''మీ దగ్గర సుత్తి వుందాండి?''
బస్సెక్కినట్టు తల్లికి ఎస్సెమ్మెస్ యిస్తూన్న కిరీటి తలెత్తి ప్రశ్న వేసిన అమ్మాయికేసి చూశాడు. చాలా నాజూగ్గా వుంది. కోమల స్వరం. ''సుత్తా!?'' ఇలాటి అమ్మాయికి సుత్తితో ఏం పని? తను సరిగ్గా వినలేదా అనుకుంటూ రెట్టించాడు. ఆ అమ్మాయి కాస్త గాభరాగా జవాబిచ్చింది. ''అవునండీ సుత్తే! ఈ బస్సు కిటికీ అద్దాలు పగలకొట్టేందుకు పనికి వచ్చే పెద్ద సుత్తి. ఎవర్నడిగినా లేదంటున్నారు.''
''కిటికీ అద్దాలు పగలకొడతారా? ఎందుకు? ఏదైనా నిరసన కార్యక్రమమా?'' తెల్లబోతూ అడిగాడు కిరీటి. ''ఇప్పుడు కాదు, ఏదైనా ఎమర్జన్సీ వస్తే… అప్పుడేం చేయాలి? అసలే రాత్రిప్రయాణం. బయట చీకటి. రూలు ప్రకారం బస్సువాళ్ల దగ్గర వుండాలి. పెట్టుకోలేదట. ఎన్ని ప్రమాదాలు జరిగినా వాళ్లకు బుద్ధి రాదు. కానీ మన జాగ్రత్తలో మనం వుండాలి కదా..'' కళ్లు విప్పార్చి, గుండెల మీద చెయ్యేసుకుని చెప్తోంది. ఇరవై ఏళ్లుంటాయేమో, కానీ చిన్నపిల్లలా భయపడుతోంది.
''మరి అంత జాగ్రత్త వుంటే వోల్వో బస్సు ఎందుకు ఎక్కారండీ?'' కొంటెగా అడిగాడు కిరీటి. ''అంతా మా ఫ్రెండు మూలానే.. మామూలు బస్సు బుక్ చేయవే అంటే సరేసరే అంటూ చివరి నిమిషందాకా బద్ధకించి ఆఖరికి వోల్వో తప్ప ఏదీ దొరకలేదంటూ యిది బుక్ చేసింది. తిడతానని నాకు చెప్పలేదు. బస్‌స్టాండ్‌కి వచ్చి ఎక్కబోతే యిప్పుడు తెలిసింది. బెంగుళూరు వెళ్లేలోపున ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో..''
కిరీటికి నవ్వు వచ్చింది. అణచుకుని ''అయితే యిప్పుడేం చేస్తారు? బస్సు బయలుదేరుతోంది కూడా..'' అమాయకపు మొహం పెట్టి అడిగాడు. ''అందర్నీ అడిగాను, మీరే లాస్టు. సుత్తి లేకుండా ఎలాగండీ బాబూ, బస్సులో భగ్గున మంటలు రేగితే బయటపడలేక కాలి చచ్చిపోతాం. నాకసలే టైర్లు కాలిన వాసనంటే పరమ అసహ్యం..'' అమ్మాయి దిగాలు పడింది. ఆమె వరస చూసి కిరీటికి ముచ్చట వేసింది. ''నా దగ్గర సుత్తి లేదు కానీ అరచేయి వుంది. కరాటే నేర్చుకున్నాను. అవసరమైతే చెయ్యి యిలా బిగించి అద్దం మీద కొట్టానంటే భళ్లున పగులుతుంది.'' అని అభినయించి చూపి అభయం యిచ్చాడు. ఆ అమ్మాయి ఎగిరి గంతేసినంత పని చేసింది. ''అయితే మీరు నా పక్క సీట్లోకి మారిపోండి ప్లీజ్. నా పక్కనున్న ఆంటీని యిక్కడికి పంపించేస్తాను. మీరు నా కజిన్ అని చెప్తాను, మీరూ అలాగే యాక్ట్ చేయండి. అనుమానం రాకుండా నన్ను పేరు పెట్టి పిలవండి. నా పేరు కీర్తి.'' ''నా పేరు కిరీటి. మీ పేరు స్పెల్లింగ్ కాస్త మారిస్త్తే వచ్చేస్తుంది..'' ''..ఆసమ్, వాళ్లు యీజీగా నమ్మేస్తారు..''
పది నిమిషాల తర్వాత పక్కపక్క సీట్లలో కూర్చున్నాక కీర్తికి అనుమానం వచ్చింది – 'మీ కరాటే క్లాసులో ఇటికలు పగలకొట్టిస్తారు కానీ, బస్సు అద్దాలమీద ఎప్పుడైనా ప్రాక్టీసు చేశారా?' అని అడిగింది. చేతులు వెనక్కి మడుస్తూ ''శాంపుల్ చూపించమంటారా?'' అని ఆఫర్ చేశాడు కిరీటి. ''అమ్మో వద్దు, అద్దం పగిలిందంటే చల్లగాలి లోపలకి కొడుతుంది. అవసరమైనపుడు చెప్తాను. మీరు మొద్దునిద్ర పోతారా?'' ''నిద్రపోయినా మంటల వేడికి మెలకువ వచ్చేస్తుంది లెండి.'' ''ఏ డివైడర్‌కో కొట్టుకుంటేనే మంటలు వస్తాయన్న గ్యారంటీ లేదండి. బస్సులో కెమికల్స్ వుంటే అవి ఒలికిపోయి పొగ రావచ్చు. నిద్రలోనే మనం ఉక్కిరిబిక్కిరై ఛస్తాం. మనం కాస్త ముందుగానే మేల్కొని, అద్దం పగలకొట్టేస్తే ఆ పొగంతా బయటకు పోతుంది.''
''అలాటి పరిస్థితే వస్తే నేను ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ యిచ్చి మిమ్మల్ని కాపాడతానండి.'' అని ఆఫర్ యిచ్చాడు కిరీటి. ''థాంక్సండి, ఇవన్నీ మీకెలా తెలుసు? మీరు డాక్టరా? ఎక్కడ ప్రాక్టీసు చేస్తున్నారు? హైదరాబాదా? బెంగుళూరా?'' బస్సు అద్దాల నుండి యీ అమ్మాయి దృష్టి మరల్చగలిగితే అంతే చాలనుకున్న కిరీటి తను బెంగుళూరులో చేస్తున్న సాఫ్ట్‌వేర్ వుద్యోగం గురించి, తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పాడు. ఆ అమ్మాయి వివరాలు అడిగాడు. గ్రాజువేట్. తన లాగే మధ్యతరగతి కుటుంబం. ఉద్యోగాలు వెతుకుతోంది. రేపు బెంగుళూరులో యింటర్వ్యూ వుందట.
బస్సులో వేసిన సినిమా చూద్దామనుకున్నవారు వీళ్లని ఉష్ ఉష్ అనసాగారు. అందువలన కాస్త దగ్గరగా జరిగి తలలు దగ్గరగా పెట్టి మాట్లాడవలసి వచ్చింది. కీర్తి శరీరపరిమళం కిరీటికి నచ్చింది. కిరీటి దగ్గర సిగరెట్, మందు వాసన లేకపోవడం కీర్తికి నచ్చింది. బయటి నుండి అప్పుడప్పుడు పడే దీపాల కాంతి వలన టెన్నిస్ ఛాంపియన్‌లా వున్న అతని కండరాలు మెరుస్తూ ఆమెలో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. 'నా స్థానంలో యితని భార్య వుంటే విశాలమైన యీ ఛాతీ మీద తల ఆన్చి నిశ్చింతగా నిద్రపోయేది' అనుకుంది. పెళ్లి కాలేదన్నాడు. ఎవరితోనైనా ఫిక్సయిందా? అడిగితే బాగుండదు. అయినా అడగడం దేనికి? ఒక్కరాత్రి ప్రయాణం, రేపు అతనెవరో, తనెవరో!
సినిమాలో ముద్దు సీను రావడంతో ఆమెకు హఠాత్తుగా తట్టింది, కృత్రిమశ్వాస అందించడం అంటే ఏమిటో! ''ఏమండీ, మీరు యిందాకా అన్న ఆర్టిఫీషియల్.. అది.. నీట్లో మునిగిపోయినవాళ్లకి యిచ్చేది కదా. బస్సులో పొగ వస్తే యిస్తానంటారేమిటి?' అని అడిగింది. కిరీటి వద్ద జవాబు రెడీగా వుంది. ''నీళ్లయినా, పొగయినా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్వాస అందదు. వాళ్లకు ఊపిరి అందించాలంటే అదొక్కటే మార్గం. అయినా బస్సులో కెమికల్స్ ఎక్కడైనా కనబడ్డాయా?'' ''కనబడేట్లు పెడతారా?'' కస్సుమంది కీర్తి. ''అర్ధరాత్రి ఫట్ మని ఏ సీసాయో పగులుతుంది. మనుషులంతా కుతకుత వుడికిపోతారు. చాలామంది నిద్రలోనే గుటుక్కుమంటారు. నాకు అలాటి చావు వద్దు. నాకు కెమికల్స్ పడవు. యాసిడ్ బాటిల్ పట్టుకున్నా ఒంటిమీద పొక్కులొస్తాయి.''
కిరీటి ఆమె శరీరంకేసి చూపు సారించాడు. నున్నగా, నిగనిగలాడుతూ వుంది. ఎక్కడా ఏ పొక్కూ లేదు. మీద చేయి వేస్తే జారిపోయేట్టుంది. వేస్తే..? కనీసం చేయిచేయి తగిలిస్తే..? మెలకువగా వున్నపుడు యిలాటి వేషాలు కుదరవు. ''సినిమా బోరుగా వుంది'' అని జనాంతికంగా ప్రకటించి కొద్దిపాటి శ్రమతో ఆవులించి, నిద్రకు ఉపక్రమించినట్లు కళ్లు మూసుకున్నాడు. పూర్తిగా కాదు, అరమూతగా వుంచి ఆమె అందాన్ని ఆస్వాదిస్తూనే నిద్రాదేవి ఒడిలో జారుకున్నాడు.
నాలుగైదు గంటలు గడిచింది. ధడాలున పెద్ద శబ్దం. బస్సు దేన్నో గుద్దేసింది. భయంతో కోడికునుకు తీస్తున్న కీర్తి సీట్లోంచి ఎగిరిపడింది. పక్కసీట్లో కిరీటిని 'కిరీటిగారూ' అంటూ గాబరాగా తట్టింది. తడిసిన బట్టల కీర్తిని సముద్రపు ఒడ్డున కృత్రిమశ్వాస పేరిట కలలో ముద్దాడుతున్న కిరీటి బస్సు కుదుపుకు ఉలిక్కిపడి కళ్లు తెరవగానే ఎదురుగా కీర్తి మొహం కనబడింది. ఏది కలో, ఏది వాస్తవమో తెలియని పరిస్థితిలో అతను కీర్తి మొహాన్ని తన చేతుల్లో తీసుకుని పెదవులను గాఢంగా చుంబించాడు. బిత్తరపోయిన కీర్తి చప్పున విదిలించుకుని, అతని భుజాలను కుదిపేస్తూ ''యాక్సిడెంటండీ. అద్దం బద్దలు కొట్టండి.'' అంటూ అరిచింది. బస్సులో అప్పటికే హాహాకారాలు వినబడుతున్నాయి. గబగబా బయటపడే ప్రయత్నంలో ఒకరినొకరు తోసుకుంటున్నారు.
కిరీటి ఒక్కసారిగా జాగ్రదవస్థలోకి వచ్చాడు. కీర్తి యీ సారి కిటికీ అద్దాన్ని చూపిస్తూ బద్దలు కొట్టండి అంటూ అరచేతిని కరాటే స్టయిల్లో పెట్టి చూపించింది. కిరీటి అద్దాన్ని మునివేళ్లతో తట్టి చూశాడు. తన అరచేయి కేసి చూసుకున్నాడు. ''అబ్బే లాభం లేదు'' అన్నాడు నోరు చప్పరించి. ''కరాటే నేర్చుకున్నారుగా'' అరిచింది కీర్తి. ''నేర్చుకుందా మనుకున్నాను. బ్లాకు బెల్టు కూడా కొన్నాను. మా నాన్న ఫీజు కట్టలేనన్నాడు.'' ''మోసం'' అని గొంతు చించుకుంది కీర్తి. కానీ ఎవరికీ వినబడలేదు. బస్సు లోపలే కాక, బయట కూడా కేకలు వినబడుతున్నాయి. అందరూ చుట్టుముట్టి అరుస్తున్నారు.
బస్సు గుద్దినది డివైడర్‌ను కాదు, రోడ్డుకి మధ్యగా కడుతున్న గుడి ప్రహారీగోడను. పాతిక, ముప్ఫయిమంది భక్తులు కేకలు వేస్తూ, కర్రలు ఝుళిపిస్తూ బస్సుపైకి దూసుకువచ్చారు. డ్రైవర్ను కిందకు లాగిపడేశారు. పెట్రోలు ట్యాంకు బద్దలు కొట్టి బస్సుకు నిప్పు ముట్టిస్తామని అరవసాగారు. అప్పటికే బస్సు దిగిన కొందరు ప్రయాణికులు వాళ్లను బతిమాలుతున్నారు. ''బస్సు తగలేయడం ఖాయం, పది నిమిషాలు టైమిస్తున్నా. కావాలంటే వీలైనన్ని సామాన్లు బయటకు తెచ్చుకోండి'' అన్నాడు భక్తుల్లో నాయకుడు.
'బాబోయ్, రేపు యింటర్వ్యూలో చూపించాల్సిన సర్టిఫికెట్లు వున్నాయి..''అంటూ కీర్తి బస్సు గుమ్మం దగ్గరకి పరిగెత్తింది. అందరూ అదే ప్రయత్నం చేయడంతో అక్కడ తోపులాట ప్రారంభమైంది. ''అందరూ ఎక్కాక నిప్పెట్టేద్దాం.'' అని యింకో భక్తుడు అరిచాడు. ఎక్కబోయేవారందరూ ఆగిపోయారు. మెట్లెక్కిన కీర్తి గబగబా దిగిపోయింది. ''ఏడిశారులే, వెళ్లి సర్టిఫికెట్లు తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకో'' అన్నాడు కిరీటి. ''నేను వీళ్లని మ్యానేజి చేస్తా..'' ''మాటల్తో నన్ను బుట్టలో పెట్టినట్లు కాదు. కరాటే వచ్చినట్టు బిల్డప్పిచ్చి రాత్రంతా నా భుజం మీద తలెట్టి పడుక్కున్నావ్.. తాళి కట్టినవాడు కూడా అంత దర్జా ఒలకబోయడు..'' అంటూ పళ్లు పటపటలాడించింది కీర్తి.
ఆమెకు సమాధానం చెప్పకుండా కిరీటి ఒక పెద్దావిడ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా ''మీ ఆడవాళ్లంతా గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకోవచ్చుగా…'' అన్నాడు. ''వేళాపాళా లేకుండా.. యిప్పుడా?'' అని ఆవిడ కళ్లెగరేస్తే, ''వాళ్లు కాస్త చల్లబడతారు.'' అన్నాడు గొంతు యింకా తగ్గించి. ఆడవాళ్లంతా గుళ్లోకి వెళ్లడంతో బస్సు చుట్టూ మూగిన గుంపుకి ఏం చేయాలో తోచలేదు. వాళ్లలో చాలామంది గుడివైపు నడిచారు. బస్సు దగ్గర మిగిలిన కొంతమంది బస్సుపై బాదుతూ చప్పుడు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రహారీగోడ కట్టే పని సాగుతూన్నట్టుంది. పచ్చిపచ్చిగా వుంది. వేగంగా బస్సు వచ్చి గుద్దడంతో కొంతభాగం గోడకూలి సిమెంటు యిటుకలు చెల్లాచెదురయ్యాయి. ఐదారడుగులు ఎత్తున్న గుడి. రోడ్డు విస్తరణలో తీసేయబోతూ వుంటే హైవే పక్కనే వున్న ఆ పల్లెటూరిలో కొందరు అడ్డుపడి గుడి పెద్దది చేయనారంభించారు. అమ్మవారి విగ్రహం అదే కానీ, గుడి ఎత్తు పెంచుతున్నారు. గోపురం అవీ తయారు కాలేదు. రోడ్డు విస్తరణ కంటె వేగంగా గుడిని విస్తరింపచేయాలన్న పట్టుదలతో రాత్రివేళ కూడా పని చేస్తున్నారు. బుడ్డి దీపాలు మాత్రమే వుండడంతో బస్సు డ్రైవరు గమనించకుండా వచ్చి గుద్దేశాడు. అదృష్టవశాత్తూ మనుషులెవరూ పోలేదు. గుడికేం కాలేదు. గోడే పడింది.
