భూనభోంతరాళాలు బద్దలయ్యేట్లు ఆరారార్ విడుదలైంది. జనాలంతా విరగబడి చూస్తున్నారు. సామాన్యుడి వినోదం కోసం అంటూ సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించిన ఆంధ్ర ప్రభుత్వం యీ సినిమాను అసామాన్యుల కోసమే అనుకుని చిత్తం వచ్చినట్లు అమ్ముకోమంది.
ప్రభుత్వం ఐదు ఆటలకు అనుమతించింది కాబట్టి కొసరుగా ఆరో ఆటకు మేం యిస్తున్నామంటూ అధికారులు యిచ్చారని, అనేక ఊళ్లలో దిగ్విజయంగా ఆరు ఆటలు వేసేశారని వార్తలు వింటున్నాను. 500 టిక్కెట్టు పెట్టి చూడకపోతే పరువు తక్కువ, మేం అసామాన్యులమే కానీ, సాదాసీదా జనం కాదు అని నిరూపించుకోవడానికి జనాలు థియేటర్లకు వేలం వెర్రిగా ఎగబడుతున్నారుట.
ఫయర్ పర్మిట్లతో సహా సకల సౌకర్యాలు సమకూర్చుకుని, లైసెన్సులు పునరుద్ధరించుకోవడానికి జనవరి నెలాఖరు వరకు థియేటర్లకు పేర్ని నానిగారు టైమిచ్చారు. ఎన్ని థియేటర్లు ప్రదర్శనకు అనుకూలంగా మారాయో ఫిబ్రవరి నెలలో జాబితా వస్తుందనుకున్నాను. రాలేదు.
దానాదీనా అర్థమయిందేమిటంటే ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. పబ్లిక్ క్రేజ్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవడానికి బడా ఫిలిం నిర్మాతలకు హక్కులిచ్చేసింది. నిస్సంకోచంగా మమ్మల్ని దోచుకో అని ప్రేక్షకులు అంటున్నారు. మహరాజులాగ అని నిర్మాతలంటున్నారు, మియాబీవీ రాజీ పడితే, మధ్యలో మాకేం తీపు తీసింది అని ప్రభుత్వం అంటోంది.
కానీ అప్పుడప్పుడు మాత్రం తీస్తుంది, తస్మదీయుల సినిమాలు వచ్చినపుడు! అప్పుడు థియేటర్లలో కుళాయిల్లో నీళ్లు వస్తున్నాయో లేదో, సీట్లకు కుషన్లు ఉన్నాయో లేదో అధికారులు వచ్చి చెక్ చేస్తారు, మూయిస్తారు. చివరకు యిది ఎలా తేలిందంటే, సినిమా పరిశ్రమ తన పదవిని గుర్తించకపోవడంతో, తనను పట్టించుకోకపోవడంతో అహం దెబ్బ తిన్న జగన్ తన తడాఖా చూపడానికే టిక్కెట్ల రగడ ప్రారంభించినట్లయింది.
ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రపు ముఖ్యమంత్రితో పేచీ పెట్టుకుంటే నష్టమని గ్రహించి, రాజీ పడినవారికి ఆంధ్రప్రభుత్వపు ఆపన్నహస్తం అందిస్తుంది. నీతో నాకేమిటని విర్రవీగితే, పరిస్థితి బిర్ర బిగుస్తుంది. ఈ సినిమాకు మొదటి పది రోజులు హెచ్చు రేట్లకు అనుమతించింది. నటీనటుల పారితోషికం కాకుండా రూ.100 కోట్ల బజెట్ దాటిందని నిర్మాతలు ఏ రుజువు చూపించారో, ఇన్‌కమ్ టాక్స్ వాళ్లకు కూడా అవే అంకెలు చూపిస్తారో లేదో తెలియదు. దీనిలో ఐతే సిజి వర్క్ చాలా వుంది కాబట్టి ఖర్చయింది అనవచ్చు. రేపు ఆచార్యకు, సర్కారువారి పాటకు ఏం చూపించినా చూపించకపోయినా, యిలాటి కన్సెషన్లు యిస్తారని అనుమానంగా వుంది. ఇప్పటివరకు ఆంధ్ర ప్రభుత్వపు ‘సామాన్యుడికి అందుబాటు ధరలో వినోదం’ నినాదంలో డొల్లతనం చూపడానికి రాసినది. వ్యాసం మెయిన్ ఫోకస్ సినిమాలో అల్లూరి పాత్ర గురించి నా భావాలు.
నేను సినిమా యింకా చూడలేదు. అందువలన దాని బాగోగుల గురించి ఏమీ రాయను. కలక్షన్ల వర్షం గురించి అసలే రాయను. నా దృష్టి వాటి మీద అస్సలు లేదు. సినిమా చూడకపోయినా, యిది అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల గురించిన హిస్టారికల్ ఫిక్షన్ సినిమా అని రాజమౌళి ప్రకటించిన దగ్గర్నుంచి తెలుసు. వారు ఉనికి యథార్థం, అయితే వారు చేసి వుండని కొన్ని పనులు చేసినట్లుగా ఊహించి కల్పించినదాన్ని హిస్టారికల్ ఫిక్షన్ అంటారు. ఆ కల్పన వారి వ్యక్తిత్వానికి, స్వభావానికి భంగం కలగని రీతిలో ఉండేట్లా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాటి రచన చేసినా, సినిమా తీసినా లోకంలో అందరూ దీన్ని పాటిస్తారు.
మరి యీ సినిమాలో అల్లూరి పాత్రను కొంతకాలం పాటైనా బ్రిటిషు సైనికుడిగా చూపడమనేది నా మనసును కలచివేస్తోంది. నాబోటి వాళ్లు ఉంటారనే కాబోలు, రాజమౌళి భీమ్ యింటిపేరు కొమురంను పూర్తిగా వాడి, అల్లూరి దగ్గరకు వచ్చేసరికి ఎ. అని పొడి అక్షరం వాడేరు. ఎవరైనా యీ విషయంగా కేసు పెడితే ఆయన అల్లూరి సీతారామరాజు కాదు, అల్లం సీతారామరాజు అని బుకాయించవచ్చని ధైర్యమేమో!
రాజమౌళి మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు, అల్లూరి, కొమురం యిద్దరూ నిజజీవితంలో కలవలేదు. ఒకవేళ కలిసి ఉంటే… అనే ఊహతోనే యీ సినిమాను కల్పించాను అని. అందువలన రామ్‌చరణ్ వేసిన పాత్ర అల్లూరిదే అని సమస్తలోకానికి తెలుసు, ఈయన యింటిపేరు ఎ అని పెట్టినా, బి అని పెట్టినా! ఒక గిరిజన బాలికను రాణివాసం నుంచి రక్షించడానికి భీమ్ దిల్లీ వెళ్లినట్లు, అల్లూరి కూడా బాంబుల తయారీని చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి విప్లవవీరుల నుంచి తెలుసుకోవాలని వెళ్లాడని, అక్కడ దిల్లీలో భీమ్‌తో భేటీ జరిగిందని కల్పించి ఉండవచ్చు. కృష్ణ ‘‘అల్లూరి..’’ సినిమాలో హీరో ఉత్తరాది పర్యటనకు వెళ్లి భగత్ సింగ్ వంటివారితో చర్చలు జరిపినట్లు చూపించారు కాబట్టి, భగత్, ఆజాద్‌లు బాంబులు తయారు చేశారని చరిత్రలో ఉంది కాబట్టి, అది అతికి వుండేది.
కానీ యిక్కడ కథకుడికి వచ్చిన సమస్య ఏమిటంటే, ఇద్దరు హీరోలుంటే యిద్దర్నీ కాస్సేపు ప్రత్యర్థులుగా చూపించి, ఆ తర్వాత మిత్రుల్ని చేయాలి. భీమ్, రామ్ యిద్దరూ దేశభక్తులే అయితే యిద్దరి మధ్య ఘర్షణకు అవకాశం వుండదు. పోనీ ఒకరిది హింసామార్గం, మరొకరిది అహింసామార్గం కాబట్టి భిన్న ధృవాలుగా వున్నారు అని చెప్దామంటే చరిత్రలో యిద్దరిది పోరాటపంథాయే. పోనీ అల్లూరి కాకుండా గాంధీ మార్కు శాంతి మార్గం అవలంబించిన మరో పాత్రను పెడదామంటే ఏ హీరో దాన్ని వేయడానికి ఒప్పుకోరు. ప్రతీవారికీ వీరత్వం చూపించే ఫెరోషియస్ పాత్రే కావాలి.
