ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. ఏడాదికి ప్రజల మీద 1400 కోట్ల వరకు భారం అదనంగా పడనుంది. ఇది ఖచ్చితంగా భారమే. ధరల పెంపు అనేది ప్రభుత్వాలకు ఇమేజి పరంగా నష్టమే. దేశంలో ప్రతి వస్తువూ ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్తు ఒక్కటీ ఏమాత్రం పెరగకుండా ఎక్కడ ఉన్నది అక్కడే ఉండేలా మెయింటైన్ చేయడం అనేది అసాధ్యమైన సంగతి. పెంపు వలన రాగల రాజకీయ నష్టానికి సిద్ధపడే జగన్ సర్కారు ధరలు పెంచింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబునాయుడు చూపిస్తున్న వైఖరి మాత్రం ఇంకో ఎత్తు!
తాజాగా విద్యుత్తు చార్జీల పెంపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చేయబోతున్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రస్తుతం పెంచినది 1400 కోట్ల అదనపు భారం అయితే.. జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 12వేల కోట్ల రూపాయల విద్యుత్తు భారం పెంచేశాడని చంద్రబాబునాయుడు కాకమ్మ కబుర్లు కూడా వినిపించారు. ఈ విషయంపై దశలవారీ పోరాటం చేస్తామని కూడా చంద్రబాబు సెలవిస్తున్నారు. ఇంతకంటె సిగ్గుమాలిన మాటలు వేరొకటి ఉంటాయా అని ప్రజలు విస్తుపోతున్నారు.
ఒకవేళ చంద్రబాబునాయుడు చెబుతున్న కాకమ్మ లెక్కల ప్రకారం.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పెంచిన విద్యుత్తు భారం 12వేల కోట్లు నిజమే అనుకుందాం. కానీ.. ఇదే మూడేళ్లలో పెట్రోలు ధరలు ఎంత పెరిగాయి. పెట్రోధరల పెంపువలన రాష్ట్ర ప్రజలమీద పడిన అదనపు భారం ఎంత? కేంద్రం ఇంత దారుణంగా పెట్రో ధరలు పెంచుతూ పోతోంటే.. చంద్రబాబునాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ.. ఎందుకు చూస్తూ కూర్చున్నారు.
విద్యుత్తు చార్జీలు పెరిగితే.. అవి నేరుగా వినియోగదారులకు మాత్రమే భారం పెంచుతాయి. కానీ పెట్రోలు ధరలు పెరిగితే.. వస్తురవాణాతో ముడిపడి ఉండే వ్యవహారం గనుక.. ప్రజలు వినియోగించే ప్రతి వస్తువు రేటు మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. అలాంటిది.. ప్రజలను అన్ని రకాలుగా కుదేలు చేసేసే పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుల గురించి నోరు తెరవని ఈ పెద్దమనిషి.. పల్లెత్తు మాట అనడానికి కూడా దమ్ములేని వ్యక్తి… జగన్ మీద విరుచుకుపడడానికి అవకాశం వచ్చింది కదాని.. కరెంటు చార్జీల మీద మాత్రం ఉద్యమం చేస్తానని అంటుండడం తమాషా.
ఇంకో సంగతి ముఖ్యంగా ప్రస్తావించాలి. జగన్ రెడ్డి అసమర్థతవల్లే.. రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆయన అంటున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్తు చార్జీలను తగ్గించి ఉండేవాళ్లమని అంటున్నారు. ఇంతకుమించిన సిగ్గుమాలిన మాట ఇంకొకటి ఉండదు. లేస్తే మనిషిని కాననే చేతగాని వాడి మాటలే ఇవి. ఇన్ని నాటకాల డైలాగులు వల్లిస్తున్నారు గానీ.. మళ్లీ తెలుగుదేశాన్ని అధికారం లోకి తీసుకువస్తే.. ఇప్పుడు జగన్ పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గిస్తానని గానీ, యూనిట్ ధర ఫలానా రేటుకంటె పెరగకుండా అయిదేళ్లూ పరిపాలన సాగిస్తానని గానీ చంద్రబాబునాయుడు చెప్పడం లేదు.
చంద్రబాబునాయుడు వ్యవహారం మొత్తం రాజకీయ సిగ్గుమాలిన తీరుగా కనిపిస్తోంది. ప్రజలను వంచించడం, అవకాశం వచ్చింది కదాని.. జగన్ మీద బురద చల్లడానికి ప్రయత్నించడం తప్ప మరో తీరు ఆయనలో కనిపించడం లేదు.