దాదాపు రెండేళ్ల కిందట యమలీల సినిమాకు సీక్వెల్ అంటూ ఒక సీరియల్ ను ప్రకటించింది ఈటీవీ. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ యమలీలకు ఆ తర్వాత.. అంటూ ఆ సీరియల్ ను తీసినట్టుగా ఉన్నారు. లాక్ డౌన్ల వల్లనో ఏమో కానీ, చాన్నాళ్లకు ఆ సీరియల్ ప్రారంభం అయినట్టుగా ఉంది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణో, మూలకథ ఇవ్వడమో ఏదో చేసినట్టుగా ఉన్నారు. అలీ కూడా ఆ సీరియల్ లో కాస్త కనిపించినట్టుగా ఉన్నారు. మరి రేటింగ్స్ లో ఆ సీరియల్ ఏమైందో, ఇప్పటికీ ప్రసారం అవుతోందో ఏమో కానీ.. ఇప్పుడు మరో హిట్టు సినిమాను సీరియల్ గా మారుస్తోందట ఈటీవీ.
ఈ సారి మౌనపోరాటం వంతు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. మగాళ్ల చేతిల్లో మగువలు మోసపోవడం గురించి.. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ ఈ సినిమా. ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఈనాడు పేపర్లో అలాంటి వార్తల విషయంలో మౌనపోరాటం.. అనే హెడ్డింగ్ ను విస్తృతంగా వాడటం మొదలైనట్టుంది. ఇప్పటికీ అవకాశం ఉంటే.. ఈనాడులో అదే హెడ్డింగ్ వాడతారు ఆ వార్తలకు.
మరి ఇప్పుడు సినిమా కు సీక్వెల్ గా సీరియల్ అట! మౌనపోరాటం సినిమాతో పాపులర్ అయ్యి, కొన్నేళ్ల నుంచి ఈటీవీ సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్న యమున.. ఈ సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేస్తోందట. ఆ సినిమాలోని పాత్రల ప్రవర్తన గురించి కొనసాగింపుగా ఈ సీరియల్ రూపొందుతోందట!
మరి యమలీల, ఇప్పుడు మౌనపోరాటం! ఇన్నాళ్లూ సినిమా టైటిళ్ల వాడకం వరకే సీరియల్స్ ఉండేవి. ఇప్పుడు కథల విషయంలో కూడా కొనసాగింపు అనే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు ఈటీవీ వాళ్లు!