‘రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మహత్యలే’ అంటారు పెద్దలు. అలాంటి ఆత్మహత్యలను మనం అనేకం చూస్తుంటాం. అనేక పార్టీలు తమ చేజేతులా పతనం కొని తెచ్చుకున్న సందర్భాలను చూస్తుంటాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బిజెపి జట్టుకట్టే ప్రయత్నాలను గమనిస్తోంటే ఈ ఆత్మహత్యల సిద్ధాంతం గుర్తుకు వస్తోంది.
ఈ బంధం ముడిపడితే, అది ఎవరికి ఆత్మహత్యా సదృశం అవుతుంది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న! లోతుగా చూస్తే.. ఈ బంధం జంట ఆత్మహత్యలకు కారణం కాగలదని అనిపిస్తోంది. నిజానికి ఏపీలో టీడీపీ- జనసేన- బీజేపీ మూడూ పొత్తు కట్టినా కూడా.. ఆత్మహత్యల ప్రమాదం రెండింటికి మాత్రమే. ఎందుకంటే జనసేన కేవలం ఆటలో అరటిపండు!
ఆ రెండు పార్టీలకు ఈ బంధం ఆత్మహత్యతో సమానం ఎందుకు అవుతుంది? ఎలా? అని విశ్లేషించి చెప్పే ప్రయత్నమే.. ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘జంట ఆత్మహత్యలు’!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరే వాతావరణం ఖచ్చితంగానే కనిపిస్తోంది. ఇప్పటికి ఉన్న సంకేతాలను బట్టి పొత్తులు కుదిరినట్టే. సీట్ల దగ్గర బేరం చెడితేనో, నెంబర్ గేమ్ లో ఎవరైనా అత్యాశకు పోతేనో ఏమైనా తేడా కొడితే కొట్టవచ్చు. కానీ.. ఈ పొత్తుల ఆట కొత్తది కాదు కదా. 2014 లో అవే పొత్తులు. 2019 వచ్చేసరికి ముగ్గురూ విడిపోయారు. 2024 వచ్చేసరికి మళ్లీ కలవాలని తహతహలాడుతున్నారు. ప్రజలు వీళ్లకు ఎలా కనపిస్తుంటారు? గతంలో ఒకటిగా రంగంలోకి దిగిన వాళ్లు, అయిదేళ్లలోగా ఎందుకు కాట్లాడుకుని విడిపోయారో.. వీరు ప్రజలకు కారణాలు చెప్పగల స్థితిలో ఉన్నారా? అయిదేళ్ల కిందట ఒకరినొకరు నీచంగా తిట్టుకున్న వాళ్లు ఇప్పుడు తగుదునమ్మా అని చెట్టపట్టాలు వేసుకుని ప్రజల్ని వంచించే ప్రయత్నంలో ఉన్నారు.
ఇప్పుడు తాము ముగ్గురం ఎందుకు మళ్లీ కలుస్తున్నామో ప్రజలకు ఏం కారణాలు చెప్పగలరు వాళ్లు. సాధారణంగా రెండు పార్టీలు కలుస్తున్నాయంటే.. వారి మధ్య ఏదో ఒక సిద్ధాంత సారూప్యత ఉండాలి. ఉంటుంది. ఆ పార్టీల మౌలికమైన నిర్మాణంలో కొంత పోలికలు ఉంటాయి. ఈ మూడు పార్టీలకు అలాంటివి ఏం ఉన్నాయి? రాష్ట్రంలో పేదలందరినీ ధనవంతుల్ని చేసేస్తానని చెప్పే, అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబునాయుడు సిద్ధాంతాలకు, కులాల గోల తప్ప ఏ సభలో అయినా మరో మాట మాట్లాడడం తెలియని పవన్ కల్యాణ్ కు, హిందూత్వం- ముస్లిం ద్వేషం తప్ప మరో ఎజెండా ఉండని భారతీయ జనతా పార్టీకి ఏం భావాలు కలుస్తున్నాయని వారు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇదంతా పెద్ద డ్రామా.
వారికి ఉన్న కామన్ టార్గెట్ ఒక్కటే. జగన్ గెలవడానికి వీల్లేదు. అలాంటి టార్గెట్ పెట్టుకోడానికి వెనుక వారి మర్మం ఒకటే. జగన్ మళ్లీ గెలిస్తే.. ఈరాష్ట్రంలో తమకు ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఈసారి గెలిస్తే.. ఇంకో ముప్ఫయ్యేళ్ల పాటు తనకు తిరుగుండదని జగన్ అంటున్న మాటలు నిజంగానే నిరూపణ అవుతుందనేదే వారి భయం. అందుకే అత్యంత సీనియారిటీ ఉండే నాయకుడూ, ఇంకా బొడ్డూడని నాయకుడూ, చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే నాయకులూ అందరూ కలిసి జగన్ గెలవకుండా చూడాలనే కోరికతో కలుస్తున్నారు.
