కుప్పం చిర‌కాల క‌ల నెర‌వేర్చిన జ‌గ‌న్‌

చిత్తూరు జిల్లా కుప్పం చిర‌కాల క‌ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నెర‌వేర్చారు. త‌మ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజ‌న్‌గా ప్ర‌క‌టించాల‌ని కుప్పం వాసులు ద‌శాబ్దాలుగా కోరుతున్నారు. అక్క‌డి నుంచి 35 ఏళ్లుగా చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ…

చిత్తూరు జిల్లా కుప్పం చిర‌కాల క‌ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నెర‌వేర్చారు. త‌మ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజ‌న్‌గా ప్ర‌క‌టించాల‌ని కుప్పం వాసులు ద‌శాబ్దాలుగా కోరుతున్నారు. అక్క‌డి నుంచి 35 ఏళ్లుగా చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికీ రెవెన్యూ డివిజ‌న్ మాత్రం కల‌గానే మిగిలిపోయింది. త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం రెవెన్యూ డివిజ‌న్ క‌ల‌ను వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నెర‌వేర్చ‌డానికి ముందుకు రావ‌డం స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

జిల్లాల పునర్వ్య‌స్తీక‌ర‌ణ‌ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు అవ‌త‌రించ‌నున్నాయి. శ్రీకాళహస్తి, కుప్పం, నగరి కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇక అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. ప్రస్తుత చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ జనవరిలో విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌లో పలమనేరు డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ ఇచ్చారు. అయితే న‌గ‌రి, కుప్పంల‌ను కూడా రెవెన్యూ డివిజ‌న్‌లుగా మార్చాల‌నే డిమాండ్లు వెల్లువెత్తాయి. మాజీ ముఖ్య‌మంత్రి, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్ర‌బాబునాయుడు కూడా తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతాన్ని రెవెన్యూ డివిజ‌న్‌గా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌డం తెలిసిందే.

ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీలో కూడా ప్ర‌క‌టించారు. సుదీర్ఘ కాలం పాటు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబు కుప్పాన్ని ఇంత వ‌ర‌కూ రెవెన్యూ డివిజ‌న్‌గా, మున్సిపాలిటీ ప్ర‌క‌టించ‌కుండా నిర్ల‌క్ష్యం చేశార‌ని ముఖ్య‌మంత్రి స‌హా అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు విమ‌ర్శించారు. 

చివ‌రికి కుప్పాన్ని రెవెన్యూ డివిజ‌న్‌గా ఎంపిక చేసి, అందులోకి బైరెడ్డిపల్లె, వి.కోట, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం  మండ‌లాల‌ను చేర్చిన‌ట్టు స‌మాచారం. నేడో, రేపో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.