ఓ ఇల్లాలు తన ఇద్దరు బిడ్డల్ని 8వ అంతస్తు పైనుంచి కిందకు తోసేసింది. తర్వాత తను కూడా అక్కడ్నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని సౌందర్యగా గుర్తించారు పోలీసులు.
ప్రాధమిక సమాచారం ప్రకారం… సికింద్రాబాద్ గాంధీనగర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో భర్త గణేశ్ తో కలిసి నివశిస్తోంది సౌందర్య. వీళ్లకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. నిత్యం గణేశ్, ఇంటికొచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు.
సౌందర్యను అందంగా లేవంటూ తిట్టేవాడు. కవలలు పుట్టారు కాబట్టి అదనంగా కట్నం తీసుకురావాలని వేధించేవాడు. చాన్నాళ్లుగా ఈ వేధింపుల్ని భరిస్తూ వచ్చింది సౌందర్య. ఈమధ్య కాలంలో గణేశ్ ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని చెబుతున్నారు చుట్టుపక్కల వాళ్లు.
ఈ క్రమంలో ఇక బతకడం వృధా అని భావించింది సౌందర్య. తను చనిపోతే పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని భయపడింది. పిల్లల్ని కూడా తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకుంది.
అనుకున్నదే తడవుగా పిల్లలిద్దర్నీ తీసుకొని అపార్ట్ మెంట్ 8వ అంతస్తుకు వెళ్లింది. ముందుగా పిల్లల్ని పైనుంచి తోసేసింది. ఆ వెంటనే తను కూడా దూకేసింది. ఈ దుర్ఘటనలో సౌందర్యతో సహా, పిల్లలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. జరిగిన ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గణేశ్ కోసం గాలిస్తున్నారు.