అయితే ఈ పొత్తుల ఫలితాలు ఎలా ఉండబోతాయి? రాబోయే ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎవరికి వారు- వారి వారి వ్యక్తిగత రాగద్వేషాలను బట్టి, పార్టీల మీద ప్రేమను బట్టి ఫలితాలను అలా ఊహించుకోవచ్చు. ‘‘సింహం సింగిల్ గానే వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి.. సింహాన్నీ ఏమీ చేయలేవు’’ అని జగన్ అభిమానులు రెచ్చిపోవచ్చు. అలాగే ‘‘మూడు పార్టీలు కలిసిన తర్వాత.. ఆ ప్రభంజనం ముందు ఎవ్వరూ నిలబడలేరు. .జగన్ కు రాజకీయ సమాధి గ్యారంటీ’’ అని చంద్రబాబు, పవన్ అభిమానులు గప్పాలు కొట్టుకోవచ్చు.
ఈ పొత్తుల వల్ల ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. కానీ.. ఎన్నికల తర్వాత పొత్తుల బంధం కుదుర్చుకుంటున్న వారు తలపోస్తున్నట్టుగా వారే గెలిస్తే గనుక.. ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతాయి. ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఎవరు ఎంత కోల్పోతారు? అనే విశ్లేషణే ఈ కథనం. పవన్ కల్యాణ్ కు వచ్చేది పొయ్యేదీ ఏమీ లేదు. ఆయన అసలే పార్ట్ టైం పొలిటీషియన్ గనుక.. ఆయనకు వాటిల్లగల లాభనష్టాల చర్చ తలెత్తదు.
కానీ ఒక కోణంలో చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇది ఆత్మహత్యా సదృశం! మరో కోణంలో చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ బంధం ఆత్మహత్యా సదృశం. అందుకే.. ఈ బంధాల ద్వారా జంటహత్యలు జరగబోతున్నాయనేది ఒక అంచనా! ‘‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే..’’ అనే సార్వకాలీనమైన సిద్ధాంతానికి ఈ పొత్తులు మరో చక్కటి తార్కాణంగా నిలబడబోతున్నాయి.
బిజెపికి ఆత్మహత్య ఎలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అస్తిత్వం ఎంత? ప్రభావం ఎంత? గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. అప్పుడు ఒంటరిగా పోటీచేసిన వారికి ఉన్నది కేవలం ఒక్కశాతం ఓటు బ్యాంకు. మహా అయితే అందులో వాళ్లు కోల్పోయేది ఏముటుంది? అని ఎవరికైనా అనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఒక్కసీటులోనైనా డిపాజిట్లు తెచ్చుకోలేకపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లో ఒక్క సాటు గెలిచినా.. వారికి లాభమే గానీ నష్టం ఏముంటుంది? అనేది ఒక ప్రశ్న. అది నిజమే గానీ, విజయాల తర్వాత ఏం జరుగుతుంది?
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం- దాని భవిష్యత్తు ఎలా తగలడిపోయినా పెద్ద ఫరక్ లేదు. అసెంబ్లీ మీద వారికి శ్రద్ధ లేదు. వారికి కావాల్సినదెల్లా లోక్ సభ సీట్లు మాత్రమే. కేంద్రంలో మోడీ 3.0 సర్కారు కోసం ఏపీ రాజకీయాలు కూడా ఒక మెట్టుగా ఉపయోగపడితే వారికి చాలు. తతిమ్మా ఏం అక్కర్లేదు. అందుకే, అమిత్ షా వంటి ఉద్ధండ నాయకుడు విశాఖ సభలో మాట్లాడుతూ.. 25 సీట్లున్న రాష్ట్రంలో తమ పార్టీ 20 గెలవాలని టార్గెట్ నిర్ణయించారు. ఒక్కశాతం ఓటు బ్యాంకు లేని పార్టీ, ఏకంగా ఇరవై సీట్లు గెలవాలని.. అంత అమాయకంగా ఎలా చెప్పగలిగారు.
