నీకు టికెట్‌ వస్తుందో, లేదో చూసుకో!

అధికారం నుంచి టీడీపీ దిగిపోయినా, ఆ పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు మాత్రం స‌మ‌సిపోలేదు. పైగా ర‌చ్చ‌కెక్క‌డం టీడీపీని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అనంత‌పురం జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్‌కు టీడీపీ ముఖ్య నేత‌ల‌తో అస‌లు పొస‌గ‌డం…

అధికారం నుంచి టీడీపీ దిగిపోయినా, ఆ పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు మాత్రం స‌మ‌సిపోలేదు. పైగా ర‌చ్చ‌కెక్క‌డం టీడీపీని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అనంత‌పురం జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్‌కు టీడీపీ ముఖ్య నేత‌ల‌తో అస‌లు పొస‌గ‌డం లేదు. మాజీ మంత్రులు కాల్వ శ్రీ‌నివాసులు, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిల‌తో జేసీ బ్ర‌ద‌ర్స్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. తాడిప‌త్రి మున్సిపాలిటీని ద‌క్కించుకున్న జేసీ బ్ర‌ద‌ర్స్ సొంత పార్టీ నేత‌ల‌పై త‌ర‌చూ విరుచుకుప‌డ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

తాజాగా మ‌రోసారి తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి మ‌థ్య మాట‌ల తూటాలు పేలాయి. నువ్వొక మాటంటే, నేను ప‌ది మాట‌లు అంటా అనే రీతిలో ఇద్ద‌రి మ‌ధ్య డైలాగ్ వార్ టీడీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. అనంత‌పురం జిల్లా ఓడీ చెరువు మండలం కొండకమర్లలోని మాజీ ఎంపీపీ ఇస్మాయిల్‌ గృహ ప్రవేశానికి పార్టీ నేత సాకెం శ్రీనివాసరెడ్డితో కలసి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వెళ్లారు.

జేసీ మాట్లాడుతూ అనంత‌పురం జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు మరకలున్న నాయకులేనని, వారందరినీ చంద్రబాబు మార్చాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డికి టికెట్‌ ఇస్తే చంద్రబాబు సీఎం కాలేని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఏ మరకాలేని సాకెం శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉంటాడని, అతన్ని బలపర్చుతున్నట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు.  

ఆయనకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా టీడీపీ గెలుస్తుందన్నారు. కొత్త ముఖాలకు టికెట్ కేటాయించాలని చంద్ర‌బాబును ఆయ‌న కోరారు. తన కుమారుడి కంటే మంచివ్యక్తికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానని జేసీ ప్రభాకర్‌ ప్రకటించడం విశేషం. జేసీ వ్యాఖ్య‌లు అనంత‌పురం జిల్లాలో వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. అనంత‌పురం జిల్లాలో హిందూపురం, ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. వారితో పాటు తాను త‌ప్ప‌, మిగిలిన మాజీ ఎమ్మెల్యేలంతా రాజ‌కీయంగా మ‌ర‌క‌లున్న వారిగా జేసీ అభివ‌ర్ణించ‌డం పార్టీలో అగ్గి రాజేసింది.

జేసీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి  ఘాటుగా స్పందించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తిలో టీడీపీని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టికెట్‌ ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాడిపత్రిలో నీకు టికెట్ వస్తుందో, లేదో చూసుకోవాల‌ని జేసీ బ్ర‌ద‌ర్‌కు ప‌ల్లె హిత‌వు చెప్పారు. 

ఇతర నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే పార్టీకి ప్రమాదమ‌ని ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి హెచ్చ‌రించారు. ఏడోసారి కూడా తాను టీడీపీ బీ ఫారం తీసుకుంటానని ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి తేల్చి చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో మ‌రి!