గుళ్లోకి వెళ్లినవాళ్లలో ఒక అరవావిడ అమ్మవారి మీద తమిళంలో కీర్తన అందుకుంది. వీరావేశంతో వూగిపోతున్న ఓ భక్తుడు విసుక్కున్నాడు. ''అద్దరాత్రేళ మద్దెల దరువన్నట్టు యిప్పుడీ గోలేటి? ఆ డ్రైవరు నాకొడుకు ఎటు పారిపోయాడో చూడాల'' అని. ''దేవుడంటే అందరికీ గురే. మీరు గుడిమీద ఓ ఎర్రలైటు పెట్టి వుంటే డ్రైవరు గుద్దేవాడా?'' గట్టిగా అడిగాడు కిరీటి. ''నడిరోడ్డుమీద కరంటెలా వస్తుంది? మాట్టాడేముందు ఆలోచించి మాట్లాడాల'' అన్నాడు వాడు. ''నేను చూపిస్తా..'' అంటూ కిరీటి చరచరా బస్సులోకి ఎక్కి తన బ్యాగులోంచి బ్యాటరీలైటు పట్టుకొచ్చాడు. ఒక పక్కనుంచి స్విచ్చి వేస్తే ఎర్రగా వెలుగుతోంది. పట్టుకెళ్లి గుడి మీద పెట్టాడు.
అతనితో వాదనకు దిగినవాడికి ఏమనాలో తెలియలేదు. ''అమ్మోరికి యివేమీ అక్కరలేదు. ఆవిడ కంటితో గట్టిగా చూస్తే డ్రైవరు బూడిదైపోతాడు.'' అన్నాడు. ''అవునవును, కాంపౌండుగోడని కూడా అలాగే చూసి వుంటుంది. అందుకే కూలిపోయింది.'' అన్నాడు కిరీటి వెక్కిరింతగా. వెంటనే నలుగురు అతనిపైకి దూసుకు వచ్చారు. ''మాటలు జాగర్తగా రానీయ్'' అంటూ. ''నేను చెప్పినదాంట్లో తప్పేముంది? రోడ్డుకి అడ్డంగా మీరు కడుతున్న గుడి, దాని గోడా ఆవిడకు నచ్చలేదు. అందుకనే కావాలని బస్సు చేత గుద్దించేసి కూల్చేసింది. ఇందులో డ్రైవరు తప్పేముంది? నిమిత్తమాత్రుడు పాపం.'' అని వాదించాడు కిరీటి. భక్తులకు ఏమనాలో పాలుపోలేదు. ''అమ్మోరు ఎన్నటికీ అలా చేయదు.'' అన్నాడు నాయకుడు. ''ఆవిడ కావాలని కూల్చలేదని మీరంటే, '..అయితే తన గోడ కూడా కాపాడుకోలేని వట్టి బొమ్మోరన్నమాట' అని నేననాల్సి వుంటుంది''
ఈ తర్కాన్ని ఎలా కాదనాలో వాళ్లెవరికీ తోచలేదు. వారిలో ఒక ఆవేశపరుడు ముందుకు వచ్చి ''మా అమ్మోర్ని ఏమైనా అంటే ఊరుకోను. ఇప్పటిదాకా యాభై బస్సులు యిటు వెళ్లాయి. ఎవరూ గుద్దలేదు. మీ వాడే కళ్లు మూసుకుపోయి గుద్దేశాడు… వాణ్ని వెనకేసుకుని వస్తే నిన్నూ, వాణ్నీ కలిపి తంతాం.'' అన్నాడు. ''అంటే మా వాడు తప్ప యింకెవరూ గోడను గుద్దరంటావ్. అయితే ఓ పని చేయి. గుడిమీద ఆ లైటు ఆర్పేసి, ఆ మిగిలిన ప్రహారీగోడ ముందు నువ్వు చీకట్లో నిలబడు. కాస్సేపట్లో ఏదో ఒక బస్సు వస్తుంది కదా. డ్యాష్ యిస్తుందో లేదో చూదాం.'' అని అతన్ని ఉడికించాడు కిరీటి. అతను తాగి వున్నాడేమో ''ఓఖే, అమ్మోరి దయుండగా నాకేం కాదు. అక్కడే నిలబడతా. ఎవడొచ్చి గుద్దుతాడో చూస్తా. అమ్మోరు గోడనీ రష్చిస్తుంది, నన్నూ రష్చిస్తుంది.'' అని ధీమాగా వెళ్లి నిలబడ్డాడు. కిరీటి తక్కినవాళ్ల కేసి కలయచూస్తూ ''అతనికి తప్ప మీ ఎవరికీ అమ్మవారి శక్తి మీద అంత నమ్మకం వున్నట్టు లేదే…'' అన్నాడు.
ఉక్రోషం పొడుచుకుని వచ్చి యింకో అయిదారుగురు వచ్చి అతనికి అటూయిటూ నిలబడ్డారు. ''ఇంతేనా?'' అని కిరీటి రెట్టించడంతో మరో ఏడెనిమిది మంది వచ్చి నిలబడ్డారు. వీరభక్తుడు తప్ప తక్కిన వాళ్లందరూ లైను చివర్లలో నిలబడాలనే చూశారు. అందరి కంటె చివర్లో నిలబడిన నాయకుడు ''ఇప్పుడొచ్చే బస్సు పక్కనుంచి వెళ్లిపోతే మీరు పందెం ఓడిపోయినట్లే. బస్సు తగలబెడితే అడ్డు చెప్పకూడదు.'' అని అరిచాడు. ''ఇక్కడ బస్సు, చుట్టూ యింతమంది జనం చూసి ఏ బస్సూ ర్యాష్‌గా రాదండి. మనని చూసి ఆగుతాడు. పందెం ఓడిపోతాం.'' అన్నాడు ఓ ప్రయాణీకుడు. కిరీటి అతనికేసి తిరిగాడు – ''నేనూ అదే చెప్పబోతున్నాను. మనమంతా బస్సులో ఎక్కి కూర్చుందాం. బస్సును తీసుకెళ్లి యీ వూళ్లో ఓ సందులో దాక్కుందాం.'' అన్నాడు.
''మీరు పారిపోతే..?'' అడిగాడు నాయకుడు. ''మళ్లీ హైవే మీదకు రాకుండా ఎక్కడికి పోతాం? మీ వూళ్లోంచి వేరే దారి వుండదుగా. అయినా కావాలంటే కొందరు మాతో రండి'' అన్నాడు కిరీటి. గోడ దగ్గర నిలబడడానికి వణుకుతున్న నలుగురు భక్తులు వెంటనే బస్సు ఎక్కి లోపల నిలబడ్డారు. బస్సు డ్రైవింగ్ వచ్చిన ఒకాయన బస్సు వూళ్లోకి పోనిచ్చి హైవే మీద వున్న గుడి కనబడేట్లా ఓ సందులో ఆపాడు. బస్సు ఆగగానే సీటు కింద నక్కిన డ్రైవరు బయటకు వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. కిరీటి అతని పక్కకు వెళ్లి కూర్చున్నాడు. ''ఒక్క ఐదు నిమిషాలు యిక్కడ వెయిట్ చేదాం. ఆ తర్వాత బస్సును హైవేకి తీసుకెళ్లి హైదరాబాదు వైపు పోనీ. రెండు కిలోమీటర్లు పోనిచ్చి, ఆ తర్వాత ఎక్కడ యూ టర్న్ వస్తే అక్కడ టర్నింగు తీసుకో. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా..'' అన్నాడు. ''బస్సులో వున్న భక్తులూరుకుంటారా?'' అడిగాడు డ్రైవర్ వణుకుతూ. ''నేను చూసుకుంటాగా!'' అన్నాడు కిరీటి.
ప్రయాణీకులందరూ వాళ్లని కొరకొరా చూస్తున్నా బస్సెక్కిన భక్తులు బింకంగా నిలబడ్డారు. ఐదు నిమిషాలు పోగానే బస్సు ఒక్కసారిగా బయలుదేరి వేగంగా హైదరాబాదు దారి పట్టడంతో యీ నలుగురూ ఏయ్ అని అరుస్తూ డ్రైవరు వైపు పరిగెట్ట బోయారు. కిరీటి కాలు అడ్డం పెట్టాడు. మొదటివాడు తూలడంతో వాడి మీద మిగతావాళ్లు పడ్డారు. వాళ్లు లేచేలోపున బస్సులో తక్కినవాళ్లు వాళ్లపై పిడిగుద్దులు కురిపించారు. బస్సు యూ టర్న్ తీసుకోగానే కిరీటి బస్సు ఆపించి ''మీ అంతట మీరు దిగిపోతారా? లేకపోతే తోసేయమంటారా?'' అని అడిగాడు. ''మా వూరు చాలా దూరం వుంది.'' అని అభ్యంతరపెట్టబోయాడు ఒకడు. ''అయితే వూరు రాగానే రన్నింగ్ బస్సులోనుంచి తోసేస్తాం.'' ''బాబోయ్ వద్దు'' అంటూ వాళ్లు గబగబా దిగిపోయారు.
