దివంగత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైంది. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరంగా అనేక మార్పులకు తెలుగుదేశం పాలన కారణమైంది. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని 1983కు ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకునేంతగా టీడీపీ సమాజ చైతన్యానికి దోహదం చేసింది. దివంగత ఎన్టీఆర్‌కు అంత వరకూ సినిమాలతో తప్ప రాజకీయాలతో సంబంధం లేదు.
కానీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని విశ్వసించి సంక్షేమ, అభివృద్ధి పాలన సాగించారు. అంత వరకూ అధికారం, రాజకీయం కేవలం కొన్ని కులాలు, డబ్బున్న వాళ్ల చేతల్లోనే వుండేది. టీడీపీ ఆవిర్భావం తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యావంతులు, అంత వరకూ రాజకీయానికి దూరంగా ఉంటున్న అణగారిన వర్గాలకు టీడీపీ అగ్రస్థానం కల్పించింది.
టీడీపీకి 40 ఏళ్లు నిండాయి. 41వ వసంతంలో అడుగు పెడుతున్న తరుణంలో ఆ పార్టీ ప్రస్థానం గురించి తప్పక చర్చించుకోవాలి. ఎందుకంటే ఏపీ రాజకీయ చిత్రపటంలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీని రెండు దశలుగా విభజించి చూడాలి. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీ, ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రయాణాన్ని విభజించి చూడాలి. ఎన్టీఆర్ హయాంలో పార్టీలో సామాన్యులకు చోటు ఉండేది. కానీ చంద్రబాబు హయాంలో కార్పొరేట్ శక్తుల స్థావరంగా టీడీపీ తయారైంది. అంటే టీడీపీని చంద్రబాబు కార్పొరేటీకరణ చేశారు. ఇక్కడే పార్టీ పునాదులు కదలడం మొదలయ్యాయి.
ఒకప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమనూ విజయం వరించి అసెంబ్లీలో, పార్లమెంట్‌లో అడుగు పెడతామనే ఆశ వివిధ పార్టీల్లో ఉండేది. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. నాలుగు దశాబ్దాలున్న టీడీపీ అధికారంలోకి రావాలంటే పొత్తు లుంటే తప్ప గట్టెక్కలేని దుస్థితి. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు.
కనీసం సొంతంగా గెలవలేని జనసేనాని పవన్‌తో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నారంటే టీడీపీ ఎదిగినట్టా? దిగజారినట్టా? టీడీపీ ఆత్మ పరిశీలన చేసు కోవాల్సిన సమయం ఇది. ఎందుకని పొత్తులుంటే తప్ప ఎన్నికలకు వెళ్లలేని దుస్థితి పార్టీకి వచ్చిందో టీడీపీ నేతలంతా ఆలోచించాల్సిన విషయం. అభివృద్ధికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తారనడంలో రెండో మాటకు తావు లేదు. ఇదే సందర్భంలో ప్రచారం ఎక్కువ, విషయం తక్కువ అనే విమర్శ కూడా లేకపోలేదు.
ప్రస్తుతం 40 ఏళ్ల టీడీపీ ఓ కీలక దశలో ఉంది. చంద్రబాబు వయసు పైబడుతుండడం, మరో ఐదారేళ్లు తప్ప పని చేయలేని పరిస్థితి. ఇదే సందర్భంలో పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదగకపోవడం ఆ పార్టీ భవిష్యత్‌పై ఆందోళన కలిగిస్తోంది. నారా లోకేశ్‌కు సహజంగా క్షేత్రస్థాయిలో కష్టపడే గుణం లేదనే విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. కాలానుగుణంగా సరికొత్త సిద్ధాంతాలతో రాజకీయ పార్టీలు తెరపైకి రానున్నాయి.
జవసత్వాలు లేకుండా వారసత్వ రాజకీయాలతో నెట్టుకురావడం భవిష్యత్‌లో కష్టం. అందుకే నారా లోకేశ్ నాయకత్వంలో టీడీపీ భవిష్యత్ కష్టమనే అభిప్రాయాలు వెల్లువెత్తడం. ఈ నేపథ్యంలో 2024లో జరిగే ఎన్నికలు టీడీపీ భవిష్యత్‌కు పెద్ద అగ్నిపరీక్షే. ఈ దఫా అధికారంలోకి రాకపోతే మాత్రం టీడీపీ భవిష్యత్‌ను దేవుడే కాపాడాలి.