హైదరాబాద్ లోని అత్తాపూర్ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మరవకముందే, అలాంటిదే మరో దుర్ఘటన జరిగింది. బైక్ పై వెళ్తన్న ఓ వ్యక్తిని కొంతమంది అడ్డుకున్నారు. విచక్షణరహితంగా దాడి చేశారు. కత్తులతో పొడిచి చంపారు. మృతుడ్ని యూసఫ్ గా గుర్తించారు పోలీసులు.
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఆజంపూరాకు చెందిన యూసఫ్, సెంట్రింగ్ చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో బైక్ పై వెళ్తున్నాడు. సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురుచూసిన, యువతి భర్త.. తన బంధువులతో కలిసి యూసఫ్ ను వెంబడించాడు. నడిరోడ్డుపై ఆపి దారుణంగా కొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఓవైపు యూసఫ్ ను భర్త నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తుంటే, రోడ్డు పక్కనే ఉన్న భార్య మౌనంగా చూస్తూ నిల్చుంది తప్ప ఎలాంటి స్పందన లేదు. ఈ దృశ్యాలన్నీ సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్వయంగా సౌత్ ఈస్ట్ ఎడిషనల్ డీసీపీ మనోహర్, ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షించారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటి నుంచి ఫూటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు.
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే సదరు వ్యక్తి యూసఫ్ ను చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేశారు.