ఆదిపురుష్ పై ‘అయోధ్య’ ఆగ్రహం

ఆదిపురుష్ సినిమా రిలీజైనప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంది. కోర్టు కేసులు పడిన సందర్భాలు కూడా చూశాం. కానీ ఇది అంతకుమించి. స్వయంగా అయోధ్య ఆలయ పూజారులు, అర్చకుల సంఘాలు, అయోధ్యలో…

ఆదిపురుష్ సినిమా రిలీజైనప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంది. కోర్టు కేసులు పడిన సందర్భాలు కూడా చూశాం. కానీ ఇది అంతకుమించి. స్వయంగా అయోధ్య ఆలయ పూజారులు, అర్చకుల సంఘాలు, అయోధ్యలో ఉన్న సాధువులు, హనుమాన్ గర్హి ఆలయ పూజారి.. ఆదిపురుష్ సినిమాపై అగ్రహం వ్యక్తం చేశారు.

ఆదిపురుష్ సినిమాలో సీతారాములు, హనుమంతుడి పాత్రల వేషధారణపై వీళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ ను తీవ్రంగా నిరశిస్తున్నారు. ఆంజనేయుడితో చెప్పించిన డైలాగులు సిగ్గుచేటని, తక్షణం ఈ సినిమాను నిషేధించాలని.. రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు.

“ఆదిపురుష్ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రల్ని పూర్తిగా మార్చి చూపించారు. ఇప్పటివరకు మనం చదువుకున్న, మనకు తెలిసిన రామాణంలో పాత్రల్లా ఇవి అనిపించడం లేదు. వాటికి భిన్నంగా మన దేవతల్ని చిత్రీకరించారు. హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ సిగ్గుచేటు.వెంటనే సినిమాను బ్యాన్ చేయాలి.”

అటు హనుమాన్ గర్హి ఆలయ పూజారి రాజు దాస్ కూడా ఆదిపురుష్ యూనిట్ పై విరుచుకుపడ్డారు. హిందూ మతాన్ని వక్రీకరించేందుకు బాలీవుడ్ తెగ తాపత్రయపడుతోందని, ఎలాంటి శ్రద్ధ లేకుండా ఆదిపురుష్ సినిమా తీశారని విమర్శించారు.

మరోవైపు దర్శకుడు ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ లను చంపేస్తామంటూ ప్రకటించింది మధ్యప్రదేశ్ కు చెందిన క్షత్రియ కర్ని సేన. ఆదిపురుష్ డైరక్టర్ ను చంపడానికి ముంబయిలో ఓ బృందాన్ని ఏర్పాటుచేస్తామని, వాళ్లకు ఆయుధాలిచ్చి వెదికి చంపమని చెబుతామని మీడియాముఖంగా వీళ్లు ప్రకటించారు.