జనసేనను నాయకత్వ కొరత పట్టి పీడిస్తోంది. జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నేతలు విరుచుకుపడుతుంటే, కనీసం దీటుగా కౌంటర్లు ఇవ్వడానికి చెప్పుకోతగ్గ నాయకులే లేరు. దీంతో వైసీపీ నేతలపై పవన్ ఒక్క విమర్శ చేస్తే, వాళ్లు వందమంది మీడియా ముందుకొచ్చి రాజకీయంగా చితక్కొడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు ఊపిరి తీసుకోలేని పరిస్థితి.
రాజకీయంగా పవన్‌ది దయనీయ స్థితి. పవన్‌ను దత్త పుత్రుడంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెటకరిస్తూ రాజకీయంగా పరువు తీస్తున్నారు. దత్త పుత్రుడనే విమర్శకు ఇంత వరకూ పవన్ నుంచి దీటైన సమాధానమే కొరవడింది. జగన్ ముద్దుగా పిలిచే దత్త పుత్రుడనే పేరు స్థిరపడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో దత్త పుత్రుడంటే పవన్‌ను గుర్తు తెచ్చుకునేంతగా జగన్ చేయగలిగారు.
సీఎం జగన్‌తో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు అడపాదడపా పవన్‌కల్యాణే కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే జనసేనలో ఆయనొక్కడే ఏకైక లీడర్. నాదెండ్ల మనోహర్, నాగబాబు లాంటి ఒకరిద్దరు నేతలున్నా, వైసీపీ నోర్మూయించగలిగే స్థాయిలో వీరి వాయిస్ ఉండడం లేదు. ఇక మిగిలిన నాయకులు నియోజకవర్గానికి ఎక్కువ, మండలస్థాయికి ఎక్కువ అన్నట్టుగా వుంది. గత పదేళ్ల పవన్ రాజకీయ ప్రస్థానంలో పవన్ సాధించిందేంటో ఆయనకే తెలియాలి. కనీసం తనపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తే, దీటుగా తిప్పికొట్టగలిగే నాయకులను కూడా పవన్ తయారు చేసుకోలేకపోయారు.
ఇదంతా పవన్ స్వయంకృతాపరాధం. పవన్ ఎవరినీ నమ్మరు. నమ్మి బాధ్యతలు అసలే అప్పగించరు. ఎవరికైనా పార్టీ పదవులు ఇస్తే అవినీతికి పాల్పడి చెడ్డ పేరు తీసుకొస్తారనే అనుమానమే జనసేన బలపడలేకపోవడానికి కారణంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీలో బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతున్నదో ఇప్పుడిప్పుడే పవన్‌కు అర్థమవుతూ వుంటుంది.