ఇద్దరూ విప్లవవీరులే కానీ ఘర్షణ పుట్టాలంటే భీమ్ ముస్లింగా మారువేషంలో ఉండేటప్పుడు హిందువైన రామ్ ఏదో ఒక మతఘర్షణలో అతనితో తలపడాలి. అసలే దేశంలో హిందూ-ముస్లిం గొడవలు జరుగుతున్నాయి. ఎవర్ని ఎక్కువగా, ఎవర్ని తక్కువగా చూపించినా అదో తలకాయనొప్పిగా తయారవుతుంది. అందుకని ఒకర్ని బ్రిటిషు వారిని ఎదిరించేవారిగా, మరొకర్ని బ్రిటిషు వారిని సమర్థించేవారిగా చూపించాల్సి వచ్చిందనుకుంటా.
బ్రిటిషువారిని సమర్థించడమనేది తాత్కాలికమే, అది ఆయుధ సముపార్జనా ప్రణాళికలో భాగమే అని చూపిస్తే అల్లూరి దేశభక్తికి లోపం రాదనుకుని రచయిత, దర్శకుడు అనుకుని ఉంటారు. లక్ష్యం ఎంత గొప్పదైనా కానీ కొద్దికాలం పాటైనా బ్రిటిషు సైనికాధికారులకు సలాం కొట్టేవాడిగా, వారి ఆజ్ఞపై స్వాతంత్ర్యయోధులను చితక్కొట్టేవాడిగా అల్లూరిని ఊహించుకోవడం తెలుగువాడిగా నాకు దుస్సహంగా వుంది. దేశంలో తక్కిన భాషాప్రేక్షకులకు యీ యిబ్బంది లేకపోవచ్చు. అల్లూరి ఎవరో వాళ్లకు తెలియదు కాబట్టి! కానీ కృష్ణ సినిమాలో మొదటి సీను నా మనసులో ముద్రించుకుని పోయింది.
అల్లూరి చిన్న పిల్లవాడిగా ఉండగా ఓ చోట కూర్చుని ధ్యానం చేసుకుంటూ వుంటాడు. మరో పిల్లాడు ఆటలో భాగంగా అతని మీద నుంచి దూకుతాడు. అంతే, అల్లూరి ఆ పిల్లవాణ్ని కొడతాడు. అలా కొట్టకూడదని టీచరు దండించబోతే స్కూలే మానేస్తాడు. తన మీద నుంచి ఎవరో దూకితేనే సహించని అల్లూరి బ్రిటిషు బాసులకు ఊడిగం చేశాడని అనుకోగలనా?
పురాణపాత్రలతో ఎలాగూ స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఒరిజినల్ పురాణాలేమిటో, తర్వాత ఎవరి కాలంలో ఎన్ని ఉదంతాలు చేరుతూ వచ్చాయో ఎవరికీ తెలియదు. వాల్మీకి రామాయణం, వ్యాసభారతం కూడా అనేక వెర్షన్లు ఉన్నాయి. సరే ఏదో ఒకటి స్టాండర్డ్ అనుకున్నా, వాటికి స్థానిక భాషల్లో అనువాదాలు చేసినపుడు అనువాదకులు స్వతంత్రంగా కొన్ని మార్పులు చేశారు. అందువలన బ్రాడ్‌గా కథ ఒకేలా ఉన్నా, ప్రతి భాషలో ఉన్న వెర్షన్లలో కాస్తకాస్త తేడాలుంటాయి. నేను భారతంలోని పాత్రల గురించి వ్యాసాలు రాస్తున్నపుడు సంస్కృతమూలమే (నాకు అందుబాటులో ఉన్నది) తీసుకుంటున్నాను. తెలుగుది కూడా కలిపితే కన్‌ఫ్యూజన్ వస్తుందని. శతాబ్దాల క్రితమే నన్నయ, తిక్కన స్వేచ్ఛ తీసుకుంటే, తర్వాతి రోజుల్లో కవులు, నాటకకర్తలు, సినీరచయితలు ఏ మేరకు స్వేచ్ఛ తీసుకుంటారో ఊహించవచ్చు.
