ఇటీవల విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్రంగా సాగుతున్న రాజకీయం వైఎస్ జగన్ సర్కార్కు నష్టదాయకమే. దీన్ని సీఎం వైఎస్ జగన్ ఆషామాషీగా తీసుకుంటే మాత్రం వైసీపీ భారీగా నష్టపోతుందని చెప్పక తప్పదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు రావడం పక్కన పెడితే, అధికార పార్టీ నేతల ఆగడాలకు వున్నవి కూడా తరలిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని ప్రతిపక్షాల విమర్శలకు బలం కలిగించేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇకపై తన వ్యాపారాల్ని హైదరాబాద్కు షిప్ట్ చేస్తానని ప్రకటించడం ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టైంది. అలాగే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయనేందుకు ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతమే నిదర్శనంగా నిలిచింది. విశాఖ ఎంపీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ కిడ్నాప్ కావడం చిన్న విషయం కాదు. సొంత పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడి కుటుంబానికే రక్షణ కల్పించలేకపోతే, ఇక సామాన్య ప్రజానీకానికి ఎంత మాత్రం రక్షణ కల్పిస్తారనే ప్రతిపక్షాల నిలదీతకు అధికార పక్షం నుంచి ఇంత వరకూ సరైన సమాధానం రాలేదు.
ఈ నేపథ్యంలో విశాఖ పట్నంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టనని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి పూర్తి చేసుకుని హైదరాబాద్కు షిప్ట్ అవుతానని ఎంపీ ఎంవీవీ చేసిన కామెంట్స్ వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం. విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ పేరున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పరిస్థితే ఇలా వుంటే, ఇక సామాన్యుల గురించి చెప్పేదేముంది?
ముఖ్యంగా విశాఖలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టానని, రాయి బ్లాస్టింగ్ కోసం 45 రోజుల క్రితం దరఖాస్తు చేస్తే ఇంత వరకూ అనుమతి రాలేదని, ఇదే తెలంగాణలో అయితే 24 గంటల్లో క్లియర్ అయ్యేదని అధికార పార్టీ ఎంపీ చెప్పారంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఎంపీ అయినప్పటికీ ఆయనకు పలుకుబడి లేదనే సంగతి అర్థమవుతోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరి, వారి అనుమతి లేనిదే ఏ పనీ చేయని దయనీయ స్థితి నెలకుంది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో సీఎం జగన్ తెలుసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం వుంది. లేదంటే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.