ట్విట్టర్ లో స్పెషల్ రిక్వెస్ట్ చేసింది అనసూయ. ఇన్నాళ్లూ వివాదాలతో హాట్ టాపిక్ గా మారిన ఈమె, ఇప్పుడిలా ప్రత్యేక విన్నపంతో నెటిజన్ల ముందుకు రావడం ఆకట్టుకుంది. ఇంతకీ అనసూయ విన్నపం ఏంటో చూద్దాం..
“నాదో ప్రత్యేక విన్నపం. కొన్ని రోజులుగా కొన్ని ట్వీట్స్ చూస్తున్నాను. రాజకీయాలు, సినిమాల్లో ఉన్న కొందర్ని కించపరచడానికి నా పేరు వాడుకుంటున్నారు. నాతో కంపేర్ చేస్తూ వాళ్లను కించపరుస్తున్నారు. ఇలా చేయడం నన్ను కూడా కించపరచడమే.”
ఇదీ తాజాగా అనసూయ ఎదుర్కొంటున్న సమస్య. కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి తన పేరు వాడడం ఏమాత్రం సమంజసం కాదని అంటోంది. ఓ మహిళగా తనకంటూ ఓ మార్గాన్ని ఏర్పరుచుకున్నానని, తనకు ఎలాంటి పీఆర్ వ్యవస్థ కూడా లేదని తెలిపింది అనసూయ.
తనంటే ఇష్టంలేకపోయినా, తనను ప్రోత్సహించడం ఇష్టం లేకపోయినా.. దయచేసి తనకు దూరంగా ఉండాలని అనసూయ కోరింది. చర్చించే సామర్థ్యం కూడా లేని కొంతమంది వ్యక్తులు, ఎలాంటి దయ, మానవత్వం లేకుండా తన పేరును అనవసర విషయాల్లోకి లాగుతున్నారని ఆమె ఆరోపించింది.
ఓ మంచి మార్పు కోసం మాత్రమే తను సోషల్ మీడియాలో కొనసాగుతున్నానని, పైగా తనకు ఓ కుటుంబం ఉందని.. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని వ్యవహరించాలంటూ.. తన పేరును అసందర్భంగా వాడుతున్న నెటిజన్లకు సూచించింది అనసూయ.
ఆమె వ్యాఖ్యలపై ఎప్పట్లానే కొంతమంది ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరికొంతమంది మద్దతు పలికారు. రీసెంట్ గా కొంతమంది రాజకీయ నాయకులపై ట్రోలింగ్ చేసే క్రమంలో, అనసూయ మీమ్స్, సినిమాల్లో ఆమె చెప్పిన డైలాగ్స్ ను కొన్నింటిని, కొంతమంది నెటిజన్లు వాడుకున్నారు. వీటిపై అనసూయ అభ్యంతరం తెలిపింది.