హీరో రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. ఉపాసన-చరణ్ దంపతులకు ఆడ బిడ్డ జన్మించింది. ఈరోజు ఉపాసన ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
నిన్ననే అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయింది ఉపాసన. అంతకు ముందే త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటూ, సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఉపాసన డెలివరీ టైమ్ వచ్చేసిందని అంతా ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే తల్లి అయింది ఉపాసన. దీంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి.
రామ్ చరణ్ తండ్రి అయితే సంతోషపడాలని, పుట్టిన బిడ్డతో ఆడుకోవాలని ఉందంటూ కొన్నాళ్ల కిందట చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లయి 11 ఏళ్లు అయినప్పటికీ, పిల్లలపై చరణ్-ఉపాసన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, చిరంజీవి ఒకింత బాధ వ్యక్తం చేశారు అమధ్య.
ఎట్టకేలకు ఉపాసన గర్భం దాల్చడంతో రామ్ చరణ్, చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయాన్ని ముందుగా చిరంజీవే బయటపెట్టారు. అప్పట్నుంచి మెగా కాంపౌండ్ లో సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఉపాసన శ్రీమంతం వేడుకను అంగరంగ వైభవంగా జరిపారు. దుబాయ్ లో కూడా ఓ ఫంక్షన్ చేశారు.
మరోవైపు తన గర్భాన్ని దాచే ప్రయత్నం చేయలేదు ఉపాసన. భర్త చరణ్ తో కలిసి శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ కు, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి కూడా హాజరైంది. అంతకంటే ముందు ఆస్కార్ అవార్డుల వేడుకకు కూడా వెళ్లింది. ఉపాసన కోసం తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నాడు చరణ్. కొన్ని రోజుల పాటు ఉపాసనతోనే ఉండబోతున్నాడు.
ఉపాసన డెలివరీ కోసం ప్రపంచప్రసిద్ధ వైద్యుల్ని సంప్రదించారు. వాళ్ల పర్యవేక్షణలో ఉపాసన క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ డెలివరీకి సిద్ధమైంది. ఇక ఆ డేట్ వచ్చేసరికి, ప్రత్యేకంగా అపోలో హాస్పిటల్ లో అంతర్జాతీయ వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. అలా ది బెస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన.