పవన్ కల్యాణ్ మీద క్రిమినల్ పరువునష్టం దావా!

పవన్ కల్యాణ్ దూకుడుగా మాట్లాడడం ద్వారా.. ప్రజలను ఎక్కువ ఆకట్టుకోవచ్చునని నమ్మే అపరిణత రాజకీయ నాయకుడు. ప్రజలందరూ మాస్ అని.. వారికి మాస్ డైలాగులు మాత్రమే నచ్చుతాయని అనుకునే వ్యక్తి.  Advertisement అందుకే ప్రజలను…

పవన్ కల్యాణ్ దూకుడుగా మాట్లాడడం ద్వారా.. ప్రజలను ఎక్కువ ఆకట్టుకోవచ్చునని నమ్మే అపరిణత రాజకీయ నాయకుడు. ప్రజలందరూ మాస్ అని.. వారికి మాస్ డైలాగులు మాత్రమే నచ్చుతాయని అనుకునే వ్యక్తి. 

అందుకే ప్రజలను స్పైసీగా రంజింపజేసేందుకు ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి తీవ్రమైన విమర్శలు చేసే ప్రయత్నంలో భాగంగా.. ‘క్రిమినల్ ముఖ్యమంత్రి’ అని పదేపదే అంటున్నారు. క్రిమినల్ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నాడు.. క్రిమినల్ ముఖ్యమంత్రి అంటూ.. చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ దూకుడు ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ మీద క్రిమినల్ పరువునష్టం దావా వేయడానికి గల అవకాశాలను జగన్ అభిమానులు న్యాయనిపుణులతో సంప్రదించి తెలుసుకుంటున్నట్టుగా సమాచారం.

పవన్ కల్యాణ్ తాజాగా కాకినాడ నియోజకవర్గంలో తన వారాహి విజయయాత్ర నిర్వహించారు. అక్కడి సర్పవరం జంక్షన్ నుంచి లోకల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై నిప్పులు కురిపించారు. ఈసారి ఎన్నికల్లో ద్వారంపూడిని ఓడించకపోతే.. తన పేరు పవన్ కల్యాణే కాదు అని భీషణమైన ప్రతిజ్ఞ కూడా చేశారు. అయితే ఎమ్మెల్యే ద్వారంపూడిని డెకాయిట్ అని, బియ్యం స్వాహా చేస్తూ 15 వేల కోట్లు పోగేశారని రకరకాల ఆరోపణలు చేశారు. అంతవరకు పరిమితమై ఉన్నప్పటికీ కూడా బాగుండేది.

క్రిమినల్ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్న క్రిమినల్ సీఎం మనకొద్దు అని, ముఖ్యమంత్రి జగన్ ని కూడా క్రిమినల్ గా అభివర్ణిస్తూ పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు. నొటోరియస్, ఫ్యాక్షనిస్ట్ అంటూ దుమ్మెత్తిపోశారు. క్రిమినల్ రాజ్యం కూలదోద్దాం  అని సందేశం ఇచ్చారు. ఈ అన్ని రకాల తిట్లలోనూ ముఖ్యమంత్రిని క్రిమినల్ గా అభివర్ణించిన మాటలే ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. 

సహజంగానే ఇవి జగన్ అభిమానులకు కోపం తెప్పిస్తాయి. అయితే తిరిగి పవన్ కల్యాణ్ తిట్టిపోయడం ఒక ఎత్తు. అంతటితో ఆగకుండా.. ఆయన మాటలమీద క్రిమినల్ పరువునష్టం దావా వేయాలని వారు అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇందుకోసం న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

దావా నేరుగా పవన్ వేయాల్సిన అవసరం లేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్రిమినల్ గా అభివర్ణించడం ద్వారా.. మా రాష్ట్ర ప్రజలకు పరువు నష్టం కలిగించాడు. అని పవన్ మీద దావా వేయడానికి ఏ పౌరుడికైనా హక్కు ఉంటుంది. ఆ రకంగా వేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 

ఇటీవల మోడీ అనే ఇంటిపేరు గురించి రాహుల్ గాంధీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. నరేంద్రమోడీ స్పందించలేదు. మోడీ అనే ఇంటిపేరున్న మరో సాధారణ వ్యక్తి స్పందించి క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఎంపీ పదవి పోయింది. ఎంపీ క్వార్టరు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. మరో ఏడేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీచేయడానికి కూడా అవకాశం లేదు. పైకోర్టులో అప్పీలుచేసుకుని, విచారణ సాగుతున్నది గనుక, ఇంకా జైలుకు వెళ్లకుండా ఉన్నారంతే!

ఈ కేసే జగన్ అభిమానులకు స్ఫూర్తి ఇచ్చింది. అదే తరహాలో.. జగన్ ను అన్నట్టుగా కాకుండా, ముఖ్యమంత్రిని నిరాధారంగా క్రిమినల్ గా అభివర్ణించినందుకు రాష్ట్రప్రజల తరఫున క్రిమినల్ పరువునష్టం వేయాలనుకుంటున్నారు. ఆకేసులో న్యాయస్థానం గనుక.. పవన్ కల్యాణ్ కు రెండేళ్లకు తగ్గని జైలు శిక్ష విధిస్తే గనుక.. అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా లాంటి ప్రగల్భాలన్నీ మంటగలిసిపోతాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.