కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఢీ అంటే ఢీ అని తలపడుతోంది. మరో ఏడాదిలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపే అని భావించిన టీఆర్ఎస్, దాన్ని అధికారం దగ్గరికి రాకుండా ప్రజల్లో బద్నాం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఇందులో భాగంగా బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసేందుకు అన్ని రకాల అవకాశాలను టీఆర్ఎస్ వాడుకుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని కేటీఆర్, హరీష్‌రావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ తెలంగాణ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న నిర్లక్ష్య, వివక్ష ధోరణులను కళ్లకు కట్టేందుకు యత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన రేటుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు పెరిగింది. ఈ ధర ఏప్రిల్ మొదటి తారీఖు అంటే నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలపై కేటీఆర్ ట్విటర్ వేదికగా దెప్పి పొడిచారు.
ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని కేటీఆర్ ఎద్దెవాద్దేవా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ ట్విటర్ వేదికగా ఎండగడుతున్నారు. ఇందులో వ్యంగ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.