ఆ టికెట్‌పై బ‌లిజ నేత‌ల మ‌ధ్య‌ ఫైట్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తి అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌కు ప్ర‌త్యేక‌త ఉంది. అక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హించ‌డం ఎంతో గొప్ప‌గా భావిస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మిక‌త రీత్యా తిరుప‌తి, తిరుమ‌ల‌కు ఉన్న విశిష్ట‌త అలాంటిది. రాజ‌కీయంగా తిరుప‌తి అసెంబ్లీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తి అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌కు ప్ర‌త్యేక‌త ఉంది. అక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హించ‌డం ఎంతో గొప్ప‌గా భావిస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మిక‌త రీత్యా తిరుప‌తి, తిరుమ‌ల‌కు ఉన్న విశిష్ట‌త అలాంటిది. రాజ‌కీయంగా తిరుప‌తి అసెంబ్లీ స్థానం ఏ ఒక్క‌డి అడ్డాకాదు. తిరుప‌తి పార్ల‌మెంట్ విష‌యానికి వ‌స్తే… ఒక‌ప్పుడు కాంగ్రెస్‌, ప్ర‌స్తుతం వైసీపీకి కంచుకోట‌. తిరుప‌తి పార్లమెంట్ స్థానం ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యింది.

ఇదిలా వుండ‌గా తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో వైసీపీకి భూమ‌న నేతృత్వంలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం వుంది. గెలిచినా, ఓడినా ఆయ‌న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబ ప్ర‌తినిధిగా ద‌శాబ్దాలుగా అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే కేడ‌ర్ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ, నాయ‌క‌త్వ కొర‌త ప‌ట్టి పీడిస్తోంది. 2014 నుంచి సుగుణ‌మ్మ కుటుంబ‌మే టీడీపీకి అండ‌గా ఉంటోంది. వైసీపీపై 2014లో టీడీపీ అభ్య‌ర్థి ఎం.వెంక‌ట‌ర‌మ‌ణ గెలుపొందారు. ఆయ‌న ఆక‌స్మిక మృతితో స‌తీమ‌ణి సుగుణ‌మ్మ తెర‌పైకి వ‌చ్చారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిపై సుగుణ‌మ్మ గెలుపొందారు.

2019లో వైసీపీ చేతిలో సుగుణ‌మ్మ ఓట‌మిపాల‌య్యారు. అధికారం పోయిన నేప‌థ్యంలో సుగుణ‌మ్మ రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. అడ‌పాద‌డ‌పా మిన‌హాయించి ఆమె యాక్టీవ్‌గా లేరు. ముఖ్యంగా సుగుణ‌మ్మ అల్లుడు సంజయ్ వ్య‌వ‌హార శైలి టీడీపీకి బాగా న‌ష్టం వాటిల్లుతోంది. దీంతో తిరుప‌తి తెర‌పై ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ దివంగ‌త డీకే ఆదికేశ‌వులనాయుడు కుమారుడైన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డీకే శ్రీ‌నివాస్ పేరు కూడా తెరపైకి వ‌చ్చింది. అయితే తాను రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకోవ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదే సంద‌ర్భంలో తిరుప‌తికి చెందిన వ్యాపార‌వేత్త‌, బ‌లిజ నాయ‌కుడు జేబీ శ్రీ‌నివాస్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

ఫైనాన్షియ‌ర్ అయిన జేబీ శ్రీ‌నివాస్ టీడీపీ లేదా జ‌న‌సేన టికెట్ ఆశిస్తున్నారు. సుగుణ‌మ్మ‌, ఆమె అల్లుడు సంజ‌య్‌పై త‌న సామాజిక వ‌ర్గంతో పాటు ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌తే త‌న‌కు పాజిటివ్ అవుతుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. బ‌లిజ యూత్‌ను వెంట తిప్పుకుంటూ టీడీపీ, జ‌న‌సేన అగ్ర‌నేత‌ల దృష్టిలో ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. మరోవైపు జేబీ శ్రీ‌నివాస్ రాక‌ను సుగుణ‌మ్మ వ‌ర్గం అడ్డుకుంటోంది. జేబీ శ్రీ‌నివాస్ వ‌ద్ద ఆర్థిక బ‌లం త‌ప్ప‌, అంగ‌బ‌లం లేద‌ని సుగుణ‌మ్మ వ‌ర్గం అంటోంది. జేబీ శ్రీ‌నివాస్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీలోకి రానివ్వ‌మ‌ని సుగుణ‌మ్మ వ‌ర్గం తేల్చి చెబుతోంది.

త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను సుగుణ‌మ్మ వ‌ర్గం అడ్డుకోలేర‌ని, అవ‌స‌ర‌మైతే జ‌న‌సేన నుంచి పోటీ చేసి, ఆమె విజ‌యాన్ని అడ్డుకుంటాన‌ని జేబీ శ్రీ‌నివాస్ హెచ్చ‌రిస్తున్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన సుగుణ‌మ్మ‌, శ్రీ‌నివాస్ మ‌ధ్య అప్పుడే టికెట్ గొడ‌వ స్టార్ట్ అయ్యింది. వీళ్లిద్ద‌రి మ‌ధ్య బ‌లిజ సామాజిక వ‌ర్గం రెండుగా చీలిపోయింది. ప్ర‌స్తుతం తిరుప‌తిలో న‌డుస్తున్న రాజ‌కీయం ఇది.