ఇటీవలి కాలంలో రాజకీయ ప్రత్యర్థులను కూడా కలచివేసిన విషాదం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం. వివాదరహితుడిగా సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా ప్రత్యర్థుల్లో కూడా గుర్తింపు ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి లేని లోటు ప్రభుత్వానికి నిజంగానే తీరేది కాదు.
రాజకీయంగానేకాకుండా, వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో సన్నిహితుడు అయిన గౌతమ్ రెడ్డి మరణం ఆయనను కుంగతీసింది. అయితే తన స్నేహితుడు లేని లోటు ఆ కుటుంబానికి తీరేది కానప్పటికీ.. ఆయన భార్యకు మంత్రిపదవి ఇచ్చి కొంతమేరకు తన బాధను ఉపశమింపజేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు సమాచారం.
గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పదవి ఖాళీ అయింది. అయితే ఇక్కడ ఉప ఎన్నిక సంగతిని ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. అందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య శ్రీకీర్తిని ఎమ్మెల్యేగా పోటీచేయించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. అయితే వారి కుటుంబం నుంచి ఇందుకు ఆమోదం ఉన్నదో లేదో ఇంకా బయటకు రాలేదు.
గౌతమ్ స్థానాన్ని ఆయన భార్యతో భర్తీ చేయడమే సబబు అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆత్మకూరు స్థానం నుంచి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం ఎప్పటికి ఖరారు చేస్తుందో, ఎప్పడు నిర్వహిస్తుందో తెలియదు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు కూడా. పైగా ఇంకా ఈ ప్రభుత్వం గడువు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవిని స్వీకరించడానికి మేకపాటి శ్రీకీర్తి మరియు ఆమె కుటుంబం అంగీకరించినప్పటికీ కూడా.. ఆ పదవి వారికి ఎప్పటికి దక్కుతుందో తెలియదు. అందుకని ముందుగానే.. ఏప్రిల్ 11న జరుగుతున్న మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో ఆమెకు మంత్రిపదవి ఇవ్వడానికి సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 11న మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేస్తే.. ఆ తర్వాత.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవడానికి అవకాశం ఉంటుంది.
మామూలుగా అయితే.. జగన్ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం మంత్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని లెక్కలు చెబుతాయి. విస్తరణ సమయంలో ఆ సంఖ్య కాస్త కుదించే ఆలోచన ఉన్నట్టు కూడా పుకార్లు వినిపించాయి. అయితే.. మేకపాటి శ్రీకీర్తి విషయంలో మాత్రం.. సామాజిక వర్గ సమీకరణలు ఏవీ పట్టించుకోకుండా.. ముందు ఆమెకు మంత్రి పదవి ఇచ్చేసి.. ఆ తర్వాత.. ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు తీసుకురావాలని జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
శ్రీకీర్తి రాజకీయ రంగప్రవేశానికి అంగీకరిస్తే గనుక.. ఈ ఎమ్మెల్యే ఉప ఎన్నికలో తెలుగుదేశం, జనసేన ఎటూ పోటీచేయవు. బీజేపీ ఎలాంటి డ్రామా ఆడుతుందో తెలియదు.