నాని హీరోగా నటించిన సినిమా 'అంటే సుందరానికి'. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ మాటంటే, నానికి కోపం వస్తుంది. కొన్నేళ్ల తర్వాత అది క్లాసిక్ అవుతుందని గతంలో భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు నాని. అది ఎన్నేళ్ల తర్వాత అనేది వేరే సంగతి. ఇప్పుడీ మేటర్ మళ్లీ తెరపైకి రావడానికి ఓ కారణం ఉంది.
నానితో 'అంటే సుందరానికి' సినిమా తీసిన వివేక్ ఆత్రేయ, ఇప్పుడు మరోసారి అదే హీరోతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి వీళ్లిద్దరి కాంబినేషన్ ను డీవీవీ దానయ్య తెరపైకి తీసుకురాబోతున్నాడట.
ఈ సినిమా కోసం తన శైలిని పక్కనపెట్టి వర్క్ చేయబోతున్నాడట వివేక్ ఆత్రేయ. నాని కోసం ఓ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ రెడీ చేస్తున్నాడట. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి సెన్సిబుల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆత్రేయ. ఇలాంటి దర్శకుడి నుంచి యాక్షన్ థ్రిల్లర్ అంటే నమ్మడం కాస్త కష్టమే.
వివేక్ ఆత్రేయపై నానికి చాలా నమ్మకం. 'అంటే సుందరానికి' రిలీజైన తర్వాత కూడా వివేక్ ఆత్రేయతో మరో సినిమా చేస్తానని ప్రకటించాడు నాని. తనకు 2-3 స్టోరీలైన్స్ కూడా చెప్పాడంటూ ఆ టైమ్ లోనే తెలిపాడు. బహుశా.. అది ఇప్పుడు కార్యరూపం దాల్చినట్టు కనిపిస్తోంది.