దేశంలో కరోనా వ్యాప్తి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో దేశం మొత్తం మీద నమోదైన కరోనా కేసుల సంఖ్య 1233. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అవరోహన క్రమంలో ఇది దాదాపు అత్యల్ప స్థాయి.
సరిగ్గా రెండేళ్ల కిందట దేశంలో లాక్ డౌన్ అమలు కావడం మొదలైంది. 2020 మార్చిలో నెలాఖరు నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మూడు వేవ్ లలో కరోనా తీవ్రమైన ప్రభావాలను చూపించింది.
రెండేళ్ల తర్వాత ఇప్పుడు కరోనా కేసులు అత్యల్ప స్థాయిలో నమోదవుతూ ఉండటం ఊరటను ఇచ్చే అంశం. ఇంత పెద్ద దేశం మీద అధికారికంగానే అయినా రోజుకు వెయ్యి స్థాయి కేసులు చాలా స్వల్పమైనవని వేరే చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో చాలా రాష్ట్రాల్లో, నగరాలు, ప్రధాన ఆసుపత్రుల్లో జీరో స్థాయిలో నిలుస్తున్నాయి కరోనా నంబర్లు.
కరోనా చికిత్సకు సంబంధించిన చేరికల విషయంలో ప్రముఖ ఆసుపత్రులు విడుదల చేస్తున్న రిపోర్టుల్లో జీరో నంబర్ చెబుతున్నారు. తమ వద్ద కరోనా పాజిటివ్ కేసులు లేవని జనరల్ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఇలా కరోనా చాలా చోట్ల జీరో స్థాయికి చేరింది.
ప్రస్తుతానికి ఇది బాగా ఊరటను ఇచ్చే అంశం. అయితే కొన్ని దేశాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తూ ఉండటం, లాక్ డౌన్ లు అమలవుతూ ఉండటం మాత్రం ఇతర దేశాలకు కూడా కాస్త ఆందోళన కలిగించే అంశమే.