ఏ మార్పులు చేసినా, మౌలికంగా పాత్రల స్వభావం గురించి సామాన్య భారతీయుడికి ఒక ఐడియా వుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆ పాత్రలను వేరే కోణంలో చూపిస్తున్నాం అంటూ దుష్టపాత్రల్లో సద్గుణాలు వెతకడం మొదలుపెట్టారు కొందరు. రావణుడు దుష్టుడనే భావంతో, అతని పేరు పిల్లలకు పెట్టుకోం. కానీ ఎవరో బయలుదేరి ‘అతను గొప్ప శివభక్తుడు తెలుసా’ అంటూ వాదించడం మొదలుపెడతాడు.
శివభక్తుడైతే ఏమిటి? ఆ మాటకొస్తే ప్రతీ రాక్షసుడు శివుడికో, బ్రహ్మకో భక్తుడై, తపస్సు చేసి, వరాలు పొంది జనాల్ని హింసించారు. రావణుడు తన శివభక్తితో ప్రజలకు చేసిన మేలేముంది? సోదరుడి వరసవాడైన కుబేరుడి పుష్పకవిమానం హరించాడు, అతని కోడలు రంభను చెరిచాడు. మరింత మందిని పాడుచేయడానికి, ఎత్తుకు రావడానికి శక్తి నియ్యి అని శివుణ్ని భక్తితో ప్రార్థించాడేమో! అందుకని భక్తి విషయం పక్కన పెట్టి అతను చేసిన మంచిపనులేమిటో చెప్పాలి.
అలాగే దుర్యోధనుడు గొప్పవాడు, కర్ణుడితో స్నేహానికి ప్రాణం యిచ్చాడు అని చెప్తారు. ఎస్ బాస్ అనేవాడికి, తనకు దుష్టపు సలహాలు యిచ్చినవాడికి సకల సౌకర్యాలు కల్పించడం అదో గొప్ప పనా? అతను చేసిన త్యాగం లేదా ప్రజలకు సమకూర్చిన మేలు ఏమైనా ఉందా? దానికి భారతంలో ఆధారం ఉందా?
ఇక ఆ తర్వాత మహిషాసురుడు దళితుడు, చాలా మంచివాడు. దుర్గ అనవసరంగా చంపేసింది అంటారు. బలి దళితుడు అంటారు. ఈ క్లెయిమ్స్‌కు అప్పటి గ్రంథాల్లో ఆధారం ఉందా? అసలు దళితకులం అప్పుడుందా? ఇలా దుష్టపాత్రలకు మంచివాడనే సెంటు అద్దడం ఒక అపార్థమైతే, మంచి పాత్రలను చెడుగా చిత్రీకరించడం సమాజానికి అనర్థం. లభ్యమౌతున్న పురాతన గ్రంథాలలో ఆధారం చూపగలిగితే, అది యథార్థమా, ప్రక్షిప్తమా అనే విషయం పండితచర్చకు పెట్టవచ్చు. అదేమీ లేకుండా నాటకీయత కోసం ఊహించి రాసేస్తే దుర్మార్గం.
చరిత్రకు సంబంధించిన విషయాలూ అంతే. దొరికిన ఆధారాల బట్టి నిజానిజాల గురించి విజ్ఞులు చర్చించవచ్చు. ఇటీవలి కాలంలో గాంధీ, నెహ్రూల గురించి అడ్డమైన రాతలూ వాట్సప్‌లలో విహారం చేస్తున్నాయి. ‘నేనే రాశాను, దానికి ఆధారం ఇది’ అని ఏ చరిత్రకారుడూ బయటపడి చర్చకు పెట్టడు. అజ్ఞాతంగా ఎవరో రాస్తారు. రసవత్తరంగా వుంది కదాని మనం లొట్టలు వేసుకుంటూ చదువుతాం, మరోడికి ఫార్వార్డ్ చేస్తాం.
ఇప్పుడీ సినిమా వచ్చాక ‘రాజమౌళి చాలా పరిశోధించి సినిమా తీశార్ట. అల్లూరి నిజంగానే బ్రిటిషు సైనికుడిగా పనిచేశాట్ట’ అని జనాలు అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను భారతపాత్రలపై వ్యాసాలు రాస్తూ వుంటే, కొందరు ‘భారతం చదివి రాయి’ అని వ్యాఖ్యలు రాస్తున్నారు, కింద నేను పుస్తకాల పేర్లు రాసినా! వాళ్లు టీవీ సీరియల్స్, సినిమాలు చూసి ఏర్పరచుకున్న భావాలకు విరుద్ధంగా నా వ్యాసాల్లో కనబడడం జీర్ణించుకోలేక పోతున్నారు. ఓ పదేళ్లకు అల్లూరి సైన్యంలో పనిచేయలేదు అని ఎవరైనా వ్యాసం రాస్తే యిలాటివాళ్లు యీ సినిమా చూపించి, అతనితో వాదనకు దిగుతారు.
