వారాహి యాత్రలో సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై చెలరేగిపోతున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును సీఎం చేస్తామని పవన్‌కల్యాణ్ చెబుతుంటే, ఆయన వెంట కాపులెవరూ వెళ్లడం లేదన్నారు. దీంతో తానే సీఎం అవుతానంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. అంతిమంగా బాబు కోసమే పవన్ పని చేస్తారని ఆయన తేల్చి చెప్పారు.
పవన్‌కల్యాణ్‌ది నారాహి అబద్ధాల యాత్రగా పేర్ని అభివర్ణించారు. అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. పవన్ వల్ల ఎవరికి ప్రమాదం? రాజకీయంగా వైసీపీకి ఏమైనా ప్రమాదం వుందా? అని ఆయన ప్రశ్నించారు. కాపుల్లో తనపై సానుభూతి తగ్గిపోయిందని అనుకున్నప్పుడల్లా ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడని విమర్శించారు. సొల్లు కబుర్లు చెబుతుంటాడని ఆగ్రహించారు. ప్రాణహాని వుంటే పోలీసులకు కదా చెప్పాల్సింది అని ఆయన ప్రశ్నించారు.
చుట్టూ సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడని, కనీసం అభిమానుల్ని కూడా దగ్గరికి రానివ్వరు కదా అని ఆయన ప్రశ్నించారు. కనీసం తనతో పాటు పని చేసేవాళ్లను కూడా పవన్ దగ్గరికి రానివ్వడని అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను కూడా పక్కన ఉండనివ్వడని, అలాంటప్పుడు ప్రాణహాని ఎవరితో ఉందని ఆయన ప్రశ్నించారు.
పవన్‌కు ఉంటేగింటే చంద్రబాబుతో ప్రాణహాని వుండాలని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్‌కు బురద అంటించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఏదైనా చేయొచ్చన్నారు. చంద్రబాబు చేసిన పాపాలకి ఎన్నిసార్లు గుడ్డలు ఊడదీసి కొట్టాలని పవన్‌ను పేర్ని నాని ప్రశ్నించారు. లోకేశ్ నాయుడు అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించాడని, ఎన్నిసార్లు ఆయన్ని గుడ్డలూడదీసి కొట్టావని ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి తిరిగారని, ఎప్పుడైనా రూమ్‌లో వేసి కొట్టావా? అని ప్రశ్నించారు.
వాళ్లను కొడ్తా, వీళ్లను కొడ్తాననే మాటలు సినిమా డైలాగ్‌లు అని, హాస్యాస్పదంగా వుంటాయని ఆయన అన్నారు. పవన్‌కల్యాణ్ చెప్పే ప్రతి మాట అబద్ధమే అన్నారు. లేదా సినిమా మాట అన్నారు. పవన్ మాటల్ని సినిమా డైలాగ్‌లు అనుకుని ఆనందించడం మంచిదని ఆయన అన్నారు.
గోదావరి జిల్లాల్లో కాపుల్ని రెచ్చగొట్టి చంద్రబాబుకు తాకట్టు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని పవన్ మాటల్ని బట్టి అర్థమవుతోందన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది మాట్లాడ్తాడని, ఆయన కోసం ఎంతకైనా బరి తెగిస్తాడని ఘాటు విమర్శలు చేశారు. అంతిమంగా చంద్రబాబుతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కోసం పవన్‌కల్యాణ్ ఎన్ని పిల్లిమొగ్గలైనా వేస్తాడని తీవ్ర ఆరోపణ చేశారు.