ట్రేడ్ ఊహించినట్టుగానే మొదటి రోజు ఆదిపురుష్ సినిమా మెరిసింది. అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. స్వయంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. నైజాంలో 13 కోట్ల 68 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, ఆంధ్రాలో అటుఇటుగా 19 కోట్ల రూపాయలు సాధించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి ఆదిపురుష్ సినిమాకు 32 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి.
అటు నార్త్ బెల్ట్ లో కూడా ఆదిపురుష్ సినిమా మెరిసింది. 32 కోట్ల రూపాయల నెట్ సాధించింది. ఇక ఓవర్సీస్ లో ఆదిపురుష్ హవా స్పష్టంగా కనిపించింది. మొదటి రోజే ప్రీమియర్స్ తో కలిపి ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది.
ఆదిపురుష్ తో ప్రభాస్ స్టామినా మరోసారి ఎలివేట్ అయింది. అతడు నటించిన బాహుబలి-2, సాహో సినిమాలు మొదటి రోజే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో తొలి రోజే వంద కోట్లు సాధించిన మూడో చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. ఇలా ఫస్ట్ డేనే 3 సినిమాలతో వంద కోట్లు రూపాయల వసూళ్లు సాధించిన తొలి సౌత్ హీరో ప్రభాస్ మాత్రమే.
భారీ హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగడం, భారీ స్థాయిలో స్క్రీన్స్ కేటాయించడం లాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఆదిపురుష్ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకు తొలి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ టాక్ తో ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎన్ని వసూళ్లు సాధిస్తుందనేది చూడాలి. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ఆదిపురుష్.