ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతకంటె ఇది చిత్రమైన సంగతేమీ కాదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం శవాసనం వేసి ఉంది. మళ్లీ లేచి నిల్చుంటుందో లేదో తెలియదు. కానీ.. మళ్లీ అధికారంలోకి వచ్చేస్తే.. ప్రజలకు ఏం చేస్తామో తాయిలాలు పెట్టడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు.
కేవలం తాయిలాలు ప్రకటించడమే అయితే.. జన్మలో ఎప్పటికీ అధికారంలోకి రాని ప్రతి రాజకీయ పార్టీ కూడాచేస్తుంది. కానీ చంద్రబాబు వెరైటీగా తాను అధికారంలోకి వస్తే చేయబోయే సాయం కోసం జనం ఇప్పుడే తమ పార్టీకి డబ్బులు చెల్లించాలని అంటున్నారు. అంటే జనం ఇప్పుడు తమ పార్టీకి డబ్బులిచ్చి పెట్టుబడి లాగా పెడితే.. రేపు అధికారంలోకి రాగానే.. సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వ ధనాన్ని ఇప్పుడు డబ్బులిచ్చిన వారికి దోచిపెడతానని చంద్రబాబునాయుడు ఆఫర్ చేస్తున్నారు.
ఇది అచ్చమైన క్విడ్ ప్రోకో.. ప్రజలకు లంచం ఇవ్వడం కాదు. మాకు మీరు లంచంగా డబ్బులివ్వండి.. అధికారంలోకి వచ్చి.. లంచాన్ని మించిన మేలు చేస్తాం అని నీచంగా ప్రకటించడం..! ఇలాంటి అతితెలివితేటలను చంద్రబాబునాయుడు పార్టీ నలభైవ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రకటించడం విశేషం.
ఇంతకూ చంద్రబాబునాయుడు ఏం చెబుతున్నారో తెలుసా? తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలంటే.. అంటే, ఆయన మాటల్లో మళ్లీ ప్రజల సేవ చేయాలంటే.. ప్రజల ఆశీస్సులు, అండ కావాలట. ఈ మాట ఎవరైనా చెప్తారు. ఆ అండ ఏమిటో తెలుసా? ప్రజలు ఇప్పటినుంచే పార్టీకి చందాలివ్వాలిట.
ప్రజలు ఎంత చందా ఇవ్వాలో కూడా చంద్రబాబునాయుడే డిసైడ్ చేసేశారు. ప్రజలు వారి వారి ఆదాయంలో 0.5 శాతం తెదేపాకు చందాగా ఇవ్వాల. అలా ఇచ్చిన వారికి ఒక డిజిటల్ కార్డు ఇస్తారట. ఆ కార్డు ఆధారంగా రేపు పార్టీ అధికారంలోకి వస్తే.. సాయం చేసిన వారిని గుర్తుంచుకుని ఆదుకుంటారట.
ఎంత నీతిమాలిన, సిగ్గుమాలిన బేరాలు ఇవి. ప్రజలు పార్టీకి డబ్బులిస్తే.. అధికారంలోకి వచ్చాక వారికి గమనినంచుకుంటాం అని చెప్తున్నారు ఆయన. డబ్బులివ్వని వారి పేర్లన్నీ సంక్షేమ పథకాల జాబితాల్లోంచి తొలగిస్తారనే దాని అర్థం కాబోలు. టీడీపీ ప్రభుత్వం వస్తే గనుక.. సంక్షేమ పథకాలు పొందాలనుకునే వారు ఇప్పుడే వారికి చందాలు, చదివింపులు ఇచ్చుకోవాలని అంతరార్థం కాబోలు.
ఇలాంటి అసహ్యకరమైన క్విడ్ ప్రోకో బేరాన్ని ప్రజలతో బహిరంగంగా చెప్పడానికి తన పార్టీ వయస్సుకంటె ఎక్కువగా రాజకీయ సీనియారిటీ ఉన్న చంద్రబాబునాయుడుకు నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఇలాంటి ప్రపోజల్ పార్టీ పరువు తీస్తుందని ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో కూడా అర్థం కాదు. ఈ మాటలు ప్రజలకు కరెక్టుగా అర్థమైతే గనుక.. పార్టీకి చందాలివ్వడం తర్వాత.. ఛీత్కరించుకుని ఛీకొట్టి ఇంటికి పంపుతారు.