గుడిగోడ దగ్గర నిలబడిన భక్తులకు అసహనంగా వుంది. హైదరాబాదువైపుకి దూసుకెళ్లిన బస్సు ఏది అని వాళ్లలో చర్చ మొదలైంది. ''ఏదైనా తేడా వస్తే కాల్ చేసి చెప్తామని బస్సెక్కిన మనవాళ్లు చెప్పారుగా.'' అన్నాడొకడు. ''ఎందుకైనా మంచిది, నువ్వే ఓ కాల్ చేయ్'' అన్నాడు నాయకుడు. కాస్సేపాగి ''చేశావా?'' అని అడిగాడు. ''బాలన్సు తక్కువుంది. మిస్‌డ్ కాల్ యిచ్చా. వాడే చేస్తాడులే.''
''థూ దరిద్రనాకొడకా..'' అని తన జేబులోంచి సెల్ తీయబోయాడు. అంతలో అతి వేగంగా ఒక బస్సు వాళ్లమీదకు రాసాగింది. ''బాబోయ్'' అని అరిచారందరూ. భయంతో వణికిన నాయకుడి చేతిలోంచి సెల్ కిందకు జారిపడింది. దాని కోసం ఒంగబోతూ మీదిమీదికి వచ్చేస్తున్న బస్సు చూసి అదిరాడు.
''ఈ డ్రైవరుగాడు తాగి వుంటాడు. మనం కనబడతామో లేదో'' అన్నాడు. ''మనమే ఏమిటి, మన తల్లో జేజమ్మ కూడా కనబడుతుంది.'' అంటున్నాడు వీరభక్తుడు. బస్సు వేగం ఏ మాత్రం తగ్గకపోగా భీకరంగా వినబడుతున్న హారన్ వాళ్లని వణికించింది. వీరభక్తుడు, నాయకుడు తప్ప అందరూ పరిగెట్టుకుని పారిపోయారు. నాయకుడు సెల్‌ఫోన్ వెతకాలో, పారిపోవాలో తేల్చుకోవడానికి పది సెకన్లు పట్టింది. పారిపోతూ ''ఒరేయ్, తాగుబోతు నాయాలా, వచ్చేయ్'' అంటూ వేగంగా పక్కకి పరిగెట్టాడు. వీరభక్తుడు ప్రయత్నించినా పారిపోలేకపోయాడు. అప్పటికే ఆ బస్సు అతని దగ్గరకు వచ్చి సడన్‌బ్రేక్ వేసి, మళ్లీ వేగంగా పక్కనుంచి వెళ్లిపోవడంతో భయంతో మూర్ఛపోయాడు.
సడన్‌బ్రేక్‌తో తన ఒళ్లో వాలిన కీర్తిని చూసి ''అంతా అమ్మవారి దయ'' అన్నాడు కిరీటి.
కుదుపు తట్టుకుని సీట్లలోంచి లేచిన తక్కినవాళ్లంతా అతని వద్దకు వచ్చి 'థాంక్యూ, గొప్ప ఐడియా వేశారు' అంటూ అభినందించసాగారు. ''ఏదైనా టౌను చూసి ఆపమని డ్రైవరుకు చెప్పండి. కాస్త టీ తాగితే తప్ప కుదుటబడలేం. వాటే టెన్షన్'' అని నిట్టూర్చాడు ఓ పెద్దాయన.
''నువ్వేదో ఆపద్భాంధవుడిలా వాళ్ల ధనప్రాణాలు కాపాడినట్లు వాళ్లు నీ చేత కేక్ కట్ చేయించారే. అవసరమా?'' ఉడికిస్తూ అడిగింది కీర్తి. టీలు తాగాక రిలాక్సు కావడానికి, యితర అవసరాలకు ప్రయాణికులు అటూయిటూ వెళుతున్నారు. వీళ్లిద్దరూ విడిగా చెట్లవైపు నడుస్తున్నారు. ''ఇందాకా దొంగ భక్తుల్లో ఎవరైనా నిన్ను పక్కకు లాక్కెళ్లి వుంటే తెలిసేది..'' ''వాళ్లు ఘరానా రేపిస్టులు. నీలాటి వాళ్లు మేకవన్నె పులులు. అబద్ధాలు చెప్పి పక్కసీటులో దూరడం, యాక్సిడెంటు కదా పోనీ అని లేపితే ఏకంగా ముద్దు పెట్టేసుకోడం! అయినా అదేం అలవాటండీ, ఎవరైనా నిద్రలేపగానే అలా.. పెట్టేసుకోవడమే!'' ''ఛ, ఛ, అలవాటేం కాదు. మీతో ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ గురించి మాట్లాడుతూ పడుక్కున్నాను కదా. అదే మనసులో తిరుగుతూ కలలో కూడా అదే వచ్చింది. మిమ్మల్ని చూడగానే మీకు సాయం చేస్తున్నాననుకుని..''
''నాకు ఊపిరి అందకపోయినప్పుడు కదా మీరు శ్వాస అందించవలసినది. నేనే మిమ్మల్ని లేపినప్పుడు అలా ఎలా అనుకుంటారు?'' ''…అబ్బ, కల చెదిరిపోతే యిలాటి కన్‌ఫ్యూజనే వస్తుందండి. ఈ బస్సు యాక్సిడెంటు లాగే అదీ ఓ యాక్సిడెంటు అనుకోండి.'' కీర్తి నిట్టూర్చింది. ''మీరు యాక్సిడెంటంటూ తీసిపారేశారు కానీ నా బాధ నాది. మొదటి ముద్దు భర్త నుండే పొందాలని నా ఫిలాసఫీ.'' అని బుంగమూతి పెట్టింది. ''చిన్న సవరణ చేయండి. మొదటి ముద్దు పొందినవాణ్నే భర్తగా చేసుకోండి. ఇందాకా మాటల్లో నా బ్యాక్‌గ్రౌండ్ అంతా చెప్పాను కదా. మీరు ఓకే అంటే చాలు. తక్కినదంతా నేను చూసుకుంటాను.'' ఆర్తిగా అన్నాడు కిరీటి.
సమాధానంగా కీర్తి అతన్ని అల్లుకుని ఛాతీపై తలపెట్టి ''మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి పిల్లలకూ వస్తాయి కదా'' అంది. ''థాంక్యూ'' అంటూ ఆమెను హత్తుకున్నాడు కిరీటి. అంతలోనే కీర్తి ''కానీ…'' అంటూ సాగదీయడంతో ప్రశ్నార్థకంగా చూశాడు. ''ఇందాకటిది తొలిముద్దు అంటే ఏం బాగుంటుంది? కలలో ప్రాక్టీసు చేసివున్నారు కాబట్టి మీకు ఫర్వాలేదు కాబట్టి నేను అస్సలు ప్రిపేర్ కాలేదు.'' అంది కీర్తి. ''పోనీ అది ఆకాశానికి యిచ్చేద్దాం. ఈ సారి సరిగ్గా పెట్టుకుంటే సరి.'' అంటూ ఆమె పెదాలు అందుకున్నాడు. పెదాలు విడివడిన తర్వాత ''ఇది భూదేవికి.. యిప్పుడు అస్సలు ముద్దు. నేను పెడతాను.'' అంటూ కీర్తి కిరీటిని హత్తుకుని గాఢంగా చుంబించింది. బస్సు గట్టిగా హారన్ వినబడకపోతే అది ఎంతసేపు సాగివుండేదో ఎవరూ చెప్పగలిగేవారు కారు. బస్సు మళ్లీ ఎక్కాక ‘‘పెళ్లెలా ఫిక్సయిందని మా ఫ్రెండ్స్ అడిగితే ఏం చెప్పాలో తెలియటం లేదు. సుత్తితో మొదలయ్యి, ఎడ్వెంచర్‌తో ముగిసిందనాలి. మధ్యలో రొమాన్సు ఒకటి..’’ అంది కీర్తి. ‘‘..అమ్మవారి సమక్షంలో, ఆవిడ ఆశీస్సులతో అని కూడా చేర్చు.’’ అన్నాడు కిరీటి. ‘‘ఏం చెప్పినా నీదో సుత్తి కథ అంటారు.’’ అని గునిసింది కీర్తి. ‘‘..అది వాళ్లకో తుత్తి..’’ అంటూ ఓదార్చాడు కిరీటి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)