విశాఖ జిల్లా అంటే విభజన ఏపీలో చాలా పెద్దది. భౌగోళికంగా బాగా విస్తరించి ఉన్న జిల్లా. అలాంటి జిల్లాను ఏకంగా మూడుగా విభజించారు. కొత్త జిల్లాలుగా అనకాపల్లి, ఏజెన్సీలోని అల్లూరి వస్తున్నాయి. అయితే ఈ మొత్తం ఆపరేషన్ లో విశాఖ జిల్లా బాగా చిన్నది అయిపోయింది.
కేవలం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, గ్రామీణ ప్రాంతం అన్నది అసలు లేదు. రేపటి అభివృద్ధికి ఏ కోశానా ప్రభుత్వ భూములు అన్నవైతే అసలు లేనే లేవు.
దాంతో పెందుర్తి అసెంబ్లీని కూడా కలపాలని డిమాండ్లు వచ్చాయి. ఇక విశాఖ ఎంపీ సీటులో భాగంగా ఉన్న ఎస్ కోట అసెంబ్లీని కూడా విలీనం చేయాలని వినతులు వచ్చాయి. ఈ రెండూ కలిస్తే విశాఖ జిల్లాకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని, అన్ని రకాలుగా ప్రగతికి మార్గం ఉంటుందని భావించారు. దాంతో మొత్తం 488 పైగా విన్నపాలు వెళ్లాయి.
మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు. పెందుర్తిని కనుక అనకాపల్లిలోనే కొనసాగించినా. ఎస్ కోటను విజయనగరంలో ఉంచినా విశాఖ జిల్లాకు ఎదుగూ బొదుగూ ఉండదని అంటున్నారు.
మరి ఈ విభజన హోరులో ఈ మార్పులూ చేర్పులతో విశాఖ జిల్లా రూపం, కొత్త స్వరూపం ఎలా ఉంటుంది అన్నది ఒకటి రెండు రోజుల్లోనే తేలుతుంది అంటున్నారు. సో దీని మీదనే జనాలు అంతా చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.