చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ సీటుపై ప్రముఖ వ్యాపారి డీకే శ్రీనివాస్ కన్ను పడింది. తిరుపతి నుంచి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. మాజీ ఎంపీ, దివంగత డీకే ఆదికేశవులనాయుడు తనయుడే డీకే శ్రీనివాస్. ఈయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. డీకే శ్రీనివాస్ తల్లి డీకే సత్యప్రభ చిత్తూరు నుంచి ప్రాతినిథ్యం వహించారు. 2019లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2020, నవంబర్‌లో డీకే సత్యప్రభ అనారోగ్యంతో కన్నుమూశారు.
మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు చాపకింద నీరులా తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో డీకే శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన 2009లో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి 18శాతం ఓట్లను దక్కించుకున్నారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
తల్లిదండ్రులిద్దరూ లేకపోవడంతో తానే రాజకీయంగా ముందుకు రావాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తిరుపతి నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. గెలుపోటములను శాసించే స్థాయిలో తన సామాజిక వర్గమైన బలిజ ఓటర్లు ఎక్కువగా ఉండే తిరుపతిపై ఆయన దృష్టి పడింది. టీడీపీ లేదా జనసేన తరపున తిరుపతి బరిలో నిలవాలని ఆయన ఆశిస్తున్నారు.
కావాల్సినంత డబ్బున్న డీకే శ్రీనివాస్‌కు టికెట్ పెద్ద సమస్య కాదనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తిరుపతిలో టీడీపీ తరపున సుగుణమ్మ నాయకత్వం వహిస్తున్నారు. ఈమెది బలిజ సామాజిక వర్గమే. సుగుణమ్మతో పోల్చితే డీకే శ్రీనివాస్ వైపే బలిజ సామాజిక వర్గం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సుగుణమ్మ నాయకత్వాన్ని బలిజలు మోస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలున్నాయి. సంజయ్, సుగుణమ్మలకు డీకే శ్రీనివాస్‌తో చెక్ పెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు మెగాస్టార్ కుటుంబంతో డీకే శ్రీనివాస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. డీకే శ్రీనివాస్ పోటీకి జనసేన సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి డీకే శ్రీనివాస్ పోటీ చేయడం తథ్యమని చెప్పొచ్చు.