ఆ హ‌క్కు ఒక్క జ‌న‌సేన‌కే ఉంది…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే కొన్ని ప్ర‌త్యేక‌మైన హ‌క్కులున్నాయనే రీతిలో వారి వ్య‌వ‌హార శైలి వుంది. అధికార‌, తోటి ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై జ‌న‌సేనాని, ఆ పార్టీ నాయ‌కులు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే కొన్ని ప్ర‌త్యేక‌మైన హ‌క్కులున్నాయనే రీతిలో వారి వ్య‌వ‌హార శైలి వుంది. అధికార‌, తోటి ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై జ‌న‌సేనాని, ఆ పార్టీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటారు. తిరిగి త‌మ‌పై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే మాత్రం వారు జీర్ణించుకోలేని ప‌రిస్థితి. ప్ర‌త్య‌ర్థుల‌పై ఎంత‌టి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డానికైనా జ‌న‌సేన నాయ‌కులు వెనుకాడ‌రు. జ‌న‌సేన అధిప‌తే నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతుంటే, ఇక ఆయ‌న అనుచ‌రుల‌ను క‌ట్ట‌డి చేసే ప‌రిస్థితి వుండ‌దు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. వారాహి యాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌యోగిస్తున్న భాష‌పై అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో వెట‌క‌రిస్తున్నారు.

ప్రశ్నించే హక్కు, తిట్టే హక్కు, చెప్పులు చూపించే హక్కు, ఎవరి పంచెలైనా ఊడదీసి చూసే హక్కు, ఎవరినైనా ఈడ్చుకుంటూ తన్నుకు పోయే హక్కు, ఎటుబడితే అటు రాజకీయం చేసే హక్కు, రుతుక్రమానుసారం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే హక్కు, చేగువేరా , వివేకానందుడు, పొట్టి శ్రీ‌రాములు కులాల‌ గురించి ఏకకాలంలో మాట్లాడే హక్కు, ఒక పద్ధతీ పాడూ లేకుండా బహిరంగంగానో రహస్యంగానో ఒక పార్టీతో మిలాఖాత్ అయ్యే హక్కు ఒక్క జనసేన పార్టీకి మాత్రమే ఉంద‌ని నెటిజ‌న్లు పోస్టులు పెట్ట‌డం విశేషం.

ఈ హ‌క్కు కేవ‌లం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన నాయ‌కుల‌కు మాత్ర‌మే వుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల హ‌క్కుని మిగ‌తా స‌భ్య స‌మాజం గౌర‌వించి తీరాల్సిందేన‌ని పంచాయ‌తీలు మొద‌లుకుని అసెంబ్లీ వ‌ర‌కూ తీర్మాణాలు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుందంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. జ‌న‌సేన అంటేనే ప్ర‌త్యేక హ‌క్కుల‌తో పుట్టింద‌ని దెప్పి పొడ‌వ‌డం గ‌మ‌నార్హం.