసుకుని ప్రేక్షకుల్ని మెప్పించాలనుకోవడం సాహసమే. 

"ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" ఆడడానికి ముఖ్యకారణం కథనంతో పాటూ నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్. ఆ చిత్రం అందుకున్న విజయం కారణంగా దర్శకుడికి కాస్తంత ఓవర్ కాన్ ఫిడెన్స్ తో ఈ సినిమాని "టేకిట్ ఫర్ గ్రాంటెడ్" గా తీసుకుని తీసినట్టుగా అనిపించింది. 

బాటం లైన్: మిషన్ ఎవాయడెబుల్

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను