ఈసారి వచ్చే మంత్రి ఎన్నికలను ఎదుర్కోవాలి. అంతే కాదు, జిల్లాలోని మొత్తం సీట్లు గెలిపించాలి. ఇదీ వైసీపీ పెద్దల స్ట్రాటజీ. అలా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వచ్చే కొత్త మంత్రి ఎవరు అన్న ఆసక్తి అయితే బాగా ఉంది. శ్రీకాకుళం అనగానే వెనకబడిన జిల్లాగా పేరుంది. అదే సమయంలో రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా కూడా చెబుతారు.
ఇక్కడ నుంచి ఎందరో నేతలు వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. మరెందరో దిగ్గజ నాయకులుగా ఎదిగారు. అలాంటి శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ నాలుగు దశాబ్దాలుగా పలుకుబడిని పెంచుకుని దూకుడుగా సాగుతోంది. ఎర్రన్నాయుడుతో మొదలుపెడితే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహననాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఇపుడు రాజకీయంగా కీలకంగా ఉన్నారు.
మరి వైసీపీ మంత్రి వర్గ విస్తరణలో ఈ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి అంటే కింజరాపు ఫ్యామిలీని ఢీ కొట్టి కొత్తగా జిల్లాగా ఎనిమిది సీట్లతో ఉన్న సిక్కోలులో ఫ్యాన్ గాలి పూర్తిగా వీచేలా చేసేవారికే చోటు అంటున్నారు. ఇక అలా చూసుకుంటే స్పీకర్ తమ్మినేని సీతారాంకి మంత్రి పదవి దక్కవచ్చు అంటున్నారు.
ఆయన బీసీ కాళింగ సామాజికవర్గానికి చెందిన నేత. విశేష అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయం పుట్టింది, మొదలెట్టిందీ టీడీపీలో అయినా కింజరాపు ఫ్యామిలీతో టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఢీ అంటే ఢీ కొడతారు. ఒక విధంగా ఆయన రాజకీయంగా ఆ ఫ్యామిలీతో అలుపెరగని తీరున పోరాడుతారు.
ఇపుడు అదే ఆయనకు అర్హత అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. విస్తరణలో కచ్చితంగా తమ్మినేనికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. పైగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి తమ్మినేని దశ తిరిగినట్లే అంటున్నారు. మరి ఆయన మీదనే వచ్చే ఎన్నికల్లో గెలుపు భారం కూడా ఉంది.