నిన్నట్నుంచి మొదలైన పతనం

ఫస్ట్ వీకెండ్ సూపర్ హిట్టయిన ఆదిపురుష్ సినిమాకు సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలైంది. ఊహించినట్టుగానే నిన్నటి వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది. మొదటి 3 రోజులతో పోలిస్తే, వసూళ్లు 70శాతం, ఆక్యుపెన్సీ 45…

ఫస్ట్ వీకెండ్ సూపర్ హిట్టయిన ఆదిపురుష్ సినిమాకు సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలైంది. ఊహించినట్టుగానే నిన్నటి వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది. మొదటి 3 రోజులతో పోలిస్తే, వసూళ్లు 70శాతం, ఆక్యుపెన్సీ 45 శాతం పడిపోయినట్టు చెబుతోంది ట్రేడ్.

మొదటి వారాంతం ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల రూపాయలు (గ్రాస్) కొల్లగొట్టింది. కానీ ఆ ట్రెండ్ సోమవారం కనిపించలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్ బెల్ట్ లో ఆదిపురుష్ సినిమాకు వసూళ్లు గణనీయంగా తగ్గాయి.

ఉత్తరాదిన శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు 35 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, సోమవారానికి 9 కోట్ల రూపాయలకు పడిపోయింది. నెగెటివ్ టాక్ కారణంగా, ఈ సినిమా హిందీలో ఇక కోలుకోవడం కష్టం అంటోంది ట్రేడ్. రామాయణాన్ని వక్రీకరించి తీశారనే టాక్, నార్త్ లో బాగా వ్యాపించడంతో, సినిమా చూసేందుకు ఫ్యామిలీస్ ఆసక్తి చూపించడం లేదనేది వాళ్ల విశ్లేషణ.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆదిపురుష్ వసూళ్లు గణనీయంగా తగ్గాయి. సోమవారం ప్రతి సెంటర్ లో డ్రాప్స్ కనిపించాయి. ప్రతి సినిమాకు ఇది సహజంగా కనిపించే ట్రెండే. కాకపోతే ఆదిపురుష్ విషయంలో మాత్రం ఇది ఆందోళన కలిగిస్తోంది.

ఎందుకుంటే, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అంతకుమించి వసూళ్లు రాబట్టాల్సి ఉంది. అలా జరగాలంటే, వీక్ డేస్ లో కూడా వసూళ్లు రావాలి. ఆ ట్రెండ్ కనిపించడం లేదు.