రిలేష‌న్షిప్ లో చీటింగ్ కు రీజ‌న్లు ఇవేనా!

మ‌నిషి కూడా జంతుజాలంలో భాగం. అయితే మేధ‌స్సు, దాని నుంచి వ‌చ్చిన ఆలోచ‌న‌, ఆ  పై ఏర్ప‌డిన నాగ‌రిక‌త వ‌ల్ల మ‌నిషి జంతువు నుంచి వేర‌య్యాడు. అయితే ఎంత వేరైనా.. మ‌నిషిలో జంతుప్ర‌వృత్తి మ‌రెన్ని…

మ‌నిషి కూడా జంతుజాలంలో భాగం. అయితే మేధ‌స్సు, దాని నుంచి వ‌చ్చిన ఆలోచ‌న‌, ఆ  పై ఏర్ప‌డిన నాగ‌రిక‌త వ‌ల్ల మ‌నిషి జంతువు నుంచి వేర‌య్యాడు. అయితే ఎంత వేరైనా.. మ‌నిషిలో జంతుప్ర‌వృత్తి మ‌రెన్ని శ‌తాబ్దాలు గ‌డిచినా ఉండ‌నే ఉంటుంది.  ఎందుకంటే మ‌నిషి కూడా జంతు ప‌రిణామ‌క్ర‌మ‌మే కాబ‌ట్టి. జంతు ప్ర‌వృత్తికి మ‌నిషి దూరంగా జ‌రిగిన అంశాల్లో లైంగిక ప‌ర‌మైన అంశం ముఖ్య‌మైన‌ది.

లైంగిక విష‌యంలో మృగ‌తృష్ణ‌ను మ‌నిషి దూరం చేసుకున్నాడు. కుటుంబం, వావివ‌ర‌స‌ల‌ను ఏర్పాటు చేసుకున్నాడు. బోలెడ‌న్ని సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్ల మ‌ధ్య‌న వివాహాన్ని అల‌వ‌ర్చుకున్నాడు. నైతిక‌త‌ను ఉప‌దేశించుకున్నాడు. ఇలా శ‌తాబ్దాల క్రిత‌మే మ‌నిషి లైంగిక ప్ర‌వృత్తి కుటుంబ‌, సామాజిక కుట్టుబాట్ల మ‌ధ్య‌న చేరింది. ఇందులో నైతిక‌త‌కు మాత్రం ఒక్కో కాలంలో ఒక్కో నిర్వ‌చ‌నం ఇవ్వ‌బ‌డింది.

యాభై యేళ్ల కింద‌టి వ‌ర‌కూ ఒక మగాడు ఇద్ద‌రు, ముగ్గురు మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకోవ‌డం స‌మాజం వ్య‌తిరేకించ‌ని అంశ‌మే. ఇప్పుడు అది ఏ ర‌కంగానూ స‌మర్థ‌నీయ‌మైన అంశం కాదు. ఇలాంటి అంశాల్లో సామాజిక విలువ‌లు కాలానికి, దేశానికి, స‌మాజానికి అనుగుణంగా మారిపోయాయి. మారిపోతూనే ఉంటాయి.

మ‌రి ఇన్ని విలువ‌లు, క‌ట్టుబాట్లు.. ఇంకా ఏవేవో అన్నింటినీ చుట్టూ పెట్టుకుని మ‌నుగ‌డ సాగిస్తున్నా మ‌నిషిలో లైంగిక ప్ర‌వృత్తి విష‌యంలో ప‌క్క‌చూపులు ఉండ‌నే ఉంటాయి. ఇదేమంత విడ్డూర‌మైన అంశం కూడా కాదు. క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయాలు మ‌నిషిని నియంత్రించ‌డానికి ఏర్పాటు చేసిన అంశాలు. ఇన్ని ఉన్నా.. చిల‌క్కొట్టుడు ధోర‌ణి మాత్రం స‌హ‌జంగానే ఉంటుంది.

పెళ్లైనా ..అంద‌మైన అమ్మాయి క‌నిపిస్తూ చూపుతిప్పుకోలేక‌పోవ‌డం మ‌గాడి నైజం. ఆక‌ట్టుకునే మ‌గాడు ఆక‌లిగా చూస్తున్నా.. అత‌డితో చూపులు క‌లిపే అతివ‌ల‌కూ లోటుండ‌దు. ఇది అత్యంత స‌హ‌జ‌మైన ధోర‌ణి. పెళ్ల‌య్యాకా అన్ని కోరిక‌లూ తీరిపోతాయి, ఇక చూపుల‌కు చోటే ఉండ‌ద‌నుకోవ‌డం మాత్రం అమాయ‌క‌త్వం. పైకి మ‌నిషులు ఎన్ని విలువ‌లు చెప్పినా.. ఎవ్వ‌రూ చూడ‌కుంటే మాత్రం చీక‌టి త‌ప్పుల‌కు వెనుకాడ‌క‌పోవ‌చ్చు. కుటుంబం, పెన‌వేసుకున్న బంధాలు మ‌నిషిని చాలా వ‌ర‌కూ నియంత్రించినా .. కొన్ని సార్లు మాత్రం మ‌నిషి స్వేచ్ఛ‌ను తీసుకోవ‌చ్చు.

మ‌రి అందుకు కార‌ణాలు ఏమిటి.. అంటే, క‌న్ఫెష‌న్స్ లో ప్ర‌ధానంగా కొన్ని అంశాలే వినిపిస్తున్నాయి.  

మ్యారేజ్ లైఫ్ బోర్ కొట్ట‌డం…

వ‌ర్క్ లైఫ్ లో విప‌రీతంగా నిమ‌గ్నం అయిపోయి, ఇంటికి వెళ్లి క‌నీసం పార్ట్ న‌ర్ తో పెద్ద‌గా మాట్లాడ‌క‌పోవ‌డం. అక్క‌డా ఆఫీసు ప‌నే పెట్టుకోవ‌డం, సాన్నిహితంగా గ‌డిపే స‌మ‌యం బాగా త‌క్కువైపోవ‌డం ప‌క్క‌చూపులు చూసేందుకు కార‌ణాల్లో ముఖ్య‌మైన‌ద‌ని రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు.  ఇలా వైవాహిక జీవితంలో సాన్నిహిత్యంగా గ‌డిపే స‌మ‌యం బాగా త‌క్కువైపోవ‌డంతో.. వేరే మార్గాల గురించి చూపులు అధికం కావొచ్చ‌ని, ఇలాంటి స్థితిలో ఉన్న వారికి అవ‌కాశాలు ల‌భించిన‌ప్పుడు అవి శారీర‌క బంధాలుగా మారొచ్చ‌ని చెబుతున్నారు.

క‌మిటెడ్ కాక‌పోవ‌డం!

పెద్ద‌లు చెప్పార‌ని పెళ్లి చేసుకున్న ఒక‌ మ‌గాడికి వైవాహిక జీవితం ప‌ట్ల ఏ మాత్రం ఆస‌క్తి లేక‌పోవ‌చ్చు! భార్య‌తోనే సంబంధం అనే క‌మిట్ మెంట్ కు అత‌డి మ‌న‌స్త‌త్వ‌మే రాజీ ప‌డ‌క‌పోవ‌చ్చు! అత‌డి త‌త్వ‌మే అది అయిన‌ప్పుడు.. పెళ్లి చేసే వాళ్లే ఈ విష‌యం గురించి ఆలోచించాల్సింది. క‌మిటెడ్ మెంటాలిటీ కాని వారిని ప‌క్క చూపులు చూడ‌కుండా క‌న్వీన్స్ చేయ‌డం తేలికేమీ కాదు!

అవ‌కాశాలు వ‌స్తున్నాయి!

నేనేమీ ఎవ‌రితో సెక్సువ‌ల్ రిలేష‌న్ షిప్ కోస‌మూ బ‌ల‌వంతం చేయ‌డం లేదు. నా చార్మ్ కొద్దీ అలాంటి అవ‌కావాలు వ‌స్తున్నాయి. వాటిని ఎంజాయ్ చేస్తున్నా. ఇందులో ఎవ్వ‌రినీ చీట్ చేయ‌డ‌మే లేదు.. అనే వాద‌నా ఉంటుంది ఇలాంటి వ్య‌వ‌హారాల్లో. త‌న‌ను చూసి అమ్మాయిలే మోహిస్తున్న‌ప్పుడు త‌ను ఎందుకు ఊరికే ఉండాల‌నేది ఈ వాద‌న సారాంశం. అయితే ఈ విష‌యాలు త‌న భార్య వ‌ద్ద ర‌హ‌స్యం అని, ఆమెకు తెలియ‌దు కాబ‌ట్టి ప్ర‌త్యేకంగా బాధ‌పెడుతున్న‌దీ ఏమీ లేద‌ని ఇలా లైఫ్ స‌ర‌దాగా ఉంద‌నేది మ‌రో క‌న్ఫెష‌న్ స్టేట్ మెంట్!

ఎమోష‌నల్, సెక్సువ‌ల్ డిస్ శాటిస్ ఫ్యాక్ష‌న్!

త‌న పార్ట్ న‌ర్ త‌న‌తో ఎమోష‌న‌ల్ గా మ్యాచ్ కాక‌పోవ‌డం, లేదా సెక్స్ విష‌యంలో త‌ను కోరుకున్న‌ట్టుగా లేక‌పోవ‌డం.. ఈ రెండు కార‌ణాలూ కూడా ప‌క్క అవ‌కాశాల వేట‌కు అతి ముఖ్య‌మైన కార‌ణాలు. ఎమోష‌న‌ల్ గా ప‌ర‌స్ప‌రం విష‌యాల‌ను షేర్ చేసుకోలేక‌పోతే ఆ త‌ర‌హాలో మ్యాచ్ అయ్యే మ‌రో వ్య‌క్తితో అనుబంధం ఏర్ప‌డ‌వ‌చ్చు. అలాగే లైంగికంగా సంతృప్తి లేక‌పోతే కూడా అందుకోసం వేరే అవ‌కాశాల‌ను చూడ‌వ‌చ్చు. అయితే లైంగిక సంతృప్తికి కొల‌మానం అంటూ ఏమీలేక‌పోవ‌చ్చు! కొత్త కోరిక‌లూ పుట్టుకురావొచ్చు!