ప్రజలకు ఔచిత్యంతో సంబంధం లేదు, తర్కంతో సంబంధం లేదు. ఎవరికీ తెలియనిదేదో నాకు తెలిసింది అనే ఉబలాటం కావాలి. వార్తలను, వ్యాఖ్యలను కలిపేసే ‘‘ఈనాడు’’ సంప్రదాయం గురించి నేను ఓసారి విమర్శిస్తే ఎవరో నాకు మెయిల్ రాశారు. ‘మీరు ఈనాడులో పనిచేసి ఉద్యోగం పోగొట్టుకున్నారని, అందుకే కసితో యిలా రాశారని మా స్నేహితుడు చెప్పేశాడు. అతనికి మీరు వ్యక్తిగతంగా తెలుసుట.’ అని. ఆ సదరు వ్యక్తి ఎవరో, ఎందుకలా చెప్పేస్తున్నాడో నాకు తెలియదు. అలా నమ్మేవాళ్లు నేను ఈనాడులో పనిచేయలేదు మొర్రో అని చెప్పుకున్నా వినకపోవచ్చు. అల్లూరి వచ్చి నేను ఏ బ్రిటిషు సైనికాధికారికి వంగివంగి దణ్ణాలు పెట్టలేదు అని చెప్పుకున్నా, ‘మాకు తెలుసులే, రాజమౌళి చెప్పాడు’ అనేయగలరు యీ బాపతు మనుష్యులు. ఒక మనిషి గురించి చెడు చెపితే నమ్మడానికి మనం ఎప్పుడూ రెడీగా వుంటాం.
అల్లూరిని బ్రిటిషు తొత్తుగా చూపిన రాజమౌళి కొమురం విషయంలో రిస్కు తీసుకోలేదు. ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టేసేవారేమో! అల్లూరిపై అపారమైన భక్తిశ్రద్ధలున్న తెలుగు జనం కూడా పెద్దగా రియాక్ట్ కావటం లేదు. అది రాజమౌళి అదృష్టం. అసలీ చిక్కులు లేకుండా వాళ్లకు ఆ పేర్లు పెట్టకుండా సినిమా తీయాల్సింది. ఏ పేరు పెట్టినా, సినిమా యిదే స్థాయిలో విజువల్ వండర్‌గా వుండేది. హిస్టారికల్ ఫిక్షన్‌లో యింకో టెక్నిక్కుంది. ఒకాయన బుస్సీ గురించి నవల రాయడానికి అతని సైన్యంలో పనిచేసినతని కథ అంటూ చారిత్రక నేపథ్యంలో ఫిక్షన్ రాశారు. ‘షాడో’ మధుబాబు ‘వీరభద్రారెడ్డి’ అని గోన గన్నారెడ్డి కాలపు నాటి వీరుడి గురించి రాస్తూ గన్నారెడ్డి లక్షణాలన్నీ పెట్టేశారు.
ఈ కథను యిలాగే రాము-భీము కథగా చూపించేసి, చివర్లో రాము అసలైన అల్లూరి వద్దకు వెళ్లి ఆయుధాలు అప్పగించినట్లు, భీము అసలైన కొమురం దగ్గరకి వెళ్లి నిజాంపై పోరాటంలో సేనాపతి అయినట్లు పెట్టేసి వుంటే ఏ చిక్కూ వుండేది కాదు. అసలైన అల్లూరి పాత్రను మన తెలుగుల పాటి ‘అల్లూరి’ కృష్ణగారి అబ్బాయి మహేష్ బాబు చేత, కొమురం భీమ్ పాత్రను ఏ ప్రభాస్ చేతో గెస్ట్ రోల్స్‌లో వేయిస్తే మరింత మజా వచ్చేది. ఈ బోడి సలహాలు ఎవడైనా చెప్పగలడు, నువ్వు రాజమౌళిలా సినిమా తీయగలవా? అని అడక్కండి. తీయడం ఆయన పని. మెచ్చుకోడం మీ పని. నొచ్చుకోడం నా పని.