ఎలాగంటే- చంద్రబాబునాయుడు గతిలేనితనం మీద అమిత్ షాకు ఉన్న నమ్మకమే అలా చెప్పించింది. తమ పొత్తులు బాబుకు అవసరం అని, తాము లేకుండా వెళ్లలేడని ఒక నమ్మకం. అసెంబ్లీ సీట్లకోసం ఎక్కువ పట్టుపట్టకుండా ఉంటే.. లోక్ సభ సీట్లు ఎన్ని అడిగితే అన్ని ఇస్తారని కూడా నమ్మకం. పైగా, 2019లో బాబు సొంతంగా పోటీచేసి సాధించినది కేవలం మూడే ఎంపీ సీట్లు. వాటితో పాటు తక్కువ మార్జిన్ తో ఓడిపోయిన మరికొన్ని ఉంచుకుని.. మిగిలిన సీట్లను బిజెపికి ధారాదత్తం చేయడానికి బాబు ఇబ్బంది పడకపోవచ్చు.
పొత్తు ధర్మం అంటే, గెలిచిన తర్వాత వీళ్లు మన కూటమిలోనే ఉంటారు గనుక.. ఏ పార్టీకి ఎన్ని సీట్లయితే ఏముంది అని జనరల్ గా అందరూ అనుకోవాలి. కానీ అమిత్ షా 20 ఆశిస్తున్నారంటే.. గెలిచిన తర్వాత.. చంద్రబాబు హ్యాండిస్తాడనే అనుమానం కూడా ఆయనకుంది. రాగల లాభం మొత్తం సీట్లలోనే పొందాలనుకుంటున్నారు. 20 దగ్గర బేరాలు మొదలెడితే అది 10-15 వద్ద తెగే అవకాశం ఉంటుంది. నిజానికి బిజెపికి అన్ని సీట్లు ఇవ్వడం కూడా చాలా ఎక్కువ. జనసేన పరిస్థితి వేరు. అసెంబ్లీ సీట్లు ఇస్తేనే పవన్ గెలుపుగుర్రాలను వెతుక్కోవాలి. ఎంపీ సీట్లు ఆ పార్టీకి ఇస్తే అభ్యర్థులకు గతిలేదు. అప్పుడిక ఆయన ‘మోడీ రాజ్యం రావడం కోసం నేను ఎంపీసీట్లను త్యాగం చేస్తున్నా’ అనే అందమైన మాటలను తయారుచేసుకుని, వల్లిస్తారు.
అసెంబ్లీలో కూడా బిజెపికి పరిమితంగా కొన్ని సీట్లు దక్కుతాయి. వాళ్లంతా గెలుస్తారనే అనుకుందాం. ఇప్పుడు అసలు సంగతి చూస్తే.. అసలు ఏపీ బిజెపి నాయకుల్లో ఒరిజినల్ బిజెపి వారెందరు? పచ్చ కోవర్టులు ఎందరు? అనేది పెద్ద చర్చ. చంద్రబాబునాయుడు ప్లాంటర్లు, తెలుగుదేశం కోవర్టులు బిజెపిలో చాలా మంది ఉన్నారు. చాలా కీలకంగా కూడా ఉన్నారు. చంద్రబాబు ఏజంట్లందరూ కూడా ఖచ్చితంగా టికెట్లు పొందుతారు. పచ్చ పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరిన వారందరూ కోవర్టులే! వారు మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంగా బిజెపిలోనే ఉండినా, ఇటీవల తెదేపాలో చేరదల్చుకుని పొత్తులుకుదురుతాయనే ఆలోచనతో వెనక్కు తగ్గిన వాళ్లున్నారు. వారందరూ చంద్రబాబు కోసమే పనిచేస్తారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీల మధ్య తేడాలు వస్తే.. ఆయా కోవర్టు ఎంపీలు, లేదా ఎమ్మెల్యేలు.. చంద్రబాబు ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తారే తప్ప.. బిజెపి క్షేమం ఆలోచించరు.
పచ్చ కోవర్టులు విజయం సాధించే కొద్దీ బిజెపి జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నట్టుగా అవుతుంది. ఆ రకంగా ఈ పొత్తులు బిజెపికి ఆత్మహత్యా సదృశం అవుతాయి. ఈ పొత్తుల ద్వారా సీట్లు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ సంస్థాగతంగా బలపడుతుందని బిజెపి అనుకుంటే అదంతా పెద్ద భ్రమ. కోర్ బిజెపి వాళ్లు కొన్ని సీట్లలో పోటీచేసినా.. వారు గెలవకుండా ఎటూ చంద్రబాబు మంత్రాంగం పనిచేస్తుంది. చంద్రబాబుతో బాగున్నంత వరకు అంతా బాగుంటుంది.. సంబంధాలు చెడితే.. చంద్ర కోవర్టులు అందరూ కమలదళంపై ఒత్తిడి తెస్తారు. కాషాయ పార్టీని, ఏపీకి సంబంధించినంత వరకు, తాము శాసించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిణామాలు ఏర్పడితే ఆత్మహత్యా సదృశం కాక మరేమిటి?
తెదేపా కూడా ఆత్మహత్య లాంటిదే!
ఈ పొత్తుల వల్ల తెలుగుదేశం ఎంత మాత్రం సుఖపడుతుందనేది కూడా సందేహమే. పొత్తుల విషయంలో చంద్ర వ్యూహాలు ఎంత చవకబారుగా తయారై, ఆయనకు తలబొప్పి కట్టిస్తుంటాయో.. 2018 తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఎన్నోమెట్లు దిగజారి, ఆ రాష్ట్రంలో పార్టీని కాపాడుకోడానికి కాంగ్రెస్ తో జట్టు కట్టారు. చంద్రబాబునాయుడు దెబ్బకు కాంగ్రెస్ కూడా పతనం అయిపోయింది. ఏపీలో మరీ అంత పరిస్థితి లేదు. పతనం కాగల స్థాయి బిజెపికి లేదు. కానీ బిజెపి దెబ్బకు చంద్రబాబుకు టెంకిజెల్ల తప్పకపోవచ్చు.
ఏ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నప్పటికీ.. ముస్లిం కమ్యూనిటీలో తెలుగుదేశానికి నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే బిజెపితో పొత్తు పెట్టుకుంటే.. ఆ ముస్లిం ఓటు బ్యాంకు కంప్లీట్ గా జీరో అవుతుంది. 2014 ఎన్నికల పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు.
ఈ తొమ్మిదేళ్లలో బిజెపి తమ ముస్లిం విద్వేష రాజకీయాలతో ఆ వర్గంలో చాలా పెద్ద అపకీర్తిని మూటగట్టుకుంది. ఒకప్పట్లో గుజరాత్ లోనే ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలు కూడా మోడీని నమ్మి, బిజెపిని గెలిపించాయి. కానీ ఇప్పుడు మోడీ సెక్యులర్ పాలన గురించి వారిలో భ్రమలు తొలగాయి. హిందూత్వ కార్డు ప్లే చేయడం ద్వారా కాదు కదా, ముస్లిం విద్వేషాన్ని ప్రచారం చేయడం ద్వారా మాత్రమే భాజపా మనుగడ సాగిస్తున్నదని వారు అర్థం చేసుకున్నారు.
బిజెపితో జట్టు కట్టిన ఏ పార్టీని కూడా ముస్లింలు క్షమించరు. మారిన నేపథ్యాన్ని, ఈ వాస్తవాన్ని చంద్రబాబు తెలుసుకోవాలి. తమ పార్టీకి ఉండే ముస్లిం ఓట్లు మొత్తం మంటగలిసిపోయినా.. తాను గెలవగలనేమో లెక్కలు వేసుకోవాలి. ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి ఈ పొత్తు ఆత్మహత్యా సదృశం అవుతుంది.
చంద్రబాబుకు ఇంకో నష్టం కూడా ఉంది. తడవకోమాదిరిగా మాట్లాడుతూ ప్రస్తుతం మోడీతో జట్టుకట్టాలని చూసే చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలను జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీల నేతలందరూ అసహ్యించుకుంటారనడంలో సందేహం లేదు. జాతీయ పార్టీల దృష్టిలో చంద్రబాబుకు ఒక విలువ ఉంది. కానీ.. ఈ అవసాన దశలో ఆ విలువను, ప్రాధాన్యాన్ని, మర్యాదను.. బిజెపితో పొత్తు వలన చంద్రబాబు పూర్తిగా కోల్పోతారు. ఆయన ప్రతిష్ఠకు ఈ పొత్తులు ఆత్మహత్యా సదృశం అవుతాయి.
రాజకీయ నాయకుల అంచనాలు ఆశావహంగా ఉంటాయి. పొత్తుల రూపంలో వారు జగన్ వ్యతిరేక ఓటు చీలదు అనే నమ్మకంతోనే వెళ్తారు. కానీ.. జగన్ అనుకూల ఓటు ఎంత ఉన్నదో వారు లెక్కలు వేసుకోరు. గుడ్డిగా బంధాలు కుదుర్చుకుని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉంటారు. మళ్లీ ఒకరినొకరు తిట్టుకుంటూ ఇంకొన్నేళ్లు బతికేస్తారు. కాబట్టి.. ఈ రెండు పార్టీల ఆత్మహత్యల పరిణామాలు ఎప్పటికి బయటపడతాయో మనం వేచిచూడాలి.
..ఎల్. విజయలక్ష్మి