పవన్ వ్యూహానికి ముద్రగడ విరుగుడు!

పవన్ కళ్యాణ్ మూడు రోజుల ప్రసంగాల ముచ్చట ముద్రగడ లేఖ రూపంలో బయటకు వచ్చింది. ఎప్పుడూ ముద్రగడ లేఖలు ఎలా వుంటాయో అందరికీ తెలిసిందే. గోదావరి జిల్లా జనాలకు అలవాటైన మర్యాదైన మాట ఆ…

పవన్ కళ్యాణ్ మూడు రోజుల ప్రసంగాల ముచ్చట ముద్రగడ లేఖ రూపంలో బయటకు వచ్చింది. ఎప్పుడూ ముద్రగడ లేఖలు ఎలా వుంటాయో అందరికీ తెలిసిందే. గోదావరి జిల్లా జనాలకు అలవాటైన మర్యాదైన మాట ఆ లేఖల్లో కనిపిస్తుంది. ఈ సారి కూడా అదే తీరు కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ తీరును పూర్తిగా, గట్టిగా తప్పుపట్టడం అన్నది ఈసారి లేఖ స్పెషాలిటీ. 

నిజానికి పవన్ కళ్యాణ్ ఓ తరహా వ్యూహాన్ని పన్ని ముందుకు వెళ్దామని అనుకున్నారు. అదేమిటంటే కాపులను తిట్టకుండా, కాపు సామాజికేతరులను టార్గెట్ చేసి, ఆ విధంగా కాపులను తన వైపు తిప్పుకునే వ్యూహం. మాట్లాడితే ఎక్కడో వున్న పెద్దిరెడ్డిని, ఇక్కడ వున్న ద్వారంపూడిని తిట్టడం వెనుక ఆలోచన అదే.

అందుకే అన్నవరం వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే రాజా గురించి అస్సలు ప్రస్తావించలేదు. కాకినాడ వచ్చినా కన్నబాబు గురించి లేశమాత్రంగా ప్రస్తావించి వదిలేసారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు వున్న మిగిలిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడలేదు. కాపు నాయకులను, కాపు ఎమ్మెల్యేలను తిట్టడం అన్నది పక్కన పెట్టారు. అంటే కాపు ఓట్ల సమీకరణ అనే వ్యూహంలో భాగంగా పవన్ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసారు. ఇదే వ్యూహాన్ని భీమవరం వరకు అమలు చేయాలనుకున్నారు.

నిజానికి విమర్శించాలనుకుంటే ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేను, అటు అంతకు ముందు చిరకాలం అధికారంలో వున్న పార్టీ ని కూడా విమర్శించాలి. కానీ అలా వున్న పార్టీ టీడీపీ కావడంతో పవన్ అటు దృష్టి పెట్టనేలేదు. ఈ వ్యూహం మిగిలిన సామాజిక వర్గాలు గమనించాయి. కానీ గమ్మున వున్నాయి. కేవలం కాపుల ఓట్ల సమీకరణతో పవన్ అధికారంలోకి రాలేరు. తన ఎమ్మెల్యేలను గెలిపించలేరు. కానీ కాపుల ఓట్లు అన్నీ ఓ పక్కకు లాగడం ద్వారా వైకాపాను ఓడించి, తెలుగుదేశాన్ని గెలిపించవచ్చు అనే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.

కానీ వాస్తవానికి అది కూడా అంత సులువు కాదు. వైకాపా గెలుస్తుందా? దేశం గెలుస్తుందా అన్న పాయింట్ పక్కన పెడితే కాపు ఓట్ల అన్నీ ఓ పక్కకు పోలరైజ్ చేయడం అనే వ్యూహం సరైనది కాదు. ప్రజారాజ్యం టైమ్ లో కాపు ఓట్లు అన్నీ ఓ పక్కకు వచ్చాయి. అందుకే ప్రజారాజ్యం పార్టీకి అన్ని శాతం ఓట్లు వచ్చాయి. అన్ని సీట్లు వచ్చాయి. కానీ అధికారం మాత్రం రాలేదు. అయితే తెలుగుదేశం ఓడి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సహకరించింది.

ఇప్పుడు ఇదే వ్యూహాన్ని పవన్ అమలు చేయాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైకాపా ను ఓడించడానికి ఈ వ్యూహం పనికి వస్తుందని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ప్రజారాజ్యం టైమ్ లో ప్రతిపక్షంలో వున్న తేదేపా గెలవలేదు. అధికారంలో వున్న కాంగ్రెస్ నే గెలిచింది. దానికి కారణం కాపుల ఓట్లకు వ్యతిరేకంగా వుండే బిసిల ఓట్లు పోలరైజ్ కావడం, అవి అధికారపక్షానికి చేరడం. 2019లో కూడా జగన్ ఈ వ్యూహంతోనే గెలిచారు.

అయితే ఈసారి బిసి ల ఓట్లను దగ్గరకు తీసుకునే ప్రయత్నం తెలుగుదేశం ముమ్మరం చేసింది. అందుకు సాధనంగా రెడ్డి కులాన్ని బూచిగా చూపిస్తోంది. పవన్ కూడా ఇప్పుడు ఎగ్జాట్ గా అదే చేసే ప్రయత్నం ప్రారంభించారు. అంటే రెడ్డి పాలన అనే దాన్ని బూచిగా చూపించి, కాపు ఓట్లు జనసేన, బిసి ఓట్లు తేదేపా పంచేసుకుంటే, వైకాపా ఇంటికి వెళ్లిపోతుందని దూరా..లోచన.

ఇప్పుడు దీనికి ఆదిలోనే గండి కొట్టే ప్రయత్నం చేసారు ముద్రగడ. పవన్ మాట తీరు బాగాలేదని, ద్వారంపూడి కుటుంబం ఎలాంటిదో వివరిస్తూ, కాపులకు, కాపు ఉద్యమానికి ఎలాంటి సాయం అందించారో వివరించారు. ఆ విధంగా పవన్ వ్యూహం ఆదిలోనే న్యూట్రల్ గా మారేలా ముద్రగడ ప్రతి వ్యూహం పన్నినట్లు అయింది.

కాపు యువతకు ముద్రగడ లేఖ నచ్చకపోవచ్చు. కానీ కాపు పెద్ద‌లకు, ఇతర కులాల వారికీ పవన్ నైజం అర్థం అవుతుంది. దాని వల్ల కాపు ఓట్లు పోలరైజ్ కావడం అనే వ్యూహం కొంతయినా చెదిరే అవకాశం వుంది.