ప్రపంచ చిత్ర పరిశ్రమలో ఆస్కార్ అవార్డుకు ప్రత్యేక స్థానం. అద్భుతంగా నటించిన లేదా తెరకెక్కించిన వారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించే క్రమంలో… ఆస్కార్ అవార్డ్‌కు అర్హులుగా పోలుస్తుంటారు. తాజాగా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లు మొక్కుబడిగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ దఫా మాత్రం పూర్వవైభవాన్ని గుర్తు తెచ్చేలా ఎంతో రిచ్‌గా నిర్వహించారు.
అయితే ఆస్కార్ అవార్డుకు ఏ మాత్రం తీసిపోని నటన ప్రదర్శించిన ఓ వ్యక్తి పేరు ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉత్తమ చిత్రంగా కోడా ఎంపికైంది. అలాగే ఉత్తమ నటిగా జెస్సీకా చాస్టెయిన్, ఉత్తమ నటుడిగా విల్ స్మిత్‌తో పాటు వివిధ విభాగాల్లో పలువురికి అవార్డులు దక్కాయి. ఇందులో సత్యకుమార్ అనే మహా నటుడి పేరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు.
ఏ రోటికి పోతే ఆ రోటి పదం పాడమన్న చందంగా బీజేపీ జాతీయ నాయకుడు సత్యకుమార్ వ్యవహారశైలి ఉంటోంది. తాజాగా విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి కదిలించే శక్తి, వ్యక్తి ఈ దేశంలో ఎవరూ పుట్టలేదని, పుట్టబోరని అన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉండాలన్నారు. అది రాష్ట్రానికి మధ్యలో ఉండాలన్నారు. అందుకే అమరావతి నుంచి రాజధాని కదిలించేందుకు ఎవరు ప్రయత్నించినా బీజేపీ అడ్డుకుంటుందన్నారు.
ఇదే బీజేపీ గతంలో కర్నూలు డిక్లరేషన్‌లో రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం సత్యకుమార్‌కు తెలియదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉండాలని, అది కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలనే సత్యకుమార్ సూత్రం దేశానికి వర్తించదా? అని ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దేశ రాజధానిని భారతదేశం మధ్యలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సత్యకుమార్ సూత్రీకరణ తెలియ జేస్తోందన్నారు. స్వార్థ ప్రయోజనాలతో ప్రాంతాలకు తగ్గటు మాట్లాడే సత్యకుమార్ లాంటి నాయకుల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సర్వనాశనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మహా నటుడికి ఆస్కార్ అవార్డు త్రుటిలో తప్పినట్టుందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.