భక్తి ముసుగులో అరాచకాలకు పాల్పడే దొంగ బాబాలకు మన దేశంలో కొదవలేదు. ఎప్పటికప్పుడు ఇలాంటి దొంగ బాబాల బాగోతాలు బయటపడుతున్నప్పటికీ, ఇంకా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. తాజాగా వైజాగ్ లో ఇలాంటిదే మరో ఘటన బయటపడింది. భక్తి ముసుగులో రక్తి కార్యక్రమాలు చేస్తున్న స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం నగరంలోని వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు పూర్ణానంద స్వామి. ఇతడికి అక్కడ సొంత స్థలం ఉంది. అందులోనే భక్తి పేరిట రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాడు.
రాజమండ్రికి చెందిన తేజశ్విని అనే బాలిక తల్లిదండ్రుల్ని కోల్పోయింది. ఆమెను 12 ఏళ్లు వచ్చేవరకు పెంచారు తెలిసినవాళ్లు. ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు.
2016 నుంచి బాలిక ఆశ్రమంలోనే ఉంది. అయితే రెండేళ్ల నుంచి ఆమెపై వేధింపులు మొదలయ్యాయి. స్వయంగా పూర్ణానంద స్వామి ఆమెపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన బెడ్ రూమ్ లోనే ఆమెను గొలుసులతో కట్టి పడేశాడు. చిత్రహింసలకు గురిచేశాడు.
ఆశ్రమంలో పనిచేస్తున్న ఓ పనిమనిషి సహాయంతో ఆ ఉచ్చు నుంచి బయటపడింది బాలిక. అక్కడ్నుంచి నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్లి తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కింది. ట్రయిన్ లో పరిచయమైన ఓ మహిళ, బాలిక గురించి తెలుసుకుంది. వెంటనే ఆమెను బాలల సంక్షేమ కమిటీకి అప్పగించింది. అక్కడ్నుంచి బాలికను విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్ కు పంపించారు. అక్కడే స్వామీజీపై పోక్సో కేసు నమోదైంది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, పూర్ణానంద స్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. ఈ పూర్ణానంద స్వామిపై ఆల్రెడీ ఓ కేసు ఉంది. 2012లోనే అతడిపై రేప్ కేసు నమోదైన విషయాన్ని పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం బాలిక విజయవాడలోనే అధికారుల సంరక్షణలో ఉంది. ఆమెకు విజయవాడలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు తన ఆశ్రమం నుంచి ఓ బాలిక తప్పిపోయిందంటూ, సదరు స్వామీజీ మిస్సింగ్ కేసు పెట్టాడు. వెంటనే ఆమెను వెదికి తమకు అప్పగించాలని పోలీసుల్ని కోరాడు.