జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన విప్లవాత్మక వ్యవస్థ సచివాలయాల ఏర్పాటు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నేరుగా ప్రజల వద్దకే పాలన తీసుకెళుతోంది. ఒకప్పుడు ప్రతి చిన్న పనికీ మండల కార్యాలయాలకు పరుగు తీయాల్సిన పరిస్థితి వుండేది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ బాధ తప్పింది. సచివాలయాల్లోనే దాదాపు అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్కో సేవకు ఒక్కో రకమైన రేటు వుండేది.
ఇదిలా వుండగా ఈ నెల 23 నుంచి వైసీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పథకాన్ని అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
కుల, నివాస, ఇన్‌కమ్ ట్యాక్స్, డెత్, మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, మ్యారేజ్, ఫ్యామిలీ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్, కొత్త రేషన్‌కార్డు నమోదు, కౌలు గుర్తింపు కార్డు తదితరాల కోసం ఎలాంటి ఫీజు లేకుండా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు.
దీంతో రానున్న నెల రోజులు సచివాలయాలు కిక్కిరిసే అవకాశాలున్నాయి. ఇంత వరకూ వీటి కోసం నామమాత్రంగా ఫీజు చెల్లిస్తున్నారు. ఆ మాత్రం కూడా చెల్లించాల్సిన అవకాశం లేకుండా, నెల రోజుల అవకాశాన్ని ఇవ్వడంతో అవసరమైన వారు సచివాలయాలకు పెద్ద సంఖ్యలో వెళ్లే అవకాశం వుంది. అయితే నెలరోజులు మాత్రమే సమయం ఇవ్వడం గమనార్హం.