అంత వరకూ చంద్రబాబు- పవన్ కల్యాణ్ ల ఇద్దరి మధ్యన ప్రేమకథ బాగానే నడుస్తూ వచ్చింది. చంద్రబాబుకు ఒంటరిగా గెలవడం చేతకాదనే నిర్ణయానికి వచ్చిన పచ్చలాబీ ఆయన ఎటు తిరిగీ పవన్ కల్యాణ్ తో దోస్తీ చేయాలని ఆయనపై ఒత్తిడి తీసుకురావడం, దీంతో ఆయన చేసేది లేక పవన్ పై తనది వన్ సైడ్ లవ్ అవుతోందంటూ బాహాటంగానే వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఈ ప్రేమ ప్రతిపాదన పట్ల పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా స్పందించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అంటూ పాచికోలు వాదన వినిపిస్తూ చంద్రబాబు ప్రేమ ప్రతిపాదన పట్ల హ్యాపీగా రియాక్ట్ కావడం జరిగింది.
ఆ తర్వాత సీఎం సీఎం అని అరిచే జన సైనికుల నోళ్లను కూడా పవన్ కల్యాణ్ మూయించాడు. ఎందుకిస్తారయ్యా.. సీఎం పదవి అంటూ జనసైనికులనే పవన్ అదరగొట్టాడు. తను తెలుగుదేశంతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం ఖాయమంటూ పవన్ కల్యాణ్ చాన్నాళ్లుగా చెబుతూ వచ్చాడు. అదనంగా బీజేపీని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తన మీటింగులతో క్లారిటీ ఇచ్చాడు. మరి పవన్ ప్రయత్నాలను చూసి బీజేపీ తన లెక్కలతో ముందుకు వచ్చిందో లేక కర్ణాటకలో ఓటమి తర్వాత మిత్రులను సంపాదించుకోవాలనుకుందో కానీ.. ఏ ముహూర్తంలో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం జరిగిందో కానీ, అప్పటి నుంచినే ఈ కూటమిలో కొత్త గందరగోళానికి తెరలేచిందనుకోవాల్సి వస్తోంది.
అమిత్ షాతో సమావేశం తర్వాత చంద్రబాబు ఆ సమావేశం గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. మామూలుగా అయితే.. చంద్రబాబు కథ వేరేలా ఉంటుంది. ఆ ప్రకారం అయితే, ఈ పాటికి దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి ఏం చేయాలో అమిత్ షా తనను అడిగారనేంత స్థాయిలో చంద్రబాబు చెప్పే వారు. మోడీని మరోసారి ప్రధానమంత్రి చేయడమనే లక్ష్యంలో తనదే ఇక కీలక పాత్ర అనేంత స్థాయిలో చంద్రబాబు రచ్చ జరిగేది.
ఇక ఏపీలో బీజేపీ అంతా తను చెప్పిందే అన్నట్టుగా కూడా సూఛాయగా చెప్పేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లో అలా చెప్పుకోవడం తీవ్రమైన అవసరం కూడా! అయినా.. అమిత్ షాతో మీట్ తర్వాత కూడా చంద్రబాబు ఏం మాట్లాడలేదంటే.. అక్కడ ఏదో పెద్ద ప్రతిపాదనే పెట్టినట్టుగా ఉన్నారు!
బహుశా 20 ఎంపీ టికెట్లు అడిగారా, లేక పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థి అన్నారా, లేక బీజేపీ-జనసేనలకు కలిసి 75 అసెంబ్లీ సీట్ల వరకూ అడిగారా.. అనే అంశంపై ఎవరి ఊహ వారిది. స్థూలంగా చంద్రబాబు నిర్ఘాంతపోయే ప్రతిపాదన ఏదో అమిత్ షా వైపు నుంచి వచ్చింది. అదెంత తీవ్రమైనది అంటే.. అంతటి అమిత్ షాతో సమావేశం తర్వాత తను ఏమైనా చెప్పుకోనే సత్తా ఉన్న చంద్రబాబు ఆ సమావేశంపై చిన్నపాటి ప్రకటన చేయలేనంత తీవ్రమైన ప్రతిపాదన ఏదో వచ్చింది.
ఆ సమావేశం తర్వాత చంద్రబాబు స్పందించలేదు. ఆ పై జగన్ పై చర్యలేవీ అంటూ నిష్టూరమాడారు! ఈ నిష్టూరం కూడా అక్కడి నుంచి వచ్చిన ప్రతిపాదనకు కౌంటర్ లానే ఉంది. అదలా ఉంటే.. పవన్ కల్యాణ్ ను కూడా బీజేపీ గట్టిగానే మునగమాను ఎక్కించినట్టుగా ఉంది. మొన్నటి వరకూ సీఎం అని నినదించిన అభిమానులనే కసురుకున్న పవన్ కల్యాణ్..ఇప్పుడు మళ్లీ సీఎం పాట అందుకున్నాడు. దీంతో బీజేపీ చంద్రబాబుకు గట్టిగానే ఫిట్టింగ్ పెట్టిందనుకోవచ్చు. అయితే పవన్ కు ఎలాంటి స్థిరత్వం లేదు.
తను సీఎం అభ్యర్థిని అంటూ ఈ రోజు ప్రకటించుకుని, రేపు మళ్లీ అలాంటిదేమీ లేదని అని అంతే గట్టిగా చెప్పగలడు. కాబట్టి.. పోటీ గురించి, సీఎం అభ్యర్థిత్వం గురించి పవన్ కు ఎలాంటి స్థిరత్వం లేదు. ఇది నిస్సందేహం. అయితే.. ఎవరు సీఎం అయినా ఫర్వాలేదు జగన్ కాకూడదనేది మాత్రమే పవన్ అజెండా. ఆ అజెండాకు భిన్నంగా తనే సీఎం అన్నాడంటే.. బహుశా బీజేపీ ఏమైనా కీ గట్టిగా బ్రెయిన్ వాష్ చేసిందా అనే సందేహాలకు ఆస్కారం ఉంది. అయితే ఇలాంటి ప్రయత్నాలను బీజేపీ బాహాటంగా ఏమీ చేయడం లేదు.
స్థూలంగా ఇక టీడీపీ-జనసేన దోస్తీ ఖరారే, సొంతంగా ఏనాటికీ అధికారంలోకి రాలేని చంద్రబాబుకు ఈ సారి మళ్లీ పవన్ కల్యాణ్ కలిసొచ్చాడు అని పచ్చ బ్యాచ్ ఆనందిస్తున్న సమయంలో, మరింత ఉత్సాహాన్ని ఇవ్వాల్సిన అమిత్ షాతో సమావేశం తర్వాత మాత్రం కొత్త గందరగోళం తలెత్తింది. సొంతంగా నెగ్గలేకపోవడం మాట అటుంచి, పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగా కూడా లేని టీడీపీకి ఇది కలవరపాటు స్థితే!