కర్నాటకలో వెనిజులా ప్రయోగం!

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు. కర్నాటకలో మ‌హిళ‌ల‌ ఉచిత ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. కొత్త రూల్స్ పెట్టి ప్రయాణాల దూకుడు త‌గ్గించాల‌ని వారం రోజులకే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉచిత పథకం నిజంగా మహిళలకి…

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు. కర్నాటకలో మ‌హిళ‌ల‌ ఉచిత ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. కొత్త రూల్స్ పెట్టి ప్రయాణాల దూకుడు త‌గ్గించాల‌ని వారం రోజులకే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉచిత పథకం నిజంగా మహిళలకి మేలు చేకూర్చేదే. విద్యార్థినులకి, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ల‌కి ఎంతో ఊర‌ట‌. అయితే పని వున్నా లేకపోయినా బస్సు ఎక్కేవాళ్లు ఎక్కువ‌య్యారు. దాంతో తోపులాటలు, గొడవలు. బస్సు డోర్ ఊడిపోయేంత తొక్కిస‌లాట‌. ఎలాగూ టికెట్ లేదు క‌దా అని తీర్థ యాత్ర‌ల‌కి కూడా బ‌య‌ల్దేరారు. గత ఆదివారం అన్ని పుణ్య క్షేత్రాలు కిటకిటలాడి పోయాయి.

ఈ గోలలో డబ్బు పెట్టి ప్రయాణించే వాళ్లు నరకం చూస్తున్నారు. ఎక్కితే ల‌గ్జ‌రీ బ‌స్సు ఎక్కాలి. లేదంటే మానుకోవాలి. స్కూళ్ల‌కి, కాలేజీల‌కి వెళ్లేవాళ్లు టైమ్‌కి వెళ్ల‌లేక‌పోతున్నారు. తీర్థస్థలాల్లో వ్యాపారాలు పెరిగాయి కానీ, ప్రైవేట్ బ‌స్సులు న‌ష్టాల పాల‌య్యాయి. రైళ్ల‌లో జ‌నం త‌గ్గిపోయారు.  

త్వ‌ర‌లో ఉచిత బియ్యం అమలు చేయాలి. సంవత్సరానికి పదివేల కోట్లు కావాలి. కర్నాటక‌లో అంత బియ్యం పండ‌వు. కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేదు. దాంతో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అప్పుడే అయిపోలేదు. ఇంకా చాలా వున్నాయి. ఇదంతా చూస్తే వెనిజులా ప్ర‌యోగం గుర్తుకొస్తోంది.

వెనిజులా ఒకప్పుడు సంపన్న ఆయిల్ దేశం. హుగో చావెజ్ అధ్యక్షుడు అయిన తరువాత ప్రజ‌ల్ని పూర్తిగా తనవైపు తిప్పుకోడానికి  రకరకాల పథ‌కాలు ప్రవేశ పెట్టాడు. వీటిని బొలివేరియన్ మిషన్స్ అంటారు. విద్య, వైద్యం, ఆహారం పేద ప్రజలందరికీ అందాలని ఈ పథకాల ఉద్దేశం. నిజానికి ఇవి మంచి పథకాలు. కాగితాల మీద అద్భుతంగా కనిపిస్తాయి. అమలు లో దివాళా తీస్తాయి.

వయోజన విద్య కోసం 3 పథకాలు. చదువురానివాళ్ళకి నేర్పిస్తారు. డ్రాపవుట్స్‌ని కాలేజీలో చేరుస్తారు. పై చదువులకి సాయం చేస్తారు, స్ట‌యిఫండ్ ఇస్తామంటే ముస‌లీముత‌క చేరి పోయారు. డబ్బులొచ్చాయి కానీ చ‌దువు రాలేదు. సక్సెస్‌ రేట్ సూపర్ అని అధికారులు నివేదికలు ఇచ్చి, అవార్డులు అందుకున్నారు.

మామూలు బల్బుల‌ స్థానంలో ప్లొరొసెంట్‌ బ‌ల్బులు ఉచితంగా ఇచ్చి కరెంట్  ఖర్చులు తగ్గించాలనుకున్నారు. బల్బుల కంపెనీలు బాగుపడ్డాయి కానీ ఖర్చు తగ్గలేదు.

పాలు, ఆహార‌ధాన్యాలు, మాంసం పేదవాళ్ల‌కి డిస్కౌంట్ రేట్ల‌కి ఇచ్చారు. వెనిజులా వ్యవసాయ దేశంకాదు. అన్నీ దిగుమ‌తి చేసుకోవాలి. ఎక్కువ ధ‌ర‌కి కొని, త‌క్కువ ధ‌ర‌ల‌కి పంచ‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ కూలిపోయింది. త‌ర్వాత రోజుల్లో  సరుకులు దొరకక సూపర్ మార్కెట్లు దోపిడీ చేశారు.  

అన్నిటికంటే దారుణ‌మైంది మిషన్ నెవ‌డో. ఇది ఒక కుక్కపేరు. సైమన్ బొలివర్ అనే ఆయన వెనిజులా జాతిపిత. ఆయన పెంపుడు కుక్క నెవడో. ఆ పేరుతో ఒక పథకం పెట్టారు. కుక్కలకి ఉచిత వైద్యం. దాని యజమానులకి అదనం. వీధికుక్కల్ని సంరక్షిస్తే డబ్బులు. పైసలు వ‌స్తాయ‌నేస‌రికి  జనం కుక్కల్ని విరివిగా పెంచారు. ఈ పథకాల్ని మానిటర్ చేయడానికి అనేక వ్యవస్థలు. వాళ్ళకి జీతాలు.

తరువాత సరుకుల కొరత. గంటల తర‌బ‌డి క్యూలు. చివరికి టాయిలెట్ పేపర్ కూడా దొరక‌ని స్ధితి. టాయిలెట్‌ పేపర్ తయారీ ఫ్యాక్ట‌రీకి సైన్యాన్ని కాపలా పెట్టాల్సి వచ్చింది.

తీరిగ్గా స‌ర్వేలు చేస్తే తేలింది ఏమంటే ఈ పథకాలేవీ 10శాతం పేదవాళ్ల‌కి కూడా అందలేదట. అందిన వాళ్ల‌లో కూడా 10శాతం మంది అయినా పేదరికం నుంచి బయట‌పడలేదు.

దేశంలోని 70 శాతం సంపద 10 శాతం మంది చేతిలో వుంది. 90 శాతం మంది పేదరికంలోనే వున్నారు. మ‌న‌ దేశంలోని అనేక రాష్ట్రాల భవిష్య‌త్‌ వెనిజులానే. చరిత్ర నుంచి మనం పాఠమూ నేర్చుకోం. గుణ‌పాఠం అస్స‌లు నేర్చుకోం.

జీఆర్ మ‌హ‌ర్షి