ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణుకుమార్ రాజు అహంకారంతో కండకావర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో కడప, పులివెందుల వాసుల ప్రమోయంపై ఆయన అవాకులు చెవాకులు పేలి టీడీపీ నేతల మెప్పుదలకు యత్నించారు. బీజేపీలో ఉంటే రాజకీయ ఉనికి వుండదని చాలా కాలంగా టీడీపీలో చేరేందుకు విష్ణుకుమార్ రాజు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే టీడీపీలో టికెట్ ఇస్తామనే భరోసా ఇవ్వకపోవడంతో బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీలో వుంటూ టీడీపీ అనుకూల కామెంట్స్ చేస్తుంటారు. ఆ మధ్య ఎల్లో చానల్ ఇంటర్వ్యూలో బీజేపీ ఓటమిపై నేరుగా ప్రధానికే చెప్పానని నోరు పారేసుకోవడం, ఆ తర్వాత పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం తెలిసిందే. ఇలా ఆయన నోటికి హద్దూఅదుపూ వుండదు. ఈ విషయాన్ని మరోసారి ఆయన చాటుకున్నారు.
విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ కుమారుడి కిడ్నాప్ వెనుక కడప, పులివెందుల బ్యాచ్‌లున్నాయన్నారు. నాలుగు రోజుల ముందు నుంచి రుషికొండ ప్రాంతంలో సెల్‌ఫోన్ డేటా వెలికి తీస్తే మొత్తం వ్యవహారం బయట పడుతుందన్నారు. కడప, పులివెందుల, రాయలసీమలోని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను రౌడీలుగా, ఖూనీకోరులుగా, కబ్జాదారులుగా చిత్రీకరించడం ప్యాషన్‌గా మారింది. ఇదంతా రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కోలేక ప్రత్యర్థులు ఏకంగా రాయలసీమపై సాంస్కృతిక దాడి చేస్తున్నారని ఆ ప్రాంత సమాజం ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇదే రీతిలో ఆ మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ వాసులను అతి క్రూరంగా అభివర్ణించడంపై తీవ్ర నిరసన వ్యక్తం కావడం, ఆ తర్వాత తన మాటల్ని వెనక్కి తీసుకోవడం తెలిసిందే. సీమ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడే తన ప్రాంతంపై దుష్ప్రచారానికి తెర తీశారు. అదే కొనసాగుతోంది. ఇప్పుడు విష్ణుకుమార్‌రాజు యథేచ్ఛగా కడప, పులివెందుల బ్యాచ్‌లు అంటూ అవాకులు చెవాకులు పేలడంపై ఆ ప్రాంతం మండిపడుతోంది. కిడ్నాప్‌లు, హత్యలు చేసుకుంటూ, సీమకు అంటకట్టడం ఏంటని సీమ మేధావులు నిలదీస్తున్నారు.