ఏపీ రాజకీయ పోరు మారుతున్న దాఖలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి లెక్కలు వారివిగా ఉన్న ఈ వ్యవహారం ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టతకు అయితే రావడం లేదు. మొన్నటి వరకూ చంద్రబాబును నమ్మదు, దగ్గరికి చేర్చుకోదనుకున్న భారతీయ జనతా పార్టీ తన తీరులో స్పష్టమైన మార్పును చూపుతూ ఉంది.
చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ మార్పును చూపింది. తన అవసరం మేరకు భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు ఆడిన ఆటలు అన్నీ ఇన్నీ కావు! 1999 నుంచి ఆ ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. 99లో వాజ్ పేయి నాయకత్వంలోని బీజేపీతో జత కట్టిన చంద్రబాబు, 2004లో వారిని తనతో పాటు ఎన్నికలకు తీసుకెళ్లి నిండా ముంచాడు. ఆ వెంటనే బీజేపీని తీవ్రంగా విమర్శించడం చంద్రబాబుకే చెల్లింది.
చంద్రబాబు ను నమ్మి ముందస్తు ఎన్నికలకు వెళ్లి తమ సర్కారును కూలగొట్టుకున్న బీజేపీ చంద్రబాబు తీరుతో ఖిన్నురాలైంది. అయితే.. బీజేపీ నాయకత్వం చంద్రబాబు తీరును ఏ కోశానా ఎండగట్టలేకపోయింది. దానికి నాటి వెంకయ్యనాయుడు కారణమనే అభిప్రాయాలూ లేకపోలేదు. ఆ తర్వాత 2009 ఎన్నికల నాటికి కూడా బీజేపీ చంద్రబాబుకు నచ్చలేదు. అప్పుడు కమ్యూనిస్టులను కలుపుకుని వెళ్లిన చంద్రబాబు మూడో కూటమి అంటూ.. బీజేపీని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలను తిడుతూ ఎన్నికలకు వెళ్లాడు. ఆయనకు కమ్యూనిస్టులు అప్పుడు దోస్తులుగా నిలిచారు. ఇక ఆ ఎన్నికల్లో కూడా అధికారం అందకపోవడంతో.. 2014 నాటికి కమ్యూనిస్టుల కాడి పడేసి, చంద్రబాబు మళ్లీ కమలం పార్టీతో దోస్తీ చేశారు. ఆ మేరకు ప్రయోజనం పొందారు.
అయితే ఆ 2019 నాటికి మోడీ హవా ముగిసిందనుకుని చంద్రబాబు నాయుడు మళ్లీ ఆ పార్టీని తిట్టారు. కాంగ్రెస్ తో జత కట్టారు! చంద్రబాబు రాజకీయ చరిత్రలో అత్యంత దారుణ ఓటమి ఎదురైంది. ఆ ఎన్నికలు అయిన దగ్గర నుంచి బీజేపీ చెంత చేరడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు! మరి ఇన్నాళ్లూ ఆయనను ఖాతరు చేయనట్టుగా కనిపించిన బీజేపీ ముఖ్య నేతలు ఇప్పుడు అపాయింట్ మెంట్ లు ఇవ్వడంతో వీరి పొత్తు ఖరారు అనే అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అయితే చంద్రబాబును దరి చేర్చుకోవడానికి సానుకూలంగానే ఉన్న బీజేపీ ఇదే సమయంలో కొన్ని కండీషన్లను అయితే పెట్టవచ్చు ఈ సారికి! ఎందుకంటే చంద్రబాబు చరిత్ర అలాంటిది మరి. చంద్రబాబుతో పొత్తు అనేది కమలం పార్టీకి పెద్ద అవసరం లేని అంశమే అనుకుంటే, చంద్రబాబు మాత్రం పొత్తు కోసం నాలుగేళ్ల నుంచి పాకులాడుతూనే ఉన్నాడు. మరి ఈ పాకులాట ఈ సారి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. అపర రాజకీయ చాణక్యుడు అంటూ చంద్రబాబును పచ్చమీడియా ఎంత కీర్తించినా.. ఆయన ఎన్నికల రాజకీయం చేసినా.. అది బూమరంగ్ మారిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, 2009 నాటికి బీజేపీతో కలహించుకుని కమ్యూనిస్టులతో కూడటం చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించాయి తప్ప గెలిపించలేదు! 2019 నాటికి మోడీ గాలిని గమనించి అటు చేరడం సరైన ఎత్తుగడే కానీ, 2019 నాటికి అదే మోడీని తిడుతూ తనదైన రాజకీయం ఏదో చేయబోయి చంద్రబాబు మరింతగా నష్టపోయాడు. 23 సీట్లకు పరిమితం అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబును మళ్లీ బీజేపీ దగ్గరికి తీయాలన్నా ఈ సారి చాలా కండీషన్లు పెట్టవచ్చు. ఇదంతా చంద్రబాబు ఇచ్చిన ఆస్కారమే! ఒకవేళ 15 ఎంపీ టికెట్లను తమ పార్టీకే కేటాయించే తరహా కండీషన్ గనుక బీజేపీ పెడితే అలాంటి ప్రతిపాదనకు చంద్రబాబు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడితే.. అది తెలుగుదేశం పార్టీకి చాలా నష్టమే చేస్తుంది తప్ప లాభం కాదు.
లేదా జనసేనను బీజేపీలోకి విలీనం చేసుకుని.. పవన్ కల్యాణ్ ను సీఎంగా అభ్యర్థిగా బీజేపీ ప్రకటించి, మద్దతు ప్రకటించాలంటూ చంద్రబాబును తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టినా అది తెలుగుదేశం పార్టీకి శరాఘాతమే అవుతుంది.
వీటికి మించి.. మోడీ మానియా చాలా వేగంగా తగ్గిపోతోంది. కర్ణాటకలో తనే సీఎం అభ్యర్థిని అన్నట్టుగా మోడీ భీషణ ప్రచారపర్వాన్ని సాగిస్తే.. భారతీయ జనతా పార్టీ పరువు నిలుపుకోలేకపోయింది. ఇక లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. ఉత్తరాదిన కూడా గతం స్థాయిలో మోడీ హవా లేదని స్పష్టం అవుతోంది. అలాంటిది ఏపీలో మోడీ పేరుతోనో, బీజేపీ పేరుతోనో పడే ఓట్ల శాతం చాలా చాలా తక్కువ! పదేళ్ల కిందటే ఇది ఐదు శాతం లోపు ఉంది. ఇప్పుడు అది ఏ రెండు శాతం లోపుకు పడిపోయింది.
మరి ఇలాంటి తరుణంలో బీజేపీతో పొత్తు చంద్రబాబుకు కొత్త ఓట్ల శాతాన్ని తేవడాన్ని పక్కన పెట్టి, మోడీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలుగుదేశం భరించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. మోడీ హవా కడగడుతున్న సమయంలో ఆయనతో తెలుగునాట సావాసం టీడీపీని దెబ్బతీస్తుంది. ఇలా ఎన్నికల ముందు పొత్తులు, వ్యూహాల్లో తప్పులు చేస్తూ చిత్తైన చరిత్ర చంద్రబాబుకు ఉండనే ఉంది కూడా!