టాలీవుడ్ ఇలా భారీ రేట్ల పెడదారిలో వెళ్లడానికి మూల కారణం ఎవ్వరు? ఇదీ ఇప్పుడు డిస్కషన్ పాయింట్. దీనికి మూలం తమ దగ్గరే వుందని, దీనికి విరుగుడు కూడా తామే వేయగలమని డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తాము చేస్తూ వచ్చిన తప్పు ఇకపై చేయకుండా వుంటే బెటర్ అని, అప్పుడే ఈ టాలీవుడ్ భారీ రేట్ల బారి నుంచి బయటకు వస్తుందని చెబుతున్నారు. అయితే అది సాధ్యం అవుతుందా? కాదా? అన్నదే పాయింట్.
అసలు సినిమాల నిర్మాణానికి మేజర్ ఖర్చు హీరోల రెమ్యూనిరేషన్లు. అవి ఎలాగూ తప్పవు. డిమాండ్ అండ్ సప్లయ్ అన్నదే కదా కీలకం. కానీ ఈ రేట్ల నిర్ణయంలో కీలకపాత్ర వహించేవి వసూళ్లు. వాటి మీద ఆధారపడే రెమ్యూనిరేషన్లు వుంటాయి. అంతే కాదు ఆ వసూళ్ల మీద ఆధారపడే సినిమాల అమ్మకాల రేట్లు వుంటాయి.
ఓ సినిమా ఓ ఏరియాకు 20 కోట్లకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ మీద ఇస్తే 30 కోట్లు వసూలు చేస్ంది అనుకుందాం. తరువాత సినిమాకు వెంటనే 30 కోట్లు అడుగుతున్నారు. బయ్యర్లు తీసుకుని మునిగిపోతున్నారు. ఇలా రేట్లు సినిమా సినిమాకు మారిపోతున్నాయి. దీనికి అసలు కారణం వేరే వుంది.
నిర్మాతలతో మొహమాటం. మళ్లీ తమకు సినిమా ఇస్తారో, ఇవ్వరో అని, హీరోలతో ఆబ్లిగేషన్. అందుగే ఏ బయ్యర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కలెక్షన్లు వెల్లడించరు. వెల్లడించినా అవి సక్రమంగా వుండదు. పదిశాతం, ఇరవై శాతం కలపడం అనేది కామన్. సినిమా విడుదలకు ముందుగానే నిర్మాత వైపు నుంచి హెచ్చరిక వచ్చేస్తుంది. కలెక్షన్లు లీక్ చేయవద్దని. పైగా నెట్ కు షేర్ కు సంబంధం వుండదు. జిఎస్టీ కలుపుడు..తీసుడు అనేది మరో వ్యవహారం.
టాలీవుడ్ లోని ఓ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు నుంచే ఎక్కువగా ప్రతి సినిమా కలెక్షన్లు బయటకు వెళ్తుంటాయని టాక్. ఆ టీమ్ కు నచ్చిన సినిమాకు ఒకలా, నచ్చని సినిమాకు మరోలా కలెక్షన్లు వెళ్తుంటాయి. దాని మీద ఫ్యాన్స్ కొట్టుకుంటూ వుంటారు.
ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రతి బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ పక్కా పెర్ ఫెక్ట్ కలెక్షన్లు ఏ రోజుకు ఆ రోజు ప్రకటిస్తే ఎలా వుంటుంది? ప్రతి రోజూ నెట్ ఫిగర్ వెల్లడిస్తే…అసలు రంగు బయటపడిపోతుంది కదా.
దిల్ రాజు, ఆసియన్ సునీల్ లాంటి వాళ్లు తాము పంపిణీ చేసే సినిమాలు, తమ థియేటర్లలో ఆడే సినిమాల లెక్కలు ఏ రోజుకు ఆ రోజు డిస్ ప్లే సిస్టమ్ ద్వారా ప్రకటించేస్తే ఏ సమస్య వుండదు కదా.
ఇప్పుడు ఎలాగూ బ్లాక్ బిజినెస్ అన్నది తగ్గిపోయింది. జిఎస్టీ వచ్చిన తరువాత వైట్ పార్ట్ బాగా పెరిగిపోయింది.అందువల్ల కరెక్ట్ లెక్కలు చెప్పడం వల్ల వచ్చిన నష్టం లేదు. పైగా లాభమే. ఎందుకంటే అసలు లెక్కలు తెలిస్తే ఏ హీరో, ఏ సినిమా అసలు మార్కెట్ ఎంతో క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడు హీరోలు డిమాండ్ చేసే రెమ్యూనిరేషన్ లెక్కలు కూడా మారుతాయి. ఆపై అమ్మకాల రేట్లు కూడా మారుతాయి.
బయ్యర్లు సంఘటతమై, అక్కరలేని పోటీలకు పోకుండా, అసలు లెక్కలు తామే పక్కాగా బయటపెడితే తప్ప, టాలీవుడ్ లో ఈ భారీ వ్యవహారం ఆగదు. లేదంటే సినిమాకు ఓ బయ్యర్ వంతున, ఏడాదికి ఓ బయ్యర్ వంతున మాయమైపోతూనే వుంటారు. తమ చేతిలో అసలు సిసలు కలెక్షన్లు అనే బలమైన ఆయుధం వుంచుకుని, అక్కరలేని మొహమాటాలకు పోయి బయ్యర్లు బలైపోతున్నారు.
ఇప్పుడిప్పుడే ఆ దిశగా బయ్యర్లు ఆలోచిస్తున్నారు. అలా అని కలెక్షన్లు లీక్ లు ఇస్తే సరిపోదు. ఫేక్ అని ఫ్యాన్స్ కొట్టుకుంటారు. అఫీషియల్ గానే చెప్పాలి. అప్పుడే చాలా మంది హీరోల, సినిమాల అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు ఇదే బయ్యర్ల సర్కిళ్లలో డిస్కషన్ జరుగుతోంది.