ఇటీవలే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొని షాక్ తిన్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల సవాళ్లు ఎదురవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో రెండింట కమలం పార్టీకి పరిణామాలు అంత సానుకూలంగా లేవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. వాటిల్లో ప్రత్యేకించి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కమలం పార్టీకి పరిస్థితులు అంత సానుకూలంగా లేవనేది ప్రముఖంగా వినిపిస్తున్న విశ్లేషణ.
వాస్తవానికి ఐదేళ్ల కిందటే మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఓడించారు. అయితే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చగలిగింది. అక్కడ జ్యోతిరాదిత్య సింధియాను అడ్డు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సింధియా కూడా అదనపు భారంగా మారినట్టుగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో కీలకంగా వ్యవహరించిన సింధియా తన కోటాలో ఇప్పుడు ఏకంగా యాభై నుంచి అరవై అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్టానం ముందు పెడుతున్నాడట.
కాంగ్రెస్ పార్టీలో నాటి సీఎం కమల్ నాథ్- సింధియాల మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం నడించిందప్పట్లో. కాంగ్రెస్ అధిష్టానం కమల్ నాథ్ వైపే నిలవగా, సింధియా బీజేపీ పంచన చేరాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఆ రచ్చ రేగిందని, బీజేపీలో ఇప్పుడు చౌహాన్ వర్గానికి, సింధియా వర్గానికి దుమారం రేగుతోందనే మాట వినిపిస్తోంది. ప్రత్యేకించి సింధియాతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లంతా ఇప్పుడు టికెట్లను సహజంగానే డిమాండ్ చేస్తున్నారు.
అయితే అప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఉన్న బీజేపీ నేతలకు కమలం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్వాలియర్- ఛంబల్ రీజన్లో బీజేపీ పాతకాపులకూ, సింధియాతో పాటు వచ్చి చేరిన కాంగ్రెస్ వాళ్లకు మధ్యన వైరం ముదిరి పాకాన పడిందనేది గ్రౌండ్ రిపోర్ట్.
దీనికి తోడు చౌహాన్ ప్రభుత్వంపై సహజమైన వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో గెలుపు తర్వాత కాంగ్రెస్ కు ఉత్సాహం తోడవుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఇలాంటి నేపథ్యంలో 230 సీట్లకు గానూ తాము 150 సీట్లలో నెగ్గి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే ధీమా కాంగ్రెస్ వైపు నుంచి వ్యక్తం అవుతూ ఉంది.
అయితే కర్ణాటక తరహాలో మధ్యప్రదేశ్ లో మోడీనే అంతా కష్టపడనక్కర్లేదు. చౌహాన్ ఉన్నారు. ఆయనే బీజేపీకి ఇప్పుడు అండ, ఆశ. చౌహాన్ ఇమేజే ఈ పోటీలో బీజేపీకి ఆశ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటకలో మోడీ అంతా తానైనప్పటికీ బీజేపీ చిత్తయ్యింది. అయితే మధ్యప్రదేశ్ కర్ణాటకలో అంత స్థాయిలో మోడీ ప్రచారం అవసరం ఉండకపోవచ్చు. చౌహాన్ కు ఆ మాత్రం శక్తియుక్తులున్నాయి. ఒకవేళ ఆయనను కాదని మోడీనే ముందుకు దూకుతారా.. అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాని అంశం. ఒకవేళ యడియూరప్ప తరహాలో చౌహాన్ పై వ్యతిరేకత అని పక్కన పెట్టి మోడీ రంగంలోకి దిగితే.. పరిస్థితులు కర్ణాటక తరహాలోకి రావొచ్చు.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. చాలా స్ఫష్టమైన మెజారిటీతో ప్రజలు ఐదేళ్ల కిందట కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారక్కడ. కాంగ్రెస్- బీజేపీలకు సీట్ల వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. ఈ సారి కొన్ని సీట్లు దక్కినా కాంగ్రెస్ కే ఛత్తీస్‌గఢ్‌లో అవకాశం ఉందనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది.