గద్దర్ …ఈ పేరు తెలుగు సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తీవ్రవాద విప్లవ రాజకీయాల నుంచి తప్పుకుని, వేటికైతే వ్యతిరేకంగా పోరాడారో, చివరికి వాటి పంచనే గద్దర్ చేరారు. యుద్ధ నౌకగా ఎంతో గౌరవంతో పిలుచుకునే గద్దర్… కాల క్రమంలో అనేక విమర్శలకు గురయ్యారు. మనిషిలో కాలం అనేక మార్పులు తీసుకొస్తుందనేందుకు గద్దర్‌కు మించిన సాక్ష్యం అవసరం లేదు.
79 ఏళ్ల వయసులో గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం విశేషం. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కార్యాలయానికి గద్దర్ వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకున్నట్టైంది. ఢిల్లీలో గద్దర్ మీడియాతో మాట్లాడుతూ తన పేరు విఠల్ అని, తన పాట పేరు గద్దర్ అని గర్వంగా చెప్పుకొచ్చారు. తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించానని, నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు. బంగారు తెలంగాణ కాలేదని, పుచ్చిపోయిన తెలంగాణ చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ విధానాలను ఆయన తప్పు పట్టారు. ధరణి పేరుతో కేసీఆర్ భూముల్ని మింగాడని ఆరోపించారు. పదేళ్ల తెలంగాణలో ప్రజాకాంక్షకు తగ్గట్టు పరిపాలన సాగలేదన్నారు.
దోపిడీ పార్టీ పోవాలని 79 ఏళ్ల వయసులో ప్రజాపార్టీ పెట్టినట్టు ఆయన అన్నారు. ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజల్ని చైతన్యవంతం చేశానన్నారు. ఇకపై పార్లమెంటరీ పంథాలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తానన్నారు. తాను భావ విప్లకారుడిగా చెప్పుకొచ్చారు. అడవిలో ఉన్నానని ఆయన